సర్కారు దవాఖానల్లో .. ఏడాదిలో నెలరోజులు పని చెయ్యండి

సర్కారు దవాఖానల్లో .. ఏడాదిలో నెలరోజులు పని చెయ్యండి
  • కార్పొరేట్ ​హాస్పిటల్స్​​​ డాక్టర్లకు సీఎం రేవంత్​ రెడ్డి పిలుపు
  • ఏ దవాఖానలో​ ఏ నెలలో పనిచేస్తారో మీరే చెప్పండి
  • విద్య, వైద్యానికి ప్రభుత్వం ఫస్ట్ ప్రయారిటీ
  • పేదల వైద్యానికి ఏడాదిన్నరలో సీఎంఆర్​ఎఫ్​ నుంచి రూ. 1400 కోట్లు 
  • ఖర్చు చేసినం.. ఆరోగ్య శ్రీ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచినం
  • కార్పొరేట్​ స్థాయిలో సర్కారు వైద్యం.. ఇందుకోసం కమిటీ వేసినం
  • డిసెంబర్​ 9 కల్లా అందుబాటులోకి 4 సూపర్​ స్పెషాలిటీ హాస్పిటల్స్ ​
  • తెలంగాణ హెల్త్‌‌‌‌ టూరిజం హబ్‌‌‌‌గా మారిందని వెల్లడి

హైదరాబాద్​, వెలుగు:  కార్పొరేట్ హాస్పిటల్స్​లో పనిచేస్తున్న డాక్టర్లు ఏడాదిలో కనీసం ఒక నెల రోజుల పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి​ పిలుపునిచ్చారు. ఒక సామాజిక బాధ్యతగా సామాన్య ప్రజలకు సేవలు అందించడం వల్ల వైద్య వృత్తిలో గొప్ప అనుభూతి, సంతృప్తి లభిస్తుందని చెప్పారు. ఏ దవాఖానలో ​ఏ నెలలో పనిచేస్తారో మీరే చెప్పాలని వారిని కోరారు. బుధవారం హైదరాబాద్ బంజారాహిల్స్‌‌‌‌లో ఏసియన్​ ఇన్​స్టిట్యూట్ ఆఫ్​ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) కొత్త బ్రాంచ్​ను సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్పొరేట్ రంగంలో ఉన్న, అమెరికాలో  స్థిరపడిన మన రాష్ట్రానికి చెందిన డాక్టర్లు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు ప్రభుత్వ సేవలు అందించాలంటే.. అనుసంధానం చేయడానికి వీలుగా ఇప్పటివరకూ సరైన వేదిక లేదని, అలాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించినట్టు చెప్పారు. పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం, విద్యను అందించడమే తమ సర్కారు లక్ష్యమని వెల్లడించారు.   విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్య త ఇస్తున్నదని చెప్పారు.  అందులో భాగంగానే ఈ ఆర్థిక సంవత్సరంలో వైద్య రంగానికి రూ. 11,500 కోట్లు, విద్య కోసం రూ. 21,500 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. తెలంగాణను వైద్య రంగంలో అగ్రగామిగా నిలపడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రభుత్వ, కార్పొరేట్ రంగాల్లో వైద్య సేవలను విస్తరిస్తామని వెల్లడించారు. 

కార్పొరేట్​కు ధీటుగా సర్కారు దవాఖానలు..

ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే ప్రాణాలు పోతాయన్న అభిప్రాయాన్ని ప్రజలనుంచి దూరం చేయాలన్న ఆలోచనతో కార్పొరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ధీటుగా ప్రభుత్వ రంగంలో వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తున్నదని రేవంత్​రెడ్డి చెప్పారు.

అందులో భాగంగానే వందేండ్ల ఉస్మానియాకు గోషామహల్​లో 30 ఎకరాల స్థలం కేటాయించి 3 వేల కోట్లతో కొత్త ఆస్పత్రి నిర్మిస్తున్నట్టు సీఎం తెలిపారు. నిమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మరో 2 వేల పడకల విభాగం ప్రారం భించబోతున్నామని వెల్లడించారు. అలాగే వరంగల్, అల్వాల్, ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ నగర్, సనత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్ తదితర ప్రాంతాల్లో కార్పొరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ధీటుగా సూపర్​ స్పెషాలిటీ హాస్పిటళ్ల నిర్మాణం పూర్తవుతున్నదని, రాష్ట్రంలో వచ్చే డిసెంబర్ 9 నాటికి 7 వేల పడకలతో హాస్పిటల్స్​ను అందుబాటులోకి తేనున్నామని చెప్పారు. అధికారం చేపట్టగానే పెరిగిన వైద్య ఖర్చులను దృష్టిలో పెట్టుకుని రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని 2 లక్షల నుంచి 10 లక్షలకు పెంచామని గుర్తు చేశారు.  అలాగే, పేదల వైద్యం కోసం సీఎం రిలీఫ్​ ఫండ్​(సీఎంఆర్ఎఫ్) కింద ఇప్పటివరకూ  రూ.1400 కోట్లు  ఖర్చు చేసినట్టు చెప్పారు.  ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్ స్థాయికి తీర్చిదిద్దడానికి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసినట్టు సీఎం రేవంత్​ చెప్పారు. రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల్లో కోటి మంది సభ్యులను చేర్పించడమే కాకుండా వారందరి హెల్త్ ప్రొఫైల్ తయారు చేయాలన్నది సర్కారు లక్ష్యమని, వారందరికీ వారివారి హెల్త్ ప్రొఫైల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఒక యూనిక్ ఐడీ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కార్డులను జారీ చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. 

హైదరాబాద్​ గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాం

మిస్ వరల్డ్ పోటీలతో హైదరాబాద్ గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిచెప్పామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఏఐజీ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆధునిక వైద్య సదుపాయాలను చూపించడం ద్వారా న్యూయార్క్, టోక్యో, సౌత్ కొరియావంటి నగరాలతో హైదరాబాద్ పోటీ పడగలదని నిరూపించామన్నారు. మిస్ వరల్డ్ పోటీల్లో రెండో స్థానం గెలుచుకున్న వారు ఏఐజీ హాస్పిటల్ గురించి ప్రస్తావించడం హైదరాబాద్ ప్రతిష్టను మరింత పెంచిందని పేర్కొన్నారు.  మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు డైరెక్ట్ ఫ్లైట్ కనెక్టివిటీ లేకపోవడం వల్ల వైద్య సేవలు పొందే రోగులు ఇబ్బందులు పడుతున్నారని, ఈ విషయాన్ని పౌర విమానయాన శాఖ మంత్రితో చర్చించినట్లు సీఎం రేవంత్​ తెలిపారు.  వైద్య సహాయం కోసం ఏటా 2.2 లక్షల మంది విదేశీ రోగులు  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వస్తున్నారని సీఐఐ గణాంకాలు వెల్లడిస్తున్నాయని, కనెక్టివిటీ పెంచడం ద్వారా ఈ సంఖ్యను మరింత పెంచవచ్చని అన్నారు. జపాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో వైద్య రంగంలో సంబంధాలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. జపాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వృద్ధ జనాభా ఎక్కువ కావడం, భారతదేశంలో యువ జనాభా అధి కంగా ఉండటంతో, ఈ రెండు దేశాల మధ్య అనుసంధానం అవసరమని అన్నారు. జపనీస్ భాషను నేర్పించడం ద్వారా నర్సింగ్ రంగంలో ఉన్న డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తీర్చవచ్చని తెలిపారు. హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టూరిజం హబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తెలంగాణ మారిందని చెప్పారు. దేశంలో తయారయ్యే బల్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్రగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 35శాతం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే ఉత్పత్తి అవుతున్నదని తెలిపారు. జినోమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యాలీ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చాలా కీలకమని చెప్పారు. 

అన్ని రంగాల్లో తెలంగాణ ముందంజ

రాష్ట్రం అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పర్ క్యాపిటా ఇన్​కమ్​, స్వయం సమృద్ధి ఆదాయ వనరులు, శాంతిభద్రతలు, డ్రగ్స్ నియంత్రణలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందని చెప్పారు. ఇటీవల దుబాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగిన డ్రగ్స్ నియంత్రణ పోటీల్లో హైదరాబాద్ పోలీసులు ప్రథమ స్థానం సాధించి, అవార్డు అందుకున్నార ని గుర్తుచేశారు. 2047 నాటికి భారత్​ 30 ట్రిలి యన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలని లక్ష్యంగా పెట్టుకుందని, తెలంగాణ రాబోయే పదేం డ్లలో 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను చేరుకోవాలని టార్గెట్​ పెట్టుకున్నట్టు ఆయన తెలిపారు. దేశ జనాభాలో తెలంగాణ పాపులేషన్​ 2.5% మాత్రమే ఉన్నప్పటికీ, దేశ జీడీపీకి 5% తోడ్పడుతున్నదన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆరోగ్య రంగం ఒక చాప్ట ర్​ అని,  అందుకోసం నాగేశ్వర్​ రెడ్డి భాగస్వామ్యం కావాలన్నారు. క్యాన్సర్ చికిత్సకు సంబంధించి ఇటీవలే ప్రఖ్యాత ఆంకాలజిస్ట్ డాక్టర్ నోరి దత్తాత్రేయుడిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించామని చెప్పారు. గొప్ప గొప్ప ఆఫర్స్​ను కాదనుకొని హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే ఉండి పేదలకు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి  సేవలు అందిస్తున్నారని, ఇది గర్వకారణమని తెలిపారు. తక్కువ ఖర్చుతో సిటీ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కార్పొరేట్ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించినందుకు ఆయనను అభినందిస్తున్నట్టు చెప్పారు . ఏఐజీ ఆసుపత్రి రూపొందించిన జననీ మిత్ర యాప్ వినియోగానికి సంబంధించి అధికారులను పంపించి అధ్యయనం చేయాలని చెబుతామన్నారు. నాగేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ఇచ్చి గౌరవిస్తుందని తాను ఆశిస్తున్నానని, అందుకోసం తెలంగాణ సీఎంగా తనవంతు కృషి చేస్తానని రేవంత్​ రెడ్డి చెప్పారు.