హెల్త్ ప్రొఫైల్​ను డిజిటలైజ్ చేస్తాం : సీఎం

హెల్త్ ప్రొఫైల్​ను డిజిటలైజ్ చేస్తాం : సీఎం
  • మెరుగైన విద్య, వైద్యం అందించడమే లక్ష్యం: సీఎం
  • డీడీహెచ్​లో రెనోవా క్యాన్సర్ సెంటర్ ప్రారంభం

ముషీరాబాద్, వెలుగు: క్యాన్సర్ ట్రీట్​మెంట్ పేదల కు భారంగా మారుతున్నదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. క్యాన్సర్​కు సంబంధించిన వైద్య సేవలు అందరికీ అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపారు. హెల్త్ రికార్డులు లేకపోవడంతో తరుచూ టెస్టులు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తున్నదన్నారు. అందుకే రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్​ను డిజిటలైజ్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

హైదరాబాద్ విద్యానగర్​లోని దుర్గాబాయి దేశ్​ముఖ్ హాస్పిటల్ (డీడీహెచ్)లో రెనోవా క్యాన్సర్ సెంటర్​ను వైద్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీతో కలిసి సీఎం రేవంత్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. త్వరలో డిజిటల్ హెల్త్ కార్డులను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తుందన్నారు.

ప్రజలకు సేవ చేసేందుకు గుర్తింపు పొందిన ఎన్జీవో ఆర్గనైజేషన్లతో త్వరలో వైద్య శాఖ మంత్రి సమావేశం ఏర్పాటు చేస్తారని తెలిపారు. మెరుగైన వైద్యం అందించే ప్రక్రియలో అందరినీ భాగస్వాములను చేస్తామన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగ అభివృద్ధే తమ ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. ప్రజలకు సేవ చేసేందుకు రెనోవా హాస్పిటల్ ముందుకు రావడం అభినందనీయమని అన్నారు.