
- యాసంగి టార్గెట్ 4.50 లక్షల టన్నులు
- సర్కారు కొన్నది 2.37 లక్షల టన్నులే
యాదాద్రి, వెలుగు : యాసంగి సీజన్ వడ్ల కొనుగోళ్లలో సర్కారుతో మిల్లర్లు, బ్రోకర్లు పోటీపడుతున్నారు. కొనుగోలు చేసిన వడ్లకు సర్కారు నుంచి పేమెంట్ స్పీడ్‌గానే వస్తున్నా.. సెంటర్లలో రోజుల తరబడి వెయిట్ చేయలేని రైతులు ప్రైవేట్‌గా అమ్ముకుంటున్నారు. దీంతో సర్కారు కొన్న వడ్లతో సమానంగా ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు.
2.80 లక్షల ఎకరాల్లో వరి సాగు..
ఈ యాసంగి సీజన్లో జిల్లావ్యాప్తంగా 2.80 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఈ సీజన్లో ఎక్కువగా దొడ్డు రకం పండిస్తున్నందున 7 లక్షల టన్నుల వరకు దిగుబడి వస్తుందని ఆఫీసర్లు అంచనా వేశారు. ఈ మేరకు జిల్లాలో 375 కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇందులో సన్న వడ్ల కొనుగోలు కోసం 50 సెంటర్లు ఏర్పాటు చేశారు. అయితే 2 లక్షల టన్నులకు పైగా మిల్లర్లు కొనుగోలు చేసే అవకాశం ఉందని భావించిన ఆఫీసర్లు, కొనుగోలు సెంటర్లకు వచ్చే 4.50 లక్షల టన్నులు కొనుగోలు చేస్తామని చెప్పారు. అయితే వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి.
2.37 లక్షల టన్నులే..
ఇటీవల తరచూ కురుస్తున్న వానల కారణంగా వడ్లలో తేమ శాతం పెరగడంతో కొనుగోలులో ఆలస్యం జరుగుతోంది. హమాలీల కొరత కారణంగా మిల్లుల వద్దకు వెళ్లిన లారీలు అక్కడ వెయిట్ చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని సెంటర్లలో మూడు వారాలు గడుస్తున్నా ఇంకా పెద్ద సంఖ్యలో వడ్ల కుప్పలు ఉన్నాయి. దీంతో సెంటర్లు ఏర్పాటు చేసి 45 రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు 2.37 లక్షల టన్నులు కొనుగోలు చేశారు.
2 లక్షల టన్నుల వరకు..
వరి కోతల ప్రారంభం నుంచే మిల్లర్లు, బ్రోకర్లు రంగంలోకి దిగారు. మొదట్లో క్వింటాల్‌కు రూ.2 వేలకు చెల్లించారు. ఆ తర్వాత క్రమేపీ తగ్గిస్తూ వడ్లు క్వింటాల్‌కు రూ.1800 ఇస్తున్నారు. అయితే ఐకేపీ, పీఏసీఎస్ సెంటర్లలో రోజుల తరబడి వడ్ల కుప్పలు పోసుకొని కూర్చున్నా.. కొనుగోళ్లు స్పీడ్ గా జరగడం లేదు. కొనుగోలు చేస్తున్న వడ్లకు సివిల్ సప్లయ్ డిపార్ట్మెంట్ పేమెంట్తొందరగానే ఇస్తోంది. అయితే తేమ, తాలు శాతంతో సంబంధం లేకుండా మిల్లర్లు, బ్రోకర్లు ధాన్యం కొనుగోలు చేస్తుండడంతో మద్దతు ధరకు రూ.530 తక్కువగా ఇస్తున్నా రూ.1800కు క్వింటాల్ చొప్పున రైతులు అమ్ముకుంటున్నారు. ఈ విధంగా ఇప్పటివరకు దాదాపు 2 లక్షల టన్నుల వరకు ప్రైవేట్‌గా వడ్ల అమ్మకాలు జరిగాయని తెలుస్తోంది. పైగా ఇక్కడి మిల్లర్లు కొందరు పక్క జిల్లాలకు వెళ్లి వడ్లు కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
నెలాఖరులోగా కంప్లీట్..
ప్రారంభించిన సెంటర్లలో ఇప్పటికే 84 సెంటర్లు మూతపడ్డాయి. మూతపడిన సెంటర్లలో సన్న బియ్యం కోసం ఏర్పాటు చేసినవే ఎక్కువగా ఉన్నాయి. సెంటర్లలో ఇంకా లక్ష టన్నుల వడ్లు ఉన్నాయని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. నెలాఖరులోగా వడ్ల కొనుగోళ్లు కంప్లీట్అవుతాయని ఆఫీసర్లు భావిస్తున్నారు. ఈ సీజన్లో 4.50 లక్షల టన్నులు కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నా.. జరుగుతున్న ఈ పరిణామాల కారణంగా ఇప్పటివరకూ కొనుగోలు చేసిన 2.37 లక్షల టన్నుల వడ్లకు అదనంగా సెంటర్లలో ఉన్న లక్ష టన్నులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.