
- క్షేత్రస్థాయిలో కలెక్టర్లు పర్యటించండి
- జగిత్యాల ఐడీవోసీలో మంత్రి పొంగులేటి రివ్యూ
- పాల్గొన్న ప్రభుత్వ విప్ లు, ఎమ్మెల్యే, కలెక్టర్లు
జగిత్యాల, వెలుగు: రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా మానవీయ కోణంలో భూ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర రెవెన్యూ,గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. జగిత్యాల జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన శుక్రవారం రాత్రి పట్టణంలోని ఐడీవోసీ ఆఫీసులో భూభారతి రెవెన్యూ సదస్సుల నిర్వహణ, భూ సమస్యల పరిష్కారం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్‌కు ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు పమేలా సత్పతి, సత్యప్రసాద్, సందీప్‌కుమార్‌ఝా, శ్రీహర్ష పాల్గొన్నారు. పైలట్ మండలాల్లో రెవెన్యూ సదస్సులు జరుగుతున్న తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ భూసమస్యలు తెలుసుకోవాలని అన్నారు.
రెవెన్యూ సదస్సుల్లో ప్రజల నుంచి వచ్చిన భూసమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. అదేవిధంగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల పరిష్కారానికి కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. ఉమ్మడి జిల్లా కలెక్టర్లు సమన్వయంతో పనిచేస్తూ రెవెన్యూ అధికారుల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ఉమ్మడి జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు త్వరితగతిన చేపట్టాలని ఆదేశించారు. శుక్రవారం జగిత్యాలలో బస చేయనున్న మంత్రి పొంగులేటి శనివారం ఉదయం జగిత్యాల జిల్లాలోని భూభారతి పైలట్ మండలం ఆయన బుగ్గారం లో నిర్వహించే రెవెన్యూ సదస్సుకు హాజరు కానున్నారు.
మా పని అయిపోయింది.. మీరే ఏలుకోండి: జీవన్‌రెడ్డి
జగిత్యాలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాగా మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి జిల్లాలో ఇసుక స్టాక్ పాయింట్ ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేశారు. మంత్రి ఆయనను ఆలింగనం చేసుకునేందుకు రాగా జీవన్‌రెడ్డి వెనుకడుగు వేశారు. అనంతరం మంత్రి పొంగులేటి వెళ్లిపోగా.. అక్కడున్న వారిని ఉద్దేశించి తమ పని అయిపోయిందని, రాజ్యాన్ని మీరే ఏలుకోండి అంటూ వ్యాఖ్యానించారు.