
- బీఆర్‌ఎస్ హయాంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 29 చెక్‌డ్యామ్‌ల నిర్మాణం
- కట్టిన వెంటనే కొన్ని, కడుతుండగానే మరికొన్ని కొట్టుకుపోయినయ్
- అయినా కాంట్రాక్టర్లకు రూ. 287 కోట్లు చెల్లించిన గత సర్కార్
- విచారణకు ఆదేశించిన ప్రభుత్వం
పెద్దపల్లి, వెలుగు: బీఆర్‌ఎస్ హయాంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కొట్టుకుపోయిన చెక్‌డ్యామ్‌ల నిర్మాణ పనులపై ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించింది. 2018లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 114 చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి ప్రపోజల్స్ సిద్ధం చేశారు. మానేరు నదిపై 57 నిర్మాణాలకు అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం అనుమతులు ఇవ్వగా.. ఇందులో 29 చెక్‌డ్యామ్‌ల నిర్మాణం పూర్తయింది. ఈ పనుల కోసం రూ.287 కోట్లను కాంట్రాక్టర్లకు చెల్లించారు. అయితే నిర్మించిన కొన్నాళ్లకే కొన్ని కొట్టుకుపోగా, మిగిలినవి నిర్మాణంలో ఉండగానే వరద ధాటికి ధ్వంసమయ్యాయి. దీంతో కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా అయింది. అయితే డిజైనింగ్ లోపం, నాసిరకం పనుల వల్లే చెక్‌డ్యామ్‌లు కొట్టుకుపోయాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న కాంగ్రెస్ సర్కార్ విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేసింది. దీంతో కాంట్రాక్టర్లు, ఇంజినీర్లలో టెన్షన్ మొదలైంది.
పెద్దపల్లి జిల్లాలోనే ఎక్కువ
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిర్మించిన చెక్‌డ్యామ్‌లలో పెద్దపల్లి జిల్లాలోనే అత్యధికంగా 22 ఉన్నాయి. జిల్లాలో మానేరు వాగుపై నిర్మించతలపెట్టిన 18 చెక్‌డ్యామ్‌లు, హుస్సేన్‌మియా వాగుపై నాలుగు చెక్‌డ్యామ్‌ల కోసం అప్పటి ప్రభుత్వం సుమారు రూ. 300 కోట్లతో ప్రపోజల్స్ రెడీ చేసింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గొల్లపల్లి, నీరుకుల్ల, గట్టెపల్లి, కదంబాపూర్, తొగర్రాయి, ఓదెల మండలం కనగర్తి, పొత్కపల్లి, ఇందుర్తి, రూప్‌నారాయణపేట, గుంపుల, కాల్వ శ్రీరాంపూర్ మొట్లపల్లి, కిష్టంపేట, ముత్తారం మండలం ఓడేడ్, ఖమ్మంపల్లి, అడవి శ్రీరాంపూర్, మంథని మండలం అడవిసోమన్‌పల్లి, చిన్నోదాల, గోపాలపూర్, హుస్సేన్‌మియా వాగుపై కాల్వ శ్రీరాంపూర్, చిన్నరాత్‌పల్లి, మడిపల్లి, ఓడెడ్, మంథనిలో బొక్కలవాగుపై చెక్‌డ్యామ్‌లు నిర్మించాలని నిర్ణయించారు. 2020లో టెండర్ల ప్రక్రియ పూర్తి కాగా అగ్రిమెంట్ ప్రకారం చెక్‌డ్యామ్‌లన్నీ గత సర్కార్ హయాంలోనే పూర్తి కావాలి. కానీ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణాలోపంతో పనులు పూర్తి కాలేదు. ఐదారు చెక్‌డ్యామ్‌ల పనులు పూర్తయినా అవి కూడా వరదల ధాటికి కొట్టుకుపోయాయి.
కరీంనగర్‌లో ఐదు చెక్‌డ్యామ్‌లు
కరీంనగర్ జిల్లాలోని బొమ్మకల్, గోపాల్‌పూర్, ముగ్ధుంపూర్, ఇరుకుల్ల, మందులపల్లి వద్ద చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం ఒక్కో చెక్‌డ్యామ్ నిర్మాణానికి రూ. 18 కోట్ల చొప్పున కేటాయించారు. వర్షాలు కురిసినప్పుడు లోయర్ మానేరు డ్యామ్ నుంచి ఎన్ని నీళ్లు కిందికి వదిలి పెడుతారు ? దాని ప్రవాహం ఏ మేరకు ఉంటుందో అంచనా వేసి వరద తట్టుకునేలా చెక్‌డ్యామ్ నిర్మించాల్సి ఉంది. కానీ ఇదేమి పట్టించుకోకుండా బొమ్మకల్ వద్ద 1.70 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని తట్టుకునేలా చెక్‌డ్యామ్ నిర్మించారు. 2021 సెప్టెంబర్‌లో వచ్చిన వర్షానికి సుమారు 2.30 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల కావడంతో ఈ చెక్‌డ్యామ్ ముక్కలైంది. అదే ఏడాది మరోసారి కురిసిన భారీ వర్షానికి మిగతా నాలుగు చెక్‌డ్యామ్‌లు సైతం కొట్టుకుపోయాయి.
సిరిసిల్ల జిల్లాలో రెండు..
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం శివారులో నెహ్రూ నగర్ వద్ద మానేరు వాగుపై నిర్మించిన చెక్‌డ్యామ్ కొన్ని రోజులకే కొట్టుకుపోయింది. ఈ చెక్‌డ్యామ్ నిర్మాణానికి రూ. 14.46 కోట్లతో టెండర్లు ఆహ్వానించగా.. రూ. 10.93 కోట్లకే ఓ కాంట్రాక్టర్ పనులు దక్కించుకున్నారు. కానీ సదరు కాంట్రాక్టర్ క్వాలిటీ పాటించకపోవడంతో మొదటి సారి వచ్చిన వరదకే చెక్‌డ్యామ్ ధ్వంసమైంది. ఇదే తరహాలో రూ. 11.98 కోట్లతో సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కస్బెకట్కూరు వద్ద నిర్మించిన చెక్‌డ్యామ్ సైతం వరదపాలైంది.
అవగాహన లేని ఇంజినీరింగ్.. నాసిరకం పనులు
మానేరు నదిపై చెక్‌డ్యామ్‌లు కొట్టుకుపోవడానికి ఇంజనీర్ల అవగాహనాలోపమే ప్రధాన కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మానేరు నది వెడల్పు సుమారు కిలోమీటర్‌పైన ఉంటుంది. అంత వెడల్పులో వాటర్ఫ్లోటింగ్కు అడ్డుకట్ట వేసి నీటిని నిల్వ చేయాలంటే సరైన ప్రణాళిక అవసరం. కానీ అలాంటి చర్యలేవీ తీసుకోకుండానే పనులు మొదలుపెట్టారు. వాగుపై నిర్మించే ఆఫ్రాన్‌లకు సపోర్టుగా బెడ్ నిర్మాణాన్ని ఇసుక మీదే నిర్మించారు. దీంతో వరద తీవ్రతకు చెక్‌డ్యామ్‌లన్నీ కొట్టుకుపోయాయని ఎక్స్ పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.