మహేశ్వరంలో కొత్త సిటీ..న్యూయార్క్​తో పోటీ పడేలా నిర్మిస్తం: సీఎం రేవంత్​రెడ్డి

మహేశ్వరంలో కొత్త సిటీ..న్యూయార్క్​తో పోటీ పడేలా నిర్మిస్తం: సీఎం రేవంత్​రెడ్డి
  • పర్యాటక కేంద్రంగా రాచకొండ గుట్టలు.. కులవృత్తులను కాపాడుతం
  • హయత్‌‌‌‌‌‌‌‌నగర్ దాకా మెట్రో..ఫార్మా భూముల్లో  వర్సిటీలు, పరిశ్రమలు
  • పౌరుషం, పోరాటానికి మారుపేరు గౌడన్నలు
  • వాళ్లకు ఎక్స్​గ్రేషియా బకాయిలు రూ. 7.90 కోట్లు విడుదల చేస్తం
  • సర్కార్​ జాగల్లో తాటి, ఈత చెట్లు పెంచుతం
  • బలహీనవర్గాలు పాలకులుగా మారాలంటే చదువే ఆయుధం
  • గత బీఆర్​ఎస్​ సర్కార్​ తెచ్చిందీ ఇచ్చింది..డ్రగ్స్, గంజాయి, అప్పులే
  • కాంగ్రెస్​ పని అయిపోయిందన్న వాళ్ల పరిస్థితి ఇప్పుడు ఏమైంది?
  • ప్రభుత్వాన్ని పడగొడ్తమని వాళ్లంటే నిలబెడ్తమని ఎమ్మెల్యేలు వస్తున్నరని వ్యాఖ్య
  • ‘కాటమయ్య రక్షణ కవచం’ కిట్ల పంపిణీ

హైదరాబాద్/రంగారెడ్డి, వెలుగు : రంగారెడ్డి జిల్లాకు మహర్దశ రాబోతున్న దని, న్యూయార్క్ సిటీతో పోటీ పడే స్థాయిలో మహేశ్వరంలో ఒక కొత్త నగరాన్ని నిర్మించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి చెప్పారు. త్వరలోనే హయత్ నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మెట్రోరైలు వస్తుందని, ఇందుకు సంబంధించి అన్ని ప్రణాళికలు పూర్తయ్యాయని అన్నారు. ఫార్మా కంపెనీల కోసం సేకరించిన భూముల్లో వివిధ వర్సిటీలను ఏర్పాటు చేస్తామని, మెడికల్ టూరిజం హబ్‌‌‌‌‌‌‌‌గా తయారు చేస్తామని ప్రకటించారు. ‘‘ఊటీ కంటే అద్భుతమైన రాచకొండ ప్రాంతాన్ని ఫిల్మ్ ఇండస్ట్రీకి, సినిమా షూటింగ్స్​కు అణువుగా మార్చబోతున్నం. ప్రపంచంలోనే అద్భుతమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతం” అని హామీ ఇచ్చారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెట్​ మండలం లష్కర్​గూడలో గౌడన్నలకు ‘కాటమయ్య రక్షణ కవచం’ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్​రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు పొన్నం ప్రభాకర్​, శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు, జూపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. తాటి చెట్ల దగ్గర గౌడన్నలతో సీఎం రేవంత్​రెడ్డి ముచ్చటించారు. సేఫ్టీ కిట్ల పనితీరు గురించి అడిగి తెలుసుకుని, పరిశీలించారు. 

గౌడన్నలకు చేయూత

గీత కార్మికులను ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, వారిని ఆపద నుంచి కాపాడేందుకు ఐఐటీ నిపుణులతో ‘కాటమయ్య రక్షణ కవచం(మోకులు)’ సేఫ్టీ కిట్లను తయారు చేయించామని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. ‘‘కులవృత్తులకు అన్ని విధాలా చేయూత అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. బలహీనవర్గాల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయం. పౌరుషానికి, పోరాటానికి మారుపేరు గౌడన్నలు. వాళ్లకు ప్రభుత్వం అండగా ఉంటుంది. ఎవరెస్టు ఎక్కిన స్ఫూర్తితో పూర్ణ టీం, హైదరాబాద్​ ఐఐటీ వాళ్లు ఈ సేఫ్టీ కిట్ల టెక్నాలజీని తీసుకురావడం అభినందనీయం.  వృత్తి నిర్వహణ సమయంలో గౌడన్నల భద్రతకు ఈ కిట్లు ఎంతో ఉపయోగపడ్తయ్​” అని వివరించారు.

కులవృత్తులను కాపాడుతామని సీఎం రేవంత్​  తెలిపారు. ప్రభుత్వ భూముల్లో తాటి, ఈత చెట్లు పెంచేలా చర్యలు చేపట్టేందుకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. వనమహోత్సవంలో భాగంగా తాటి, ఈత చెట్ల పెంపకం చేపట్టాలని మంత్రి జూపల్లికి సూచించినట్లు వెల్లడించారు. రియల్ ఎస్టేట్ వెంచర్లలోని రోడ్ల పక్కన, చెరువుగట్లు, కాలువ గట్ల దగ్గర తాటి, ఈత చెట్లు పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజల మనసుల్లోని మాట తాళ్లు, ఈదులల్ల కళ్లు తాగేటప్పుడే బయటపడుతుందని..  కాంగ్రెస్‌‌ను గెలిపించాలని గౌడన్నలు ప్రచారం చేశారని.. వారికి తాము రుణపడి ఉంటామని సీఎం రేవంత్​రెడ్డి చెప్పారు. కాంగ్రెస్‌‌లో గౌడ్స్‌‌కు సముచిత స్థానం ఉంటుందని, పొన్నం ప్రభాకర్‌‌‌‌కు మంత్రి పదవి, మహేశ్‌‌కుమార్‌‌‌‌గౌడ్‌‌కు ఎమ్మెల్సీ, శ్రీకాంత్‌‌గౌడ్‌‌కు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చామని వివరించారు. పార్టీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్‌‌గా మధుయాష్కీ గౌడ్‌‌ను నియమించామని తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన గీతకార్మికులకు ఇచ్చే ఎక్స్​గ్రేషియా బకాయలు రూ. 7.90 కోట్లు త్వరలోనే విడుదల చేస్తామని ఆయన ప్రకటించారు. 

పిల్లలను మంచిగా చదివించండి

చదువు ఒక్కటే బలహీనవర్గాలను పాలకులుగా తయారు చేయగలదని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. ‘‘బలహీనవర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ కృషి చేస్తున్నది. వైఎస్సార్​ హయాంలో ఫీజు రీయింబర్స్ మెంట్ తీసుకొచ్చారు. ఫీజు రీయింబర్స్ మెంట్ ను ముందుకు తీసుకెళ్లేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. కులవృత్తులపై ఆధారపడిన సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా.. మీ పిల్లలను ఉన్నత చదువులు చదివించండి. వాళ్లను ఉన్నతాధికారులుగా తీర్చిదిద్దండి. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో వారు భాగస్వాములు కావాలి. చట్టాలు రూపొందించే స్థాయికి మీ పిల్లలు ఎదగాలి. బలహీనవర్గాలు పాలకులుగా మారాలంటే  ఏకైక మార్గం చదువు మాత్రమే” అని ఆయన సూచించారు. 
గత సర్కార్​ తెచ్చింది.. ఇచ్చింది..

డ్రగ్స్, గంజాయి, అప్పులే

బీఆర్‌‌‌‌ఎస్ నాయకులు, ఆ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావని సీఎం రేవంత్​రెడ్డి మండిపడ్డారు. ‘‘ఓడిపోయి ఫామ్​హౌస్ లో ఉన్నోళ్లను నేను అడుగుతున్నా.. ఔటర్ రింగ్ రోడ్, ఫార్మా ఇండస్ట్రీ, అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ తెచ్చింది కాంగ్రెస్ కాదా? డ్రగ్స్, గంజాయి తప్ప మీరేం తెచ్చారు? కాంగ్రెస్ పని అయిపోయిందన్నవాళ్లు.. ఇప్పుడు వాళ్ల వైపు ఎంతమంది ఉన్నారని లెక్కపెట్టుకునే పరిస్థితి వచ్చింది” అని అన్నారు. గత బీఆర్​ఎస్ పాలకులు రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని, ఏ డిపార్ట్‌‌మెంట్‌‌లో చూసినా అప్పుల కాగితాలే కనిపిస్తున్నాయని, గత ప్రభుత్వం చేసిన అప్పులకు కోట్లకు కోట్లు మిత్తీలకే కట్టాల్సి వస్తున్నదని చెప్పారు. తాము ఒక్కొక్కటిగా అన్నీ సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు.. ఎల్బీ నగర్ నుంచి చంద్రాయణగుట్ట వరకు త్వరలో మెట్రో రాబోతున్నదని వెల్లడించారు. 

కాంగ్రెస్​కు మద్దతుగా వస్తున్నరు

తెలంగాణ అభివృద్ధి కోసం కాంగ్రెస్ కు మద్దతుగా బీఆర్​ఎస్ ఎమ్మెల్యేలు వస్తున్నారని సీఎం రేవంత్​రెడ్డి చెప్పారు. ‘‘మీరు(బీఆర్​ఎస్ పెద్దలు) ప్రభుత్వాన్ని పడగొడతామంటే.. ప్రభుత్వాన్ని నిలబెట్టాలని వాళ్లు (ఎమ్మెల్యేలు) మద్దతుగా వస్తున్నరు. పదేండ్లు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటది ” అని ఆయన తెలిపారు. కార్యక్రమం అనంతరం గీత కార్మికులతో కలిసి సీఎం రేవంత్​రెడ్డి భోజనం చేశారు. అంతకుముందు, లష్కర్‌‌‌‌గూడ తాటివనంలో ఈత మొక్కలను నాటారు. ఎవరెస్ట్​ అధిరోహించిన మాలోత్​ పూర్ణ తదితరులను కార్యక్రమంలో సీఎం అభినందించారు.   

గౌడ్​ సాబ్​.. దావత్​ ఇయ్యాలె

సేఫ్టీ కిట్లు ఎట్ల పనిచేస్తున్నాయని గీతకార్మికులను సీఎం రేవంత్​రెడ్డి అడిగి తెలుసుకున్నారు. ‘కాటమయ్య కిట్ల’తో తాటి చెట్లు ఎక్కిన గౌడన్నలతో ఆయన ముచ్చటించారు. ‘‘గౌడ్ సాబ్​..  నీ యెల్లో టీషర్ట్​ బాగుంది” అంటూ గీత కార్మికుడు కృష్ణయ్యతో అన్నారు. ‘‘ఒక్కొక్కరు రోజుకు ఎన్ని చెట్లు ఎక్కుతరు?” అని సీఎం ఆరా తీయగా.. ‘‘పొద్దుగాల 15 చెట్లు.. పొద్దూకి 15 చెట్లు” అని ఓ గీత కార్మికుడు బదులిచ్చాడు. ‘‘మీకు ఏమేం కావాల్నో మీరే చెప్పున్రి. ప్రభుత్వం అండగా ఉంటది” అని సీఎం అడుగగా.. పలువురు గీతకార్మికులు తమ సమస్యలను చెప్పుకున్నారు. తాటి వనాలను పెంచేందుకు ప్రోత్సహించాలని, ఇందుకోసం గ్రామంలో 5 ఎకరాలు కేటాయించాలని, తాటి వనాలకు వెళ్లేందుకు మోటర్​ సైకిళ్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. చివరగా.. ‘‘గౌడ్​ సాబ్​.. ఇది(సేఫ్టీ కిట్లు) కనిపెట్టినోళ్లకు ఏమైనా దావత్ ఇచ్చిన్రా లేదా? దావత్ ఇయ్యాలే.. కచ్చితంగా” అని సీఎం రేవంత్​రెడ్డి నవ్వుతూ అన్నారు. 

గౌడన్నల బాధ నాకు తెలుసు: మంత్రి పొన్నం

గౌడ వృత్తి, కులం నుంచి వచ్చిన వాడిని కాబట్టి గౌడన్నల బాధ తనకు తెలుసని, అందుకే సేఫ్టీ కిట్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశామని, దీనితో తన జీవితం ధన్యమైందని మంత్రి పొన్నం ప్రభాకర్​ అన్నారు. ‘‘రాను రాను తాటి, ఈత వనాలు అంతరించి పోతున్నయ్​. ఆ వనాలను  రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. దానికి సీఎం ఆలోచన చేయాలని కోరుతున్న. ప్రభుత్వ భూముల్లో రోడ్ల పక్కన కానీ తాటి,ఈత చెట్లను పెట్టె విధంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలి. ప్రమాదాలతో మృతిచెందిన గీతకార్మికుల కుటుంబాలకు  రావాల్సిన బకాయి రావాల్సి ఉంది. వాటిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్న” అని తెలిపారు. 

బలహీనవర్గాల సంక్షేమం లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు 

బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి శ్రీధర్​బాబు అన్నారు.  గీత కార్మికుల కోసం ఈ కార్యక్రమం తీసుకురావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. పిల్లలను బాగా చదివించాలని సూచించారు.

గీతకార్మికులకు లబ్ధి చేకూరుస్తం: మంత్రి జూపల్లి

అన్నివర్గాల వారిని ఆదుకునేందుకు ప్రభు త్వం కృషి చేస్తున్నదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గీత కార్మికులకు లాభసాటిగా ఉండేలా పలు కార్యక్రమాలు చేపడుతామని చెప్పారు. ప్రమాదానికి గురై మరణించిన గీత కార్మికులకు రూ. 5 లక్షలు ఇస్తామని తెలిపారు.