
- గొలుసుకట్టు చెరువులన్నీ మాయమయ్యాయ్
- సాగర్ కాలువలో మాజీ మంత్రి పువ్వాడ కాలేజీ
- హరీశ్ రావు.. మీరు వచ్చి కూల్చివేయించండి
- మిషన్ కాకతీయ ద్వారా చెరువు పటిష్టం చేస్తే ఎందుకు తెగుతున్నయ్
- విపత్తులు వచ్చినప్పుడు గత సీఎం హామీలిచ్చి అమలు చేయలే
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్ చాట్
ఖమ్మం: ఆక్రమణల వల్లే ఖమ్మం నగరానికి వరదలు వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం ( సెప్టెంబర్ 3) ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. గతంలో గొలుసుకట్టు చెరువులు ఉండేవని, అవన్నీ మాయమయ్యాయని అన్నారు. సర్వేఆఫ్ ఇండియా మ్యాప్స్ ద్వారా ఆక్రమణలను గుర్తిస్తామని, వాటిపై తప్పక చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారు.
సాగర్ ఎడమ కాలువలలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు పువ్వాడ అజయ్ కుమార్ కుచెందిన మమత మెడికల్ కాలేజీ గోడ ఉందన్నారు. మాజీ మంత్రి హరీశ్ రావు వచ్చి నిలబడి దానిని తొలగింపజేసి నలుగురికి ఆదర్శంగా నిలవాలని అన్నారు. మున్నేరు వాగు రిటైనింగ్ వాల్ ఎత్తు పెంచే అంశాన్ని పరిశలిస్తామని, ఇంజినీర్లతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం వెల్లడించారు.
మిషన్ కాకతీయ ద్వారా చెరువులు పటిష్టం చేస్తే ఇప్పుడెందుకు తెగిపోతున్నాయని సీఎం ప్రశ్నించారు. దానిని కమీషన్ కాకతీయ అని దివంగత మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అనే వారని గుర్తు చేశారు. వరదల సమయంలో ప్రజలతో మంత్రులు మమేకమవుతున్నారు. వారి కష్టాలు వింటున్నారని, తక్షణ సహాయానికి చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.
రాష్ట్రానికి ప్రత్యేకంగా విపత్తు నిర్వహణ సంస్థను ఏర్పాటు చేయబోతున్నామని సీఎం పునరుద్ఘాటించారు. బాధిత కుటుంబాలకు తక్షణ సాయం కింద రూ. 10 వేల చొప్పున అందించామని సీఎం తెలిపారు. 75 ఏండ్లలో ఎన్నడూ లేని విధంగా 42 సెంటీమీటర్ల వర్షం కురిసిందని సీఎం చెప్పారు. అంత విపత్తు జరిగినా ప్రభుత్వ ముందుచూపుతోనే ప్రాణనష్టం తక్కువగా ఉందని అన్నారు.
జాతీయ విపత్తుగా భావించి ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశామని చెప్పారు. రాష్ట్రంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని సీఎం భరోసా ఇచ్చారు.