
పెద్దపల్లి, వెలుగు : సరస్వతి పుష్కరాల ఆహ్వాన ఫ్లెక్సీల్లో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఫొటో పెట్టకుండా, ప్రోటాకాల్ పాటించని వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్బంగా పలువురు నాయకులు మాట్లాడుతూ సరస్వతి పుష్కరాల సందర్భంగా దేవాదాయ శాఖ అధికారికంగా ఏర్పాటు చేసిన ఆహ్వాన ఫ్లెక్సీల్లో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఫొటో కావాలనే పెట్టలేదని ఆరోపించారు.
దళిత ఎంపీ కావడం వల్లే వివక్ష చూపిస్తున్నారని మండిపడ్డారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిని విధుల నుంచి తప్పించడంతో పాటు వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు బొంకూరి కైలాసం, చంద్రమౌళి, కుమార్, అమరజ్యోతి, మహేశ్, లచ్చన్న, శంకర్, ప్రశాంత్, కరుణాకర్ పాల్గొన్నారు.
శ్రీధర్‌బాబు తీరు సరికాదు
హైదరాబాద్‌సిటీ, వెలుగు : సరస్వతీ పుష్కరాల ప్రారంభోత్సవానికి ఎంపీ గడ్డం వంశీకృష్ణను ఆహ్వానించకపోవడం వెనుక మంత్రి శ్రీధర్‌బాబు, దేవాదాయ శాఖ కార్యదర్శి శైలజా రామయ్యర్ హస్తం ఉందని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు, మాల సంఘాల జేఏసీ చైర్మన్ జి.చెన్నయ్య ఆరోపించారు. హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగాన్ని కాపాడుతామని, రాజ్యాంగం ప్రకారం దేశ ప్రజలంతా సమానమని రాహుల్‌గాంధీ చెబుతుంటే... శ్రీధర్‌బాబు మాత్రం దళితులు వేరు, తాము వేరు అనే రీతిలో ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.
దళితులను అవమానించిన శ్రీధర్‌బాబుపై హైకమాండ్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుల వెంకటేశ్వర్లు, ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాడారం వినయ్‌కుమార్, భానుప్రకాశ్, వెంకటేశ్, రమేశ్
పాల్గొన్నారు.