- నేరెళ్ల ఇసుక మాఫియా నుంచి గ్రానైట్ అక్రమాల వరకు అన్నింటిపైనా ఎంక్వైరీ
- మాజీ ఎంపీ సంతోష్ రావు, తండ్రి రవీందర్‌రావు..
- ఇలా అందరి పాత్ర నిగ్గు తేలుస్తం
- వచ్చే అసెంబ్లీ సమావేశాలకల్లా విచారణ నివేదికను సభ ముందుకు తెస్తం
- బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు ఈ ప్రభుత్వం భయపడదు
- మంత్రులపై బురద జల్లి లబ్ధి పొందాలనుకునేవారి ఆటలు సాగవు
- రాష్ట్ర సంపదను దోచుకున్నవారి నుంచి ప్రతి పైసా తిరిగి రాబడ్తం
- గతంలో హరీశ్ రావు అవినీతి వల్లే శాఖ మార్పు
- కేటీఆర్‌కు ఆ శాఖ ఇచ్చింది కూడా దోచుకోవడానికే
- రాఘవ కన్స్ట్రక్షన్స్కు నోటీసులు ఇచ్చింది మేమే
- తమ హయాంలో ఇసుక ఆదాయం 35 శాతం పెరిగిందని వెల్లడి
- అసెంబ్లీలో మైనింగ్ పద్దుపై హాట్ హాట్‌గా చర్చ
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ హయాంలో జరిగిన మైనింగ్, ఇసుక అక్రమాల బండారాన్ని బట్టబయలు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ఖజానాకు గండి కొట్టిన ఏ ఒక్కరినీ ఉపేక్షించే ప్రసక్తే లేదని, ఈ పదేండ్ల కాలంలో జరిగిన ప్రతి అక్రమంపై పూర్తిస్థాయిలో సీ-ఐడీ విచారణకు ఆదేశిస్తున్నట్టు ప్రకటించారు. బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు ఈ ప్రభుత్వం భయపడబోదని, పారదర్శకమైన పాలనే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. మంత్రులపై బురద జల్లి లబ్ధి పొందాలనుకునే వారి ఆటలు ఇకపై సాగవని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని తెలిపారు. రాష్ట్ర సంపద నుంచి దోచుకున్న ప్రతి పైసాను తిరిగి రాబడతామని, దోషులు ఎంతటి వారైనా సరే శిక్ష తప్పదన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల నాటికి విచారణ నివేదికను సభ ముందుకు తీసుకువస్తామని ప్రకటించారు. శనివారం శాసన సభలో మైనింగ్ శాఖ పద్దుపై జరిగిన చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. రాఘవ కన్స్ట్రక్షన్స్కు సంబంధించి ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని, ఆ సంస్థకు స్వయంగా నోటీసులు ఇచ్చింది తమ ప్రభుత్వమేనని వెల్లడించారు. రాష్ట్ర ఆదాయానికి గండి కొట్టేలా వ్యవహరించినందున సీనరేజ్ చార్జీల కింద రూ.1.50 కోట్లకుపైగా, పర్మిట్ ఫీజుల కింద మరో 1.22 కోట్లకు పైగా బకాయిలను వసూలు చేసేందుకు కఠిన చర్యలు తీసుకున్నామని తెలిపారు.
ఒకవేళ తమ మంత్రులకు ఆ సంస్థతో సంబంధం ఉంటే, ఇంత ధైర్యంగా నోటీసులు ఇచ్చి నిధులను ఎలా రాబడతామని ప్రతిపక్షాలను సీఎం రేవంత్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు కొత్తగా ఏమీ కనిపెట్టలేదని, అధికారుల ద్వారా వాస్తవాలను సేకరించి చర్యలు తీసుకున్నది తమ ప్రభుత్వానిదేనని తెలిపారు. చట్టాన్ని అతిక్రమించే ఏ సంస్థకైనా ఇలాంటి నోటీసులు ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు.
హరీశ్ రావు కుటుంబ సభ్యులు
ఇల్లీగల్ మైనింగ్‌కు పాల్పడ్డరు
బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు సొంత తమ్ముడు మహేశ్‌రావు భాగస్వామిగా ఉన్న మిడ్ వెస్ట్ గ్రానైట్ సంస్థలో అక్రమాలు జరిగాయని సీఎం రేవంత్ ఎండగట్టారు. హరీశ్‌రావు మైనింగ్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే ఆయన కుటుంబ సభ్యులు ఇల్లీగల్ మైనింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. ఆదాయాన్ని రాబట్టాల్సిన వారే దోపిడీకి మార్గాలు చూపడం దురదృష్టకరమని పేర్కొన్నారు. హరీశ్‌రావు సొంత సోదరుడే అక్రమాల్లో భాగస్వామిగా ఉన్నప్పుడు ఆయన ఏ ముఖం పెట్టుకుని తమపై ఆరోపణలు చేస్తారని ప్రశ్నించారు. హరీశ్‌రావు మైనింగ్ మంత్రిగా ఉన్న సమయంలో అడ్డగోలుగా దోపిడీకి పాల్పడుతున్నారని నాడు కేసీఆర్ గుర్తించే, ఆయన నుంచి ఆ శాఖను తొలగించారన్నారు. కొడుకు కేటీఆర్‌కు ఆ శాఖను అప్పగించడం వెనుక ఉద్దేశం.. దోపిడీని అడ్డుకోవడం కాదని, దోపిడీ చేసే అవకాశం కుమారుడికి ఇవ్వడమేనని పేర్కొన్నారు. కొడుకు, అల్లుడి మధ్య ఈ శాఖ పంపిణీ విషయంలో జరిగిన పంచాయతీ మొత్తం నాటి ప్రభుత్వ పెద్దలకు తెలుసని విమర్శించారు.
హరీశ్ రావు సొంత తమ్ముడు భాగస్వామిగా ఉన్న కంపెనీల్లో జరిగిన అక్రమాలే దీనికి నిదర్శనమని సీఎం పేర్కొన్నారు. మిడ్ వెస్ట్ గ్రానైట్ ద్వారా రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని రూపాయి రూపాయి లెక్క కట్టి వసూలు చేస్తామని ప్రకటించారు. అధికార బలాన్ని చూసుకొని అక్రమంగా సంపాదించిన ఆస్తులన్నీ బయటకు తీస్తామని, ఈ విషయంలో తమ ప్రభుత్వం ఎక్కడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. గాయత్రి గ్రానైట్స్, సిరీషా జియో గ్రానైట్స్ సంస్థల వ్యవహారాల్లో అవకతవకలు జరిగాయన్నారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రకు చెందిన గాయత్రి గ్రానైట్స్ సంస్థపై గతంలో పెనాల్టీలు వేసి, ఆ తర్వాత ఆర్బిట్రేషన్ పేరుతో వాటిని అడ్డగోలుగా తగ్గించారని చెప్పారు. అలాగే, ఆంధ్రాకు చెందిన ఒక మాజీ ఎమ్మెల్యేను బెదిరించి సిరీషా జియో గ్రానైట్స్ లీజులు రాబట్టుకున్నారని, ఈ అక్రమ దందాల వెనుక ఉన్న రాజకీయ శక్తులు ఎవరైనా సరే విచారణను ఎదుర్కోవాల్సిందేనని చెప్పారు. మైనింగ్ అనుమతుల్లో జరిగిన మార్పులు, పెనాల్టీల తగ్గింపు వెనుక జరిగిన లావాదేవీలన్నింటినీ వెలికితీస్తుందన్నారు. సంపదను సృష్టించాల్సిన మైనింగ్ శాఖను అవినీతికి అడ్డాగా మార్చిన ప్రతి ఒక్కరిపై కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు.
దోపిడీని అడ్డుకోవడం వల్లే పెరిగిన ఆదాయం..
గత ప్రభుత్వ హయాంలో ఇసుక ద్వారా వచ్చిన ఆదాయం కంటే తమ హయాంలో 35 శాతం ఆదాయం పెరిగిందని సీఎం రేవంత్ వివరించారు. 2024-–25లో ఇసుక ఆదాయం రూ. 721 కోట్లు ఉంటే, ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్యల వల్ల అది రూ. 972 కోట్లకు చేరిందని తెలిపారు. రియల్ ఎస్టేట్ పడిపోయిందని, కన్‌స్ట్రక్షన్ రంగం కుంటుపడిందని బురదజల్లుతున్న బీఆర్ఎస్ నేతలు, మరి ఇసుక ఆదాయం ఎలా పెరిగిందో సమాధానం చెప్పాలన్నారు. ఇసుకను ఏమైనా బిర్యానీలా తింటున్నామా? అని ప్రశ్నించారు. దోపిడీని అడ్డుకొని, అక్రమ మార్గాలను మూసివేయడం వల్లే ఈ స్థాయిలో ఆదాయం పెరిగిందని ప్రకటించారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నామని, దీనివల్లే తమపై ఈ రకమైన అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. మైనింగ్ అక్రమాలపై పూర్తిస్థాయి నివేదికను వచ్చే అసెంబ్లీ సమావేశాల నాటికి సభలో ప్రవేశపెడతామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. గత పదేండ్ల దోపిడీ చిట్టాను ప్రజల ముందు ఉంచుతామని, ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. హరీశ్‌రావు, కేటీఆర్ మంత్రులుగా ఉన్నప్పుడు జరిగిన వ్యవహారాలన్నీ వెలుగులోకి వస్తాయని, అప్పుడు ఎవరు అసలైన దొంగలో తేలుతుందని అన్నారు. అక్రమాలకు పాల్పడి మళ్లీ తమపైనే విచారణ కోరుతున్న ప్రతిపక్షాల డిమాండ్‌ను తాము ఆహ్వానిస్తున్నామని, అందుకే విచారణకు ఆదేశించామన్నారు. త్వరలోనే దోషులంతా జైలు పాలవ్వడం ఖాయమని, చట్టానికి ఎవరూ అతీతులు కారని పేర్కొన్నారు.
దళితుల రక్తంపై ఇసుక సామ్రాజ్యం..
సిరిసిల్ల నియోజకవర్గ పరిధిలోని నేరెళ్లలో జరిగిన ఇసుక అక్రమ దందాపై సీఎం రేవంత్ మాట్లాడారు. నాడు ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న దళితులపై లారీలు ఎక్కించి చంపించారని, ఆనాటి మాఫియా ఆగడాలపై సమగ్ర విచారణ జరుపుతామని ప్రకటించారు. ఈ అక్రమాల్లో మాజీ ప్రజాప్రతినిధి సంతోష్ రావు, ఆయన తండ్రి రవీందర్‌రావుల పాత్రపై సీబీసీఐడీ నిగ్గు తేలుస్తుందని పేర్కొన్నారు. దళితుల రక్తంపై ఇసుక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న వారిని వదిలిపెట్టేది లేదని, నాటి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడిన ప్రతి ఒక్కరినీ బోనులో నిలబెడతామన్నారు. ఇసుక మాఫియా వెనుక ఉన్న పెద్ద తలకాయల చిట్టా మొత్తం తమ దగ్గర ఉన్నదని, త్వరలోనే వారి అసలు రంగు బయటపడుతుందని వెల్లడించారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులకు చెందిన శ్వేత గ్రానైట్ సంస్థలో జరిగిన అక్రమాలపై ఇప్పటికే రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నివేదికలు ఇచ్చిందని, ఈడీ విచారణ కూడా జరుగుతున్నదని సీఎం తెలిపారు. గ్రానైట్ వ్యాపారం పేరుతో వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయాన్ని కొల్లగొట్టారని, దీనిపై సీబీసీఐడీ ద్వారా లోతైన విచారణ జరిపిస్తామని ఆయన తెలిపారు. కరీంనగర్ కేంద్రంగా సాగిన ఈ గ్రానైట్ మాఫియాలో ఎవరెవరి వాటాలు ఉన్నాయో, ఎంత మేర దోపిడీ జరిగిందో పూర్తి ఆధారాలతో సభ ముందు ఉంచుతామని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా మైనింగ్ చేస్తూ ఖజానాకు సున్నం పెట్టిన వారంతా ఇప్పుడు నీతులు చెబుతుంటే హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. శ్వేత గ్రానైట్ అక్రమాలపై ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా ప్రభుత్వం ముందుకెళ్తుందని ఆయన స్పష్టం చేశారు.
ఆస్తి కోసం సొంత బిడ్డను ఇంటి నుంచి వెళ్లగొట్టారు
ఆస్తి తగాదాలు, అధికార పంపిణీలో తేడాలు వస్తే సొంత కుటుంబ సభ్యులను కూడా కేసీఆర్, కేటీఆర్ లెక్క చేయరని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఆస్తి వాటాల విషయంలో పొరపొచ్చాలు రావడంతో సొంత బిడ్డను ఇంటి నుంచి, పార్టీ నుంచి వెళ్లగొట్టిన సంస్కృతి వారిదని ధ్వజమెత్తారు. అలాంటి వారు ఇయ్యాల తమ మంత్రుల దూరపు బంధువుల వ్యాపారాల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
