భగీరథపై బీఆర్ఎస్ సర్కార్​వి అన్ని అబద్ధాలే : సీఎం రేవంత్​ రెడ్డి

భగీరథపై బీఆర్ఎస్ సర్కార్​వి అన్ని అబద్ధాలే : సీఎం రేవంత్​ రెడ్డి
  • 99%  ఇండ్లకు నీళ్లిచ్చామని కేంద్రానికి తప్పుడు నివేదిక 
  • అందుకే కేంద్రం నుంచి జల్ జీవన్ మిషన్ కింద నిధులు రావట్లేదు: సీఎం రేవంత్​రెడ్డి
  • క్షేత్రస్థాయిలో పరిశీలించి కేంద్రానికి వాస్తవ నివేదికలు ఇవ్వండి  
  • ఎండాకాలంలో తాగునీటికి ఇబ్బందులు ఉండొద్దు 
  • ఏపీ తాగునీటి పేరుతో సాగుకు నీళ్లు తరలించకుండా చూడండి 
  • తాగునీళ్ల కోసం కేఆర్ఎంబీకి లేఖ రాయాలని అధికారులకు సూచన 

హైద‌‌రాబాద్‌‌, వెలుగు: మిషన్ భగీరథపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పినవన్నీ అబద్ధాలేనని సీఎం రేవంత్​ రెడ్డి మండిపడ్డారు. ‘‘నేను ఆదిలాబాద్ జిల్లాలో ప‌‌ర్యటించిన‌‌ప్పుడు అనేక గ్రామాల్లో తాగునీటి స‌‌ర‌‌ఫ‌‌రా లేదు. కానీ మిష‌‌న్ భ‌‌గీర‌‌థ ద్వారా 99 శాతం ఇండ్లకు నీళ్లు ఇచ్చామని గత ప్రభుత్వం కేంద్రానికి త‌‌ప్పుడు నివేదిక‌‌లు ఇచ్చింది. అందుకే కేంద్రం నుంచి జల్ జీవన్ మిషన్ కింద రాష్ట్రానికి నిధులు రావ‌‌డం లేదు.

గొప్పల‌‌కు పోయి త‌‌ప్పుడు నివేదికలు ఇవ్వవ‌‌ద్దు. క్షేత్రస్థాయిలో ప‌‌రిశీలించి వాస్తవ నివేదిక‌‌లు కేంద్రానికి పంపించాలి” అని అధికారులకు సీఎం సూచించారు. వ‌‌ర్షాభావంతో రిజర్వాయర్లు డెడ్‌‌ స్టోరేజీకి చేరుకున్న నేప‌‌థ్యంలో తాగునీటి స‌‌ర‌‌ఫ‌‌రాకు తీసుకోవాల్సిన చ‌‌ర్యల‌‌పై గురువారం సెక్రటేరియట్​లో ప‌‌ట్టణాభివృద్ధి, పుర‌‌పాల‌‌క‌‌, పంచాయ‌‌తీరాజ్‌‌, సాగు, తాగునీటి స‌‌ర‌‌ఫ‌‌రా శాఖ‌‌ల అధికారుల‌‌తో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో మంత్రులు ఉత్తమ్‌‌ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీ‌‌నివాస్‌‌ రెడ్డి పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా రాష్ట్రంలోని రిజర్వాయర్లలో అందుబాటులో ఉన్న నీళ్లు, తాగునీటికి ఎన్ని నీళ్లు అవసరమనేది అధికారులు వివరించారు. అనంతరం సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ఎండాకాలంలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలనిఅధికారుల‌‌ను ఆదేశించారు. పల్లె, పట్నం, గూడేలు, తండాలు  ప్రతిచోట తాగునీరు అందేలా ప్రణాళిక రూపొందించాల‌‌ని సూచించారు.

తాగునీటి కోసమంటూ నాగార్జున సాగ‌‌ర్‌‌ నుంచి ఏపీ 9 టీఎంసీల‌‌కు పైగా తీసుకుపోతున్నదని అధికారులు చెప్పగా.. ‘తాగునీటి కోసం అన్ని టీఎంసీలు తీసుకెళ్తున్నారా? దానిపై సరైన లెక్కలు తీసుకోండి. సాగు, ఇతర అవసరాలకు నీటిని తరలించకుండా చూడండి’ అని చెప్పారు. తాగునీటి అవసరాల కోసం నాగార్జున సాగ‌‌ర్‌‌, శ్రీ‌‌శైలం ప్రాజెక్టుల నుంచి నీళ్లు తీసుకోవాలంటే కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)కు లేఖ రాయాల్సి ఉంటుంద‌‌ని అధికారులు చెప్పగా.. ఎన్ని నీళ్లు అవసరమో సమీక్షించి, ఆ మేరకు వెంటనే కేఆర్ఎంబీకి లేఖ రాయాల‌‌ని సూచించారు.

గ‌‌తంలో ఏప్రిల్, మేలో కురిసిన వ‌‌ర్షాల‌‌తో జూరాల‌‌కు నీళ్లు రావ‌‌డంతో తాగునీటికి ఇబ్బందులు రాలేదని.. లేదంటే నారాయ‌‌ణ‌‌పూర్ రిజర్వాయర్ నుంచి నీళ్లు విడుద‌‌ల చేయాలని క‌‌ర్నాట‌‌క‌‌ను అభ్యర్థించాల్సి ఉంటుంద‌‌ని అధికారులు తెలిపారు. గ‌‌తంలో ఎప్పుడైనా అలా తీసుకున్నారా? అని సీఎం ప్రశ్నించ‌‌గా.. మూడేండ్ల కింద తీసుకున్నామ‌‌ని చెప్పారు. అయితే దాన్ని చివ‌‌రి అవ‌‌కాశంగా తీసుకోవాల‌‌ని, ముందు కేఆర్ఎంబీకి లేఖ రాయాల‌‌ని ఆదేశించారు.

బోర్లకు రిపేర్​ చేయించండి.. 

కొత్త ఇరిగేషన్​స్కీమ్​లు వ‌‌చ్చిన త‌‌ర్వాత గ‌‌తంలో ఉన్న అనేక నీటి వ‌‌న‌‌రుల‌‌ను వ‌‌దిలేశార‌‌ని, ప్రస్తుతం వాటిని వినియోగంలోకి తెచ్చే అవ‌‌కాశాన్ని ప‌‌రిశీలించాల‌‌ని అధికారులకు రేవంత్ సూచించారు. ఈ సంద‌‌ర్భంగా కాగ్నా న‌‌దిని ప్రస్తావించారు. ‘‘కాగ్నా నది నుంచి తాండూర్, కొడంగ‌‌ల్ నియోజ‌‌క‌‌వ‌‌ర్గాల‌‌కు నీళ్లు వినియోగించుకునే అవ‌‌కాశం ఉంది. మిష‌‌న్ భ‌‌గీరథ వ‌‌చ్చిన త‌‌ర్వాత దాన్ని వ‌‌దిలేశారు. అలాంటివి రాష్ట్రంలోని మిగ‌‌తా ప్రాంతాల్లోనూ ఉంటాయి. వాటిని వినియోగించుకోవాలి. అలాగే అవ‌‌స‌‌ర‌‌మైన చోట తాగునీటి బోర్లు, బావులు, మోటార్లకు మ‌‌ర‌‌మ్మతులు చేయించండి. ఇందుకు ఎమ్మెల్యేల‌‌కు కేటాయించిన ఏసీడీపీ నిధుల నుంచి రూ.కోటి, అవ‌‌స‌‌ర‌‌మైతే అంత‌‌క‌‌న్నా ఎక్కువ‌‌ వినియోగించుకోండి” అని సీఎం సూచించారు. 

ట్యాంకర్లకు ఇబ్బందులు ఉండొద్దు.. 

గ్రేట‌‌ర్ హైద‌‌రాబాద్ ప‌‌రిధిలోనూ తాగునీటి స‌‌మ‌‌స్యల్లేకుండా చూడాల‌‌ని అధికారుల‌‌ను రేవంత్ ఆదేశించారు. అయితే నగరంలో పెద్దగా ఇబ్బందులు లేవ‌‌ని, ఒకవేళ కొర‌‌త ఏర్పడితే ఎల్లంప‌‌ల్లి, నాగార్జున సాగ‌‌ర్ నుంచి తీసుకునే అవ‌‌కాశం ఉంద‌‌ని అధికారులు తెలిపారు. న‌‌గ‌‌రంలోని నీటి అవ‌‌స‌‌రాల‌‌పై సమగ్రంగా స‌‌మీక్షించి, త‌‌గిన ప్రణాళిక రూపొందించుకోవాల‌‌ని సీఎం సూచించారు. సిటీలో కొన్ని ప్రాంతాల్లో ట్యాంక‌‌ర్ల రాక‌‌పోక‌‌ల‌‌కు పోలీసుల నుంచి కొంత ఇబ్బంది ఉంద‌‌ని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లగా.. ఎండాకాలం పూర్తయ్యే వ‌‌ర‌‌కు తాగునీటి ట్యాంక‌‌ర్ల రాక‌‌పోక‌‌ల విష‌‌యంలో ఇబ్బందుల్లేకుండా చూడాల‌‌ని పోలీస్ ఉన్నతాధికారుల‌‌ను రేవంత్ ఆదేశించారు.

ఆర్‌‌డ‌‌బ్ల్యూఎస్ సిబ్బందికి జీతాలివ్వండి.. 

ఎక్కడా తాగునీటి స‌‌మ‌‌స్య త‌‌లెత్తకుండా తీసుకోవాల్సిన చ‌‌ర్యల‌‌పై జిల్లా క‌‌లెక్టర్లతో రెండ్రోజుల్లో స‌‌మీక్ష నిర్వహించాల‌‌ని సీఎస్​ను రేవంత్ ఆదేశించారు. ఈ సంద‌‌ర్భంగా ఆర్‌‌డ‌‌బ్ల్యూఎస్ ప‌‌రిధిలోని సిబ్బందికి జీతాలు ఇవ్వడం లేద‌‌ని వార్తలు వ‌‌స్తున్నాయ‌‌ని అడగ్గా.. రెండేండ్లుగా ఇవ్వడం లేద‌‌ని అధికారులు తెలిపారు. దీంతో బ‌‌కాయిల‌‌పై ఆరా తీసిన సీఎం.. వెంటనే నిధులు విడుదల చేయాలని ఆదేశించారు. అవి బ‌‌డా బాబుల‌‌కు ఇవ్వకుండా, క్షేత్రస్థాయి సిబ్బందికి అందేలా చూడాల‌‌ని ఆర్‌‌డ‌‌బ్ల్యూఎస్ అధికారుల‌‌కు సూచించారు.