కాకా మార్గంలోనే మా అడుగులు.. నాడు కాంగ్రెస్​ పార్టీ ఆఫీసు కోసం సొంత ఇంటినే ఇచ్చేసిండు: సీఎం రేవంత్ రెడ్డి

కాకా మార్గంలోనే మా అడుగులు.. నాడు కాంగ్రెస్​ పార్టీ ఆఫీసు కోసం సొంత ఇంటినే ఇచ్చేసిండు: సీఎం రేవంత్ రెడ్డి
  • 80 వేల మంది పేదోళ్లకు ఇండ్లు ఇచ్చిన మహనీయుడు
  • జి.వెంకటస్వామి 95వ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్​
  • కాకా ఆలోచనలు, ఆశయాలకు మనమంతా వారసులం
  • రాష్ట్రాభివృద్ధిలో ఆయన కుటుంబ సహకారం తీసుకుంటామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: పేదల సంక్షేమం కోసం తుదిశ్వాస వరకు కాకా జి.వెంకటస్వామి కృషి చేశారని, ఆయన మార్గంలోనే తాము అడుగులు వేస్తున్నామని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. నిలువ నీడ లేనివారికి ఇండ్లు ఇచ్చిన పేదల పక్షపాతి కాకా అని కొనియాడారు. రాష్ట్రాభివృద్ధిలో కాకా కుటుంబం నుంచి సంపూర్ణ సహకారం తీసుకుంటామని చెప్పారు.‘‘పేదలకు సేవ చేయాలన్న కాకా ఆలోచనలకు, ఆశయాలకు మనమందరం వారసులం. ఆయన ఆలోచనలతోనే ప్రభుత్వం నడుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల్లో కాకా కుటుంబసభ్యుల పాత్ర ప్రముఖంగా, క్రియాశీలకంగా ఉంటుంది” అని సీఎం తెలిపారు. కేంద్ర మాజీ మంత్రి వెంకటస్వామి (కాకా) 95వ జయంతి వేడుకలను శనివారం హైదరాబాద్​ రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. 

ఇందులో సీఎం రేవంత్​రెడ్డి చీఫ్​ గెస్ట్​గా పాల్గొన్నారు. కాకా చిత్ర పటం వద్ద పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. ‘‘కాకా అంటే ప్రజల ఆస్తి. పేదోళ్ల ధైర్యం. నిలువ నీడలేనివారికి అండగా నిలబడిన మహామనిషి ఆయన” అని తెలిపారు. జాతీయ స్థాయిలో నెహ్రూను చాచా అని పిలిస్తే.. తెలుగు రాష్ట్రాల్లో అదే ఆత్మీయతతతో కాకా అని పిలుచుకునేది వెంకటస్వామిని మాత్రమేనని సీఎం అన్నారు. ‘‘ఆ రోజుల్లోనే 80 వేల మంది పేదలకు గుడిసెలు ఇప్పించిన గొప్ప వ్యక్తి కాకా. కొందరు నేతలు ఒక్క ఇల్లు ఇప్పిస్తేనే పేదల జీవితాలు బాగుచేసినట్లు, వడ్డించినట్లు, తినిపించినట్లు గొప్పలు చెప్పుకుంటారు. అలాంటిది 80 వేల మందికి ఇండ్లు ఇచ్చిన కాకా సేవాగుణాన్ని ఏమనాలి. అలాంటి గొప్ప వ్యక్తి కాకాను గత పాలకులు మర్చిపోవటం వాళ్ల బాధ్యతరాహిత్యానికి నిదర్శనం” అని ఆయన అన్నారు.

కాంగ్రెస్​ పార్టీ ఆఫీస్​కు ఇల్లు ఇచ్చిండు

ఎమర్జెన్సీ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆఫీస్  ఎక్కడ ఏర్పాటు చేయాలన్న చర్చ వస్తే.. ఇందిరాగాంధీ దగ్గరికి వెళ్లి తన ఇల్లు ఇస్తున్నట్లు ప్రకటించిన నాయకుడు కాకా వెంకటస్వామి అని సీఎం రేవంత్​ కొనియాడారు. 1970 నుంచి ఇప్పటి వరకూ ఏఐసీసీ ఆఫీస్ కొనసాగుతున్నది అదే ప్రాంతలోనన్న విషయం చాలా మందికి తెలియదన్నారు. కాకా సిద్ధాంతాలతోనే కాదు.. కాకా  కుటుంబంతో కూడా కాంగ్రెస్ కు విడదీయరాని అనుబంధం ఉందని తెలిపారు. కాకా, ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఇద్దరూ సమకాలికులని, కాకా కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కర్నాటకలో ఖర్గే మంత్రిగా ఉన్నారని సీఎం  గుర్తుచేశారు. ‘‘ఖర్గే ఎప్పుడు హైదరాబాద్​కు వచ్చినా చిక్కడపల్లిలో వెంకటస్వామి ఇంటికి వెళ్లేవారు. 

గుల్బర్గా వెళ్లేటప్పుడు కూడా కాకా ఇంటికి ఆయన వచ్చి వెళ్లేవారు” అని తెలిపారు. ‘‘నన్ను అప్పట్లో ఓసారి కాకా కుమారుల గురించి ఖర్గే అడిగితే.. కాకా కుమారుడు వివేక్ మన పార్టీలో లేరని చెప్పాను. వివేక్​తో తాను మాట్లాడుతానని, నన్ను కూడా మాట్లాడమని ఖర్గే చెప్పారు. దీంతో నేను వివేక్, సరోజ, వంశీని కలిసి పార్టీలోకి రావాలని కోరాను. కాంగ్రెస్​ పార్టీ మీ కుటుంబమని, రాష్ట్రంలోని 4 కోట్ల మందికి మేలు జరగాలంటే మీరు కాంగ్రెస్​లోకి రావాలని చెప్పాను. అట్ల వాళ్లను పార్టీలోకి తీసుకొచ్చాను. అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా వివేక్​, ఎంపీగా వంశీ గెలిచారు” అని వివరించారు.  

ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఎప్పుడు కలిసినా ఆదిలాబాద్ ను దత్తత  తీసుకొని డెవలప్ మెంట్ చేయాలని చెప్తుంటాని..  ఆదిలాబాద్, పెద్దపల్లికి తాము ప్రాధాన్యం ఇస్తున్నామిన ఆయన తెలిపారు. అప్పట్లోనే ప్రాణహితకు అంబేద్కర్ పేరును కాకా పెట్టారని, ఆ ప్రాజెక్టును బీఆర్ఎస్​ ప్రభుత్వం రీడిజైన్ చేసి లక్ష కోట్లు ఖర్చు చేసిందని అన్నారు. ‘‘పేరు మార్చి రీడిజైన్​ చేసి లక్ష కోట్లతో మన కండ్ల ముందే గత ప్రభుత్వం కట్టిన కాళేశ్వరం మన కండ్ల ముందే కూలింది” అని సీఎం తెలిపారు.  

ప్రాణహిత - చేవెళ్లకు నాన్న కృషి.. 

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేసే ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు కోసం నాన్న ఎంతో కృషి చేశారు. అప్పటి సీఎం వైఎస్ ను ఒప్పించి సుమారు రూ.35 వేల కోట్ల వ్యయంతో ప్రాజెక్టు మొదలుపెట్టి, బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టారు. కానీ గత బీఆర్ఎస్ సర్కార్ దాన్ని కాళేశ్వరంగా మార్చింది. కాకా వెంకటస్వామి జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశాను. ఆయన వెంటనే అంగీకరించి ఉత్తర్వులు ఇచ్చారు. ఇందుకు సీఎం రేవంత్ రెడ్డికి కాకా ఫ్యామిలీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. 

- వివేక్ వెంకటస్వామి, చెన్నూరు ఎమ్మెల్యే, కాకా కుమారుడు 

కాకా లేని లోటు కనిపిస్తున్నది..  

కాకా లేని లోటు గత పదేండ్లుగా కనిపిస్తున్నది. నేను ఎంపీగా గెలిచిన తర్వాత తొలిసారి పార్లమెంట్​కు వెళ్లినప్పుడు కాకా మనుమడిని అని పరిచయం చేసుకుంటే..వాళ్లంతా కాకాతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 
- గడ్డం వంశీకృష్ణ, పెద్దపల్లి ఎంపీ, కాకా మనుమడు

ప్రజాసమస్యలపై పోరాడారు.. 

ఉమ్మడి రాష్ట్రంలో కాకా పెద్ద మనిషిగా ఉండేవారు. ఆయన అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల సమస్యలపై పోరాడారు. హైదరాబాద్ లో వేల మందికి ఇండ్ల జాగాలు ఇప్పించారు. ఎన్నో స్కీమ్​లు తీసుకొచ్చారు. అంబేద్కర్ విద్యాసంస్థలతో పేదలకు ఉన్నత విద్యను అందుబాటులోకి తెచ్చారు. 2009లో నేను విప్ గా ఉన్నప్పుడు బిల్లులపై చర్చించేందుకు కాకా దగ్గరికి వెళ్లాను. ఆయన దగ్గర ఎంతో నేర్చుకున్నాను. 
- భట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర..  

కాకా.. రాజకీయాల్లో ఓ అద్భుతమైన శక్తి. ఆయన తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. బుల్లెట్ గాయంతో స్పృహ కోల్పోయినా వెనుకడుగు వేయలేదు. కష్టకాలంలోనూ కాంగ్రెస్​ను వీడలేదు. కాకా జీవిత చరిత్రను అందరూ చదవాలి. కాకా జీవితంపై ఒక డాక్యుమెంటరీ కూడా తీసుకురావాలి. 
- ఎమ్మెల్సీ కోదండరాం 

కాకా కృషితోనే సింగరేణిలో పెన్షన్.. 

కార్మిక సంఘాల ఏర్పాటులో కాకా కీలక పాత్ర పోషించారు. 2004లో నేను ఎమ్మెల్యేగా గెలవడంలోనూ కాకా పాత్ర ఎంతో ఉంది. కాకా కృషి వల్లే సింగరేణి లో పెన్షన్ స్కీమ్ అమల్లోకి వచ్చింది. పెద్దపల్లిలో కాకా విగ్రహం ఏర్పాటు చేయాలి. - చాడ వెంకట్ రెడ్డి, సీపీఐ నేత

కాకా అంటే ప్రజల ఆస్తి. పేదోళ్ల ధైర్యం. నిలువ నీడలేనివారికి అండగా నిలబడిన మహామనిషి ఆయన. కొందరు నేతలు ఒక్క ఇల్లు కట్టిచ్చినందుకే పేదల జీవితాలు బాగుచేసినట్లు, వడ్డించినట్లు, తినిపించినట్లు గొప్పలు చెప్పుకుంటారు. వంద సార్లు అదే విషయం చెప్పుకుంటారు. అలాంటిది 80 వేల మంది పేదలకు ఇండ్లు ఇచ్చిన కాకా సేవాగుణాన్ని ఏమనాలి. అలాంటి మహనీయుడి ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం.

– సీఎం రేవంత్​రెడ్డి