జన్సురాజ్ ఓడినా.. ఎజెండా ఓడలేదేమో?

జన్సురాజ్  ఓడినా.. ఎజెండా ఓడలేదేమో?

అందరికీ శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడిందన్నది నానుడి! అందరినీ తానే గెలిపించానని చెప్పుకునే ప్రశాంత్ కిశోర్ కనీసం బోణీ కొట్టలేకపోయారు! సొంత రాష్ట్రం. సొంత పార్టీ. రెండేళ్లుగా ప్రయత్నం. పాదయాత్రలు సహా వివిధ కార్యక్రమాలు చేశారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో, అనేక పార్టీలను తానే గెలిపించిన ప్రశాంత్ కిశోర్ తను మాత్రం ఎందుకిలా అయిపోయారు? డాక్టర్ అందరి రోగాలను నయం చేస్తారు. కానీ తన రోగానికి తాను వైద్యం చేసుకోలేడన్న చందంగా తయారైంది రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పరిస్థితి.  

దేశంలో  ఏపార్టీ అయినా అధికారంలోకి  రావాలంటే తన అండ ఉండాల్సిందే అనే స్థాయిలో  పీకే వ్యూహకర్తగా పాపులర్​.  కానీ ఇప్పుడు తనే స్వయంగా బరిలో దిగి సవాలక్ష సవాళ్లు ఎదుర్కొన్నాడు. 2014లో మోదీ విజయం కోసం పనిచేయడం ద్వారా తెరమీదకు వచ్చిన ఈ వ్యూహకర్త ఇప్పుడు తన సొంత  వ్యూహాలు ఫలించలేదు.  బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో దిగి గట్టెక్కలేకపోయాడు.  243 స్థానాలున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అటు ఎన్డీఏ  అధికారం నిలబెట్టుకునేందుకు,  ఇటు  మహాఘట్ బంధన్ పీఠం ఎక్కేందుకు శ్రమించాయి. దాంతో మధ్యలో జన్​సురాజ్​పార్టీ  ప్రజల్లో పట్టు సాధించడం అంత సులువు కాలేకపోయింది! 

15 స్థానాల్లో గట్టి పోటీ ఇచ్చింది

బిహార్ రాజకీయాల్లో మరో అధ్యాయం రాస్తానంటూ బరిలోకి దిగిన  జన్ సురాజ్ పార్టీ 238 స్థానాల్లో అభ్యర్థులను  నిలబెట్టింది. కేవలం 15 నియోజకవర్గాల్లో  మాత్రమే ఈ పార్టీ బలమైన పోటీని ఇవ్వగలిగింది. కనీసం మూడు సీట్లయినా గెలుస్తుందని వెల్లడించిన   ఎగ్జిట్ పోల్స్‌‌‌‌‌‌‌‌ అంచనాలు తారుమారైనాయి. ప్రశాంత్ కిషోర్ ఒకప్పుడు రాజకీయ నాయకులను, వారి పనితీరును తరచుగా విమర్శించేవారు. వారిని సరిదిద్దే స్థానంలో తాను ఉన్నానని భావించేవారు.  

వ్యూహకర్త అనే వృత్తిని రాజకీయాల్లో కొత్త పుంతలు తొక్కించిన ఘనత పీకేది. కానీ  బీహార్‌‌‌‌‌‌‌‌లో ‘జన్‌‌‌‌‌‌‌‌ సురాజ్‌‌‌‌‌‌‌‌’ ను ఖాతా తెరిపించలేకపోయాడు. ప్రశాంత్ కిషోర్ 2011లో నరేంద్ర మోదీకి, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, తమిళనాడు డీఎంకే అధినేత  స్టాలిన్, పశ్చిమ బెంగాల్​ సీఎం మమతా బెనర్జీకి,  ఏపీలో  వైసీపీకి  రాజకీయ సలహాదారుగా వ్యవహరించారు.  

అకస్మాత్తుగా ఆయన  శక్తిమంతమైన  రాజకీయశక్తిగా కొత్త అవతారం ఎత్తి ఇప్పడు బీహార్​లో తన శక్తిని తాను చాటుకోలేకపోయాడు.  బిహార్​లో  ప్రశాంత్​ కిషోర్​  పార్టీ  బోణీ కొట్టలేక పోవచ్చు.  బిహార్​ ప్రజలకు ఒక విజన్​ను ప్రజెంట్​ చేసిన మొదటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ప్రశాంత్​ కిషోరే! బిహార్​ బాగు కోసం ఆయన చెప్పిన పరిష్కారాలను ప్రజలు స్వాగతించారనే  విషయం  కాదనలేనిది!  అలాగే  పీకే  పార్టీ బిహార్​లో పాదుకోవడానికి ఈ ఎన్నికలు ఒక రిహార్సల్​ కావచ్చేమో? అయితే, తన పార్టీని  కొనసాగిస్తాడా లేదా అనేది  వేచిచూడాలి! 

- ఐనం ప్రసాద్-