
- మహావృక్షం చరిత్రను వివరించిన ఆఫీసర్లు
- హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్, ఎక్స్‌పీరియం పార్కు విజిట్
హైదరాబాద్/చేవెళ్ల/ మహబూబ్‌నగర్, వెలుగు: దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన మహబూబ్‌నగర్ జిల్లా పిల్లలమర్రిలోని ఊడల మర్రి (మహా వృక్షం)ని చూసి మిస్‌వరల్డ్2025 కంటెస్టెంట్లు ఫిదా అయ్యారు. శుక్రవారం మూడు ప్రదేశాలను వారు సందర్శించారు. సాయంత్రం 22 మంది అందగత్తెలు పిల్లలమర్రికి వెళ్లారు. సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు షెడ్యూల్ నిర్ణయించగా.. దాదాపు 8.10 గంటల వరకు వీరి పర్యటన సాగింది. కంటెస్టెంట్లు సాయంత్రం 4.54 గంటలకు టూరిజం శాఖ ప్రత్యేక బస్సులో పిల్లలమర్రికి చేరుకున్నారు. వారిని పాలమూరు కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ డి.జానకి రిసీవ్ చేసుకున్నారు. వారి వెంట పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు.
పిల్లలమర్రి సందర్శన అనంతరం కంటెస్టెంట్లు 16వ శతాబ్ద కాలం నాటి రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. అక్కడి నుంచి మ్యూజియంకు చేరుకొని వివిధ శిల్పాలను పరిశీలించారు. అలాగే, మహావృక్షం వద్ద ఏర్పాటు చేసిన చేనేత స్టాల్ లోగద్వాల, నారాయణపేటలో తయారు చేసిన చీరలను పరిశీలించారు. తర్వాత అక్కడే జిల్లాకు చెందిన స్టూడెంట్లతో చిట్ చాట్‌లో పాల్గొన్నారు. మ్యూజియం నుంచి బయటకు వచ్చి స్థానిక మహిళలు పేర్చిన బతుకమ్మల వద్ద బతుకమ్మ ఆడారు. అనంతరం 22 మంది కంటెస్టెంట్లకు చేనేత కార్మికులు తయారు చేసిన పట్టు వస్ర్తాలు, పిల్లలమర్రి ఫొటోతో ఉన్న మెమెంటోను అందజేసి మంత్రి జూపల్లి, ఎమ్మెల్యేలు సత్కరించారు. అనంతరం స్టాల్స్‌ను సందర్శించి.. 8 గంటల ప్రాంతంలో తిరిగి హైదరాబాద్‌కు బయల్దేరి వెళ్లారు.
ఏఐజీ హాస్పిటల్ సందర్శన
హెల్త్ టూరిజంలో భాగంగా హైదరాబాద్లోని గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్స్‌ను శుక్రవారం మిస్‌వరల్డ్ కంటెస్టెంట్లు సందర్శించారు. ఆఫ్రికా గ్రూప్ నుంచి 25 మంది కంటెస్టెంట్లు వెళ్లగా వారికి ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం అందగత్తెలు అక్కడ చికిత్స పొందుతున్న చిన్నారులను ఆప్యాయంగా పలకరించి వారిలో ధైర్యం నింపారు. తర్వాత ఆస్పత్రిలోని సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారిని నాగేశ్వర్ రెడ్డి సన్మానించారు.
నేడు గచ్చిబౌలి స్టేడియంలో స్పోర్ట్స్ ఫినాలే..
మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా శనివారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో కంటెస్టంట్లకు స్పోర్ట్స్ ఫినాలే కార్యక్రమం ఉంటుంది. ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్నాహ్నం వరకు స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తారు. ఈవెంట్ లో స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులు పాల్గొననున్నారు. అనంతరం సాయంత్రం అందాల భామలు రామోజీ ఫిల్మ్ సిటీని సందర్శించనున్నారు.
ఎక్స్‌పీరియం పార్కులో అందగత్తెల సందడి
మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు శుక్రవారం రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం పొద్దుటూర్ శివారులోని ఎక్స్‌పీరియం ఎకో ఫ్రెండ్లీ పార్కును విజిట్చేశారు. 250 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ఎకో పార్కులో 85 దేశాల నుంచి తీసుకొచ్చి పెంచుతున్న అరుదైన మొక్కలు, వృక్ష జాతులు, శిల్పకళా సంపదను వీక్షించి ఆశ్చర్యపోయారు. తర్వాత ఎకో మోటార్ వెహికల్లో ఎక్కి పార్కును వీక్షించారు. ఈ సందర్భంగా మిస్ కెనడా ఎమ్మా మోరిసన్ మాట్లాడుతూ.. ఈ ప్రదేశం అద్భుతంగా ఉందని, తన తల్లిదండ్రులతో కలిసి త్వరలో హైదరాబాద్‌ను విజిట్చేయాలని అనుకుంటున్నానని చెప్పారు.
మిస్ యూఎస్అథెన్నా క్రాస్బీ మాట్లాడుతూ.. భూమిని రక్షించడం మన బాధ్యత అని, ఆలోచనాత్మకమైన డిజైన్ ద్వారా మనం ప్రకృతితో సామరస్యంగా జీవించగలమని ఎక్స్‌పీరియం పార్కు నిరూపిస్తోందని అన్నారు. ‘ఇది చాలా గొప్ప అనుభవం.’ అని మిస్ బ్రెజిల్ జెస్సికా పెడ్రోసో అన్నారు. మిస్ గయానా జాలికా శామ్యూల్స్ మాట్లాడుతూ.. నేటి ఆధునిక ప్రపంచంలో, స్థిరత్వం కీలకమని ఎక్స్‌పీరియం అద్భుతాన్ని సృష్టిస్తూనే ప్రకృతిని అందంగా సంరక్షిస్తుందన్నారు. అంతకుముందు అందాలభామలకు పెద్దఎత్తున డోలు సంప్రదాయ వాయిద్యాలతో స్వాగతం పలికారు నిర్వాహకులు.