గేట్లు ఓపెన్ చేసినం ఇక పీసీసీ ప్రెసిడెంట్​గా రాజకీయం ఏంటో చూపిస్త: సీఎం రేవంత్​రెడ్డి

గేట్లు ఓపెన్ చేసినం ఇక పీసీసీ ప్రెసిడెంట్​గా రాజకీయం ఏంటో చూపిస్త: సీఎం రేవంత్​రెడ్డి
  • ప్రభుత్వాన్ని పడగొడ్తాం అంటే చూస్తూ ఊరుకోం
  • నిజాం నవాబుకు నకలు కేసీఆర్​ 
  • 1948 సెప్టెంబర్​ 17 లెక్కనే .. 2023 డిసెంబర్​ 3 కూడా
  • కల్వకుంట్ల ఫ్యామిలీ అవినీతి వేల కోట్లల్లో ఉంది
  • పూర్తిస్థాయి నివేదికలు రాగానే చర్యలు తప్పవు
  • గత ప్రభుత్వం నాటిన గంజాయి మొక్కలను ఏరేస్తున్నం
  • ఆర్​ఎస్​ ప్రవీణ్​కు టీఎస్​పీఎస్సీ చైర్మన్​గా ఆఫర్​ ఇస్తే.. 
  • పెద్ద బాధ్యత ఉందని తిరస్కరించిండు
  • కేసీఆర్​తో కలువడంపై ప్రవీణే​ జవాబు చెప్పాలని వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్​లో చేరికలకు గేట్లు ఓపెన్​ చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. లోక్​సభ ఎన్నికల కోడ్​ వచ్చిందని, ఇక నుంచి తాను పీసీసీ ప్రెసిడెంట్​గా తన రాజకీయం ఏమిటో చూపిస్తానని చెప్పారు. ‘‘కాంగ్రెస్‌‌ ప్రభుత్వాన్ని కూలుస్తామని బీఆర్​ఎస్, బీజేపీ నేతలు పదేపదే అంటున్నరు. వాళ్లు ప్రభుత్వాన్ని పడగొడ్తామంటే చూస్తూ ఊరుకోం” అని హెచ్చరించారు.

తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఎలాంటి ఫిరాయింపులకు పాల్పడలేదని, కానీ ఇప్పటి నుంచే తాను రాజకీయం ప్రారంభించానని, తమ పార్టీలోకి పొద్దున్నే ఒక గేటు తెరిచామని, మొత్తం ఇంకా తెరవలేదని అన్నారు. ‘‘ఇవాళ(ఆదివారం) ఒక ఎంపీ, ఎమ్మెల్యేకు గేటు ఓపెన్‌‌ చేసినం. వాటిని మూసేసేది ఏం ఉంటది. అవతల ఖాళీ అయినంక మూసినా, తెరిచినా ఒకటే కదా” అని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్​ ప్రభుత్వ వంద రోజుల పాలనపై టీయూడబ్ల్యూజే  ఆధ్వర్యంలో ఆదివారం బషీర్​బాగ్​ ప్రెస్​ క్లబ్​లో ఏర్పాటు చేసిన ‘మీట్​ ది మీడియా’ కార్యక్రమంలో సీఎం రేవంత్​రెడ్డి మాట్లాడారు. నిజాం నవాబుకు కేసీఆర్​ నకలు అని విమర్శించారు. 

1948 సెప్టెంబర్​ 17కు ఎంత ప్రాముఖ్యత ఉందో.. 2023 డిసెంబర్​ 3కు అంతే ప్రాధాన్యం ఉందని  రేవంత్​ అన్నారు. ‘‘ఏడు తరాలు నిజాం నవాబులు వాళ్ల ఆధిపత్యాన్ని, రాచరికాన్ని మన మీద రుద్ది అజమాయిషీ చెలాయించారు. వందలాది మంది ఆత్మ బలిదానాల పునాదుల మీద  2014  జూన్ 2 నాడు ఏర్పడిన రాష్ట్రానికి ఎన్నికైన కేసీఆర్ కూడా నిజాం లాంటి రాచరిక పోకడలు, ఆధిపత్యాలు చెలాయించిండు. వారసత్వాన్ని తెలంగాణ ప్రజల మీద రుద్దేందుకు ప్రయత్నిస్తే  ప్రజలు కారును షెడ్డుకు పంపి, కేసీఆర్​ను ఇంటికి పంపించిన్రు” అని ఆయన పేర్కొన్నారు. 

కేసీఆర్​ అవినీతిపై విచారణ చేయిస్తున్నం

కేసీఆర్​ కుటుంబం అవినీతి వందల కోట్ల రూపాయల్లో కాదని, వేల కోట్ల రూపాయల్లో ఉందని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. ఒక్కో దానిపై విచారణ చేయిస్తున్నామని.. పూర్తిస్థాయి నివేదికలు వచ్చాకే చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. కాళేశ్వరంపై ఎన్​డీఎస్​ఏ ఎక్స్​పర్ట్​ కమిటీ, ఇంకోవైపు జ్యుడిషియరీ కమిషన్​ నడుస్తున్నదని తెలిపారు. వాటి రిపోర్టుల ఆధారంగా చర్యలు ఉంటాయన్నారు. దుబారా ఖర్చులను తగ్గించి.. ఆదాయాన్ని పెంచి.. పేదలకు పెంచడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

ధరణి పోర్టల్​పై ఫోరెన్సిక్​ ఆడిట్​ చేయిస్తామని సీఎం రేవంత్​ రెడ్డి ప్రకటించారు. గత బీఆర్​ఎస్​ పాలనలో ప్రైవేట్​ఏజెన్సీ చేతిలో ఉంటే ఇప్పుడు సీజీజీకి అప్పగించామని,  ధరణిపై కమిటీ కూడా వేశామని అన్నారు. పోర్టల్​లో ఉన్న సమస్యలు ఏమిటి ? గత ప్రభుత్వంలో ఉన్నవాళ్లు తీసుకున్న నిర్ణయాలు ఏమిటి? అని వేర్వురుగా నివేదికలు రెడీ చేయిస్తున్నామని చెప్పారు. స్పెషల్​ డ్రైవ్​లో దాదాపు రెండున్నర లక్షల అప్లికేషన్లను పరిష్కరించేందుకు పూనుకున్నామని తెలిపారు. 2014 కంటే ముందున్న భూములు, ప్రభుత్వ భూములు, ఇతరత్రా వంటివి 2014 తర్వాత ఎలా ఎవరికి మారాయానే దానిపై ఫోరెన్సిక్ ఆడిట్​ చేస్తామన్నారు.  

వెబ్​సైట్​లో అన్ని జీవోలు

రానున్న జూన్​లో పూర్తిస్థాయి బడ్జెట్​ పెడుతామని, అందులో అన్ని హామీలకు నిధుల కేటాయింపులు ఉంటాయని సీఎం స్పష్టం చేశారు. త్వరలోనే సమాచార హక్కు కమిషనర్లను నియమిస్తామని చెప్పారు.  ప్రభుత్వ జీవోలను అన్నిటినీ వెబ్​సైట్​లలో  ఓపెన్​గా పెడుతామన్నారు. మేడ్చల్​కు మెట్రోపై భవష్యత్​లో నిర్ణయం ఉంటుందని తెలిపారు. ఎలక్టోరల్​ బాండ్లు క్విడ్​ ప్రోకో లాంటివన్నారు. కాంట్రాక్టులు వచ్చిన దాని బట్టి బాండ్లు ఇస్తున్నారని విమర్శించారు. జమిలి ఎన్నికలను కాంగ్రెస్​ అపోజ్​ చేసిందన్నారు. 

తెలంగాణ సంస్కృతిని ధ్వంసం చేశారు

ఆధిపత్యం చెలాయించాలనుకునే వాళ్లు, నియంతలు ఎప్పుడూ సంస్కృతిని ధ్వంసం చేయాలని చూస్తారని సీఎం రేవంత్  మండిపడ్డారు. ‘‘సహజసిద్ధంగా వచ్చిన సంస్కృతి సంప్రదాయాలను కాలక్రమేణా కేసీఆర్​ కనుమరుగు చేసి.. తన ఆలోచనను రుద్దాలని చూసిండు. గత ప్రభుత్వంలో తెలంగాణ వాహన రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టీజీ బదులు టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకొచ్చిండు.

టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నకలుగానే టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తెచ్చిండు. ఉద్యమంలో ప్రజలు పాడుకున్న ‘జయ జయహే తెలంగాణ’ పాటను ఆయన రాష్ట్ర గీతంగా గుర్తించలేదు. కేసీఆర్​ పాలనలో నిషేధానికి గురైంది ఇప్పుడు గల్లీ.. గల్లీలో రాష్ట్ర గీతంగా పాడుకుంటున్నం. తెలంగాణ తల్లి విగ్రహం కూడా వాళ్ల కుటుంబాన్ని పోలి ఉండేలా చూసుకున్నడు. కవులు, కళాకారులు అందరి అభిప్రాయాలు, సూచనలు పరిగణనలోకి తీసుకుని తెలంగాణ తల్లి విగ్రహంలోనూ మార్పులు తీసుకొస్తున్నం. తెలంగాణ అధికారిక చిహ్నంలోనూ ఉద్యమ స్ఫూర్తి లేకుండా చేసిండు. కవులను, కళాకారులను గడిలో బంధించి.. పొగిడించుకునేందుకే వాడుకున్నడు. ప్రజల సమస్యలు పాటల రూపంలో వచ్చేవి.. కానీ, కేసీఆర్​ పాలనలో అవి నిర్బంధాలకు గురైనయ్” అని సీఎం అన్నారు.

గతంలో ఏ ప్రభుత్వమైతే ధర్నా చౌక్​ను ఎత్తివేసిందో.. ఇప్పుడు వాళ్లే తమ ప్రభుత్వంలో ధర్నా చౌక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిరసనలు చేసుకునేందుకు అనుమతులు ఇస్తున్నామని తెలిపారు. ‘‘పదేండ్ల నుంచి అన్ని చేసినమని, నియమాకాలు చేపట్టలేదని బావబామ్మర్దులు హరీశ్​, కేటీఆర్ చెప్పడం భావదారిద్ర్యం. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలనే సోయే వాళ్లకు లేదు. ఇంటోళ్లకు మాత్రం ఇచ్చుకున్నరు. ఓడిపోయిన వినోద్​ రావుకు, జనం బండకేసి కొట్టిన కవితమ్మకు.. ఇట్ల ఇంటోళ్లకు ఇచ్చుకున్నరు. ఉద్యోగ నియామకాలను చిన్నపనిగా బీఆర్​ఎస్​ నేతలు చెప్తున్నరు. అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు?” అని  సీఎం నిలదీశారు. 

పేరుకుపోయిన ఫైళ్లను పరిష్కరిస్తున్నం

కొద్దిమంది అధికారుల చేతుల్లోనే అధికారాన్ని పూర్తిగా పెట్టిన విధానానికి స్వస్తి పలికామని సీఎం రేవంత్​ తెలిపారు.  ప్రతిశాఖకు సమర్థవంతమైన అధికారులను నియమించి, స్వేచ్ఛగా వాళ్లు నిర్ణయాలు తీసుకునేలా పరిపాలనను వికేంద్రీకరించామన్నారు. పదేండ్లుగా పేరుకుపోయిన వేలాది ఫైళ్లను పరిష్కరించుకుంటూ ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నామన్నారు.6 గ్యారంటీలను అమలు చేస్తున్నామన్నారు.  

గత సర్కార్​ తీరుతోనే నీళ్ల సమస్య

నిరుడు వర్షాలు పడలేదని,  రిజర్వాయర్లలో ఉండాల్సిన నీటిని గత సర్కార్​ నిర్లక్ష్యంతో మెయింటెయిన్​ చేయలేదని సీఎం రేవంత్​ మండిపడ్డారు. నీళ్లను పక్క రాష్ట్రం తరలించుకుపోతుంటే కూడా గత కేసీఆర్​ సర్కార్​ నియంత్రించే పనిచేయలేదని అన్నారు. అయినా చిన్న సమస్య కూడా రాకుండా ముందుకు పోతున్నామని తెలిపారు. తాగునీటిపై కర్నాటక ప్రభుత్వ అధికారులతో మన  ఆఫీసర్లు మాట్లాడుతున్నారని వివరించారు. విద్యుత్​ విషయంలో కొందరు వారి ఏరియాల్లో లైన్​మన్లకు ఫోన్లు చేసి వీఐపీ మీటింగ్స్​లో కావాలని కరెంట్​ కట్​ చేయించి పైశాచిక ఆనందం పొందుతున్నారని, అట్లాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు చెప్పారు. 

కుట్రలు తిప్పి కొడ్తం

వంద రోజులు మంచి పరిపాలన అందించడానికే ప్రయత్నించామని, ఎవరు వచ్చినా చేరికలు అనే విధానానికి పోకుండా పరిపాలన మీదే దృష్టి పెట్టామని సీఎం రేవంత్​ చెప్పారు. ‘‘ప్రతిరోజు బీఆర్​ఎస్​, బీజేపీ వాళ్లు ప్రభుత్వాన్ని పడగొడుతాం.. పడగొడుతాం అని కుట్రలు చేస్తున్నరు. కుట్రలను తిప్పి కొట్టాలంటే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది.

ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పారదర్శకంగా పనిచేయడానికి అవకాశం ఇవ్వకుండా.. కేసీఆర్​ మొదలు కడియం శ్రీహరి లాంటి వాళ్లు కూడా ప్రభుత్వం మూడు నెలలు ఉండదని అంటున్నరు. బీజేపీ నేత లక్ష్మణ్​ కూడా ఎంపీ ఎన్నికలు అయిన వెంటనే  ఆపరేషన్ మొదలుపెడ్తమనడం దేనికి సంకేతం? ఈ వంద రోజుల్లో ఎక్కడైనా, ఏదైనా ఫిరాయింపులకు గానీ,  రాజకీయంగా గానీ, వేరే రకంగా గానీ ఏమైనా మేం ప్రయత్నం చేశామా ? ఈ రోజు వాళ్లిద్దరూ ఒకే లైన్​లో మాట్లాడుతున్నరు. ప్రభుత్వాన్ని పడగొడుతామని అంటున్నరు. వాళ్లు పడగొడితే చూసుకుంటూ కూర్చుంటమా? కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని పెద్దలు చెప్పిన్రు. కొట్టకుండా ఉంటమా ? కొడుతం కదా..” అని సీఎం అన్నారు.  

ఫోన్​ ట్యాపింగ్​ చేసే ఆగత్యం మాకు లేదు

ఫోన్​ ట్యాపింగ్​ ఆరోపణలపై చిత్తశుద్ధి ఉంటే బీజేపీ నేత ఈటల రాజేందర్​ విచారణకు ఆదేశించాలని, కేంద్రంలో ఉన్నది వాళ్ల ప్రభుత్వమే కదా అని సీఎం రేవంత్​రెడ్డి సవాల్​ చేశారు ‘‘మా ప్రభుత్వానికి ఫోన్​ ట్యాపింగ్​ చేసే ఆగత్యం లేదు. ఆల్రెడీ ఫోన్​ ట్యాపింగ్​ చేసినోళ్లు ఏడున్నరో అందరూ చూస్తనే ఉన్నరు. చిల్లరమల్లర ఆరోపణలతో ఈటల రాజేందర్​కు ఎలాంటి ప్రయోజనం ఉండదు.

కేంద్రంలో మీదే ప్రభుత్వం ఉన్నది కదా.. విచారణకు ఆదేశించున్రి. నిన్న వాళ్ల దగ్గరి మిత్రుడు వద్ద కరీంనగర్​లో రూ.7 కోట్లు పట్టుకున్నరు కదా. అది గత ప్రభుత్వం మాదిరి ఫోన్​ ట్యాపింగ్​తో పట్టుకున్నమని అనుకుంటున్నరేమో! అట్ల లేదు.. అక్కడున్నోళ్లే నగదు ఉందని చెప్తే  పోలీసులు పోయి పట్టుకున్నరు” అని ఆయన తెలిపారు. 

కేసీఆర్​తో ఆర్​ఎస్పీ కలుసుడుపై నో కామెంట్​

ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్ మంచి మిత్రుడని.. సామాజిక స్పృహ, బాధ్యత ఉన్నవారని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. ‘‘కేసీఆర్​ కూడా వాలీ లాంటి వాడే. ఎదుటి వాళ్ల బలాన్ని గుంజుకోవాలని చూస్తడు. కేసీఆర్​తో ప్రవీణ్​ చేరుతారని నేను అనుకోవడం లేదు. సర్వీసులో ఉంటే ఆయన డీజీపీ అయ్యేవాడు. టీఎస్​పీఎస్సీ చైర్మన్​గా ఉండాలని ప్రవీణ్​​కు నేను ఆఫర్​ ఇచ్చిన. పెద్ద బాధ్యత తనపై ఉందని ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్​ తిరస్కరించిండు.  అలాంటి వ్యక్తి ఇప్పుడు కేసీఆర్​తో చేరుతున్నరంటే తెలంగాణ సమాజానికి ఆయనే జవాబు చెప్పాలి. నేను కామెంట్​ చేయదలుచుకోలేదు. ఆయన పట్ల మొన్న ఉన్న గౌరవమే ఇప్పుడూ ఉంది” అని పేర్కొన్నారు. 

 రూ.1,000 కోట్ల అదనపు ఆదాయం 

రాష్ట్రంపైనా అన్ని రకాలుగా కలిపి రూ.9 లక్షల కోట్ల భారం ఉందని, గత బీఆర్​ఎస్​ సర్కార్​ అస్తవ్యస్త  విధానాలే ఇందుకు కారణమని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పడిన నాటికి సంవత్సరానికి అప్పు కిస్తీలు, వడ్డీలు కట్టేది రూ.6 వేల కోట్లు ఉంటే.. 2023  డిసెంబర్​నాటికి అది రూ.64 వేల కోట్లకు చేరిందని తెలిపారు. అంటే 600 శాతానికి పెరిగిందన్నారు.

తాము  కేంద్రంతో చిల్లర తగాదాలకు వెళ్లడం లేదని, రావాల్సిన హక్కులను కాపాడుకుంటున్నామని చెప్పారు. తాము వచ్చిన రెండు నెలల తర్వాత ప్రతినెలా యావరేజ్​గా రూ.1,000 కోట్ల మేర అదనపు ఆదాయం వచ్చేలా చేస్తున్నామని ఆయన వివరించారు. జీఎస్టీ ఎగ్గొట్టిన వాళ్లు, టానిక్​ లాంటి వైన్స్ ల పన్ను ఎగవేతలను ఆరికడుతున్నామని చెప్పారు. బతుకమ్మలు, బోనాలు  అన్ని పండుగలు తెలంగాణలో తరతరాలుగా ఎవరున్నా లేకున్నా కొనసాగుతుంటాయని సీఎం రేవంత్​ తెలిపారు. ప్రభుత్వం తరఫున చేయాల్సిన కార్యక్రమాలన్నీ కొనసాగుతాయన్నారు. ‘‘అమ్మగారు లేరు.. వచ్చేసరి బతుకమ్మ ఎట్లా..! అన్నట్లు పరిస్థితి ఉండదు” అని కవితను ఉద్దేశించి పేర్కొన్నారు. ‘‘వాళ్లు వచ్చి నేర్పింది ఏం లేదు. బతుకమ్మను కూడా వ్యాపార వస్తువుగా మార్చారు” అని అన్నారు. 

తన్నీరు శ్రీరంగారావుపై సీరియస్​

తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్  చైర్మన్​ తన్నీరు శ్రీరంగారావు తీరుపై సీఎం రేవంత్​ సీరియస్​ అయ్యారు. తాము గృహజ్యోతి కింద పేదలకు జీరో బిల్లును అమలు చేస్తుంటే.. గత పాలనలోని గంజాయి మొక్కలు బయటపడుతున్నాయని అన్నారు. ‘‘ఎక్కడెక్కడ విష పురుగులను, గంజాయి మొక్కలను నాటిన్రో ఇంకా అవి వాటి వాసనలను వెదజల్లుతూనే ఉన్నయ్​. తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్  ఒక నోటీసు ఇచ్చింది.. అందేందంటే.. ముందుగాల సబ్సిడీని సంస్థలకు చెల్లించిన తర్వాతనే జీరో బిల్లులు ఇవ్వాలంటూ నోటీసులో ఉంది.

ఆ మేధావి (తన్నీరు శ్రీరంగరావు)కి నేను చెప్పదల్చుకున్న.. గత బీఆర్​ఎస్​ సర్కార్​  రూ.40 వేల కోట్లు విద్యుత్​ సంస్థలకు బాకీలు పెట్టి ఉచిత కరెంట్​ పేరిట గొప్పలు చెప్పుంటే ఎందుకు స్పందించలే? నీ ఇంటి పేరు తన్నీరు ఉన్నంత మాత్రాన పన్నీరు అనుకుంటున్నవేమో.. నీ తెలివితేటలు మానుకోవాలి. ఈ గంజాయి, కలుపు మొక్కలను పీకే పనిలో ఉన్న.

ఇంకా ఎక్కడపడితే అక్కడ నాటి పెట్టిన్రు. ఊహించని విధంగా వాసనలు వెదజల్లుతున్నయ్​. అయినా ఊరుకోం. 18 గంటలు పనిచేస్త. ఈ గంజాయి మొక్కలను సమూలంగా పీకేస్త. తన్నీరు గారు గుర్తు పెట్టుకో..!! నువ్వు కూడా ఎక్కువ సేపు ఆ కుర్చీలో ఉండవు. యథాలాపంగా ఉన్నప్పుడు వేటు వేద్దాం అనుకుంటున్నవేమో.. కానీ అట్లేం ఉండదు. మాకు ఓ లెక్కుంటది.. ఆ లెక్క ప్రకారమే పనిచేస్తం” అని తేల్చిచెప్పారు. కుట్రదారులు ఫామ్​హౌస్​లో ఉండి కనుసైగలు చేస్తుంటే కొంతమంది తెలివితేటలు ప్రదర్శిస్తున్నారని, వాళ్లు అడ్డుపడినా తాము అడ్డుతొలగించుకుని పేదలకు జీరో బిల్లులు అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. 

అధికార ఉల్లంఘనలకు పాల్పడితే శిక్ష తప్పదు

తనకు, తమ ప్రభుత్వానికి నాయకుల నుంచి, అధికారుల వరకు వ్యక్తిగత కక్ష్య ఉండదని సీఎం అన్నారు. అధికార ఉల్లంఘనలకు పాల్పడితే.. పాలనలో తప్పులు చేస్తే నివేదికల ఆధారంగా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఇక గత ప్రభుత్వ అవినీతి అక్రమాలపై శిక్షలు ఎప్పుడుంటాయని మీడియా ప్రశ్నించగా.. ‘‘అధికారం కోల్పోవడమే కేసీఆర్​కు శిక్ష. ఆ దెబ్బకు కిందపడి ఇరగడాలు కూడా చూశారు. అంతకంటే ఇంకేం చేస్తారు. అమరవీరుల స్థూపం దగ్గర రాళ్లతో కొట్టించేది ఏమైనా ఉందా?” అని అన్నారు. వారసత్వాన్ని రుద్దాలని కేసీఆర్​చూస్తే  తెలంగాణ సమాజం ఏకమై వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిందని తెలిపారు.

రైతుభరోసాపై ఆందోళన అవసరం లేదు

రైతు భరోసా గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్​ అన్నారు. 5 ఎకరాలు ఉన్న రైతుల వరకు రైతుబంధు(రైతు భరోసా) వారి ఖాతాల్లో పడిందని చెప్పారు. 62 లక్షల మందికి నగదు జమ చేశామని చెప్పారు. ఇకపై గుట్టలు, రోడ్లు, బంగ్లాలు, లేఔట్లకు రైతు భరోసా ఇవ్వబోమని అన్నారు. ఏ ప్రభుత్వ పథకం అందకపోయినా దరఖాస్తు చేసుకోవాలని, పరిశీలించి అందిస్తామని సీఎం రేవంత్​రెడ్డి స్పష్టం చేశారు. జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. గల్ఫ్​తో పాటు ఇతర దేశాల్లో ఉంటున్న మనవాళ్లకు  వెల్ఫేర్​ బోర్డు పెట్టాలని నిర్ణయించామని, త్వరలోనే విధివిధానాలు వస్తాయన్నారు. 

మేము గృహజ్యోతి కింద పేదలకు జీరో బిల్లులు(ఉచిత కరెంట్​) ఇస్తుంటే.. గత పాలనలోని గంజాయి మొక్కలు బయటపడ్తున్నయ్. అవి ఇంకా వాసనలను వెదజల్లుతూనే ఉన్నయ్​. తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్  నుంచి ఒక నోటీసు వచ్చింది.. ముందుగాల సబ్సిడీని సంస్థలకు కట్టిన తర్వాతనే జీరో బిల్లులు ఇవ్వాలని అందులో ఉంది.

ఆ మేధావి (కమిషన్​ చైర్మన్​ తన్నీరు శ్రీరంగరావు)కి నేను చెప్పదల్చుకున్న.. గత బీఆర్​ఎస్​ సర్కార్​ విద్యుత్​ సంస్థలకు రూ. 40 వేల కోట్లు బాకీ పెట్టి ఉచిత కరెంట్​ పేరిట గొప్పలు చెప్తే ఎందుకు స్పందించలే?  నీ ఇంటి పేరు తన్నీరు ఉన్నంత మాత్రాన పన్నీరు అనుకుంటున్నవేమో..! తెలివితేటలు మానుకో. ఈ గంజాయి, కలుపు మొక్కలను పీకే పనిలో ఉన్నం. కుట్రదారులు ఫామ్​హౌస్​లో ఉండి కనుసైగలు చేస్తుంటే కొంతమంది తెలివితేటలు ప్రదర్శిస్తున్నరు. వాళ్లు అడ్డుపడినా మేము పేదలకు జీరో బిల్లులు అమలు చేస్తం.  

  -సీఎం రేవంత్​రెడ్డి