అభివృద్ధిని అడ్డుకుంటే శివతాండవమే!: సీఎం రేవంత్

అభివృద్ధిని అడ్డుకుంటే శివతాండవమే!: సీఎం రేవంత్
  •  
  • ఆరునూరైనా మూసీ ప్రాజెక్టు ఆగేదే లేదు: సీఎం రేవంత్‌‌
  • సబితక్కా.. మీ అబ్బాయి వేసిన కేసును వెంటనే వెనక్కి తీసుకో
  • 45 ఏండ్లు పదవులు అనుభవించి.. ఇప్పుడు అడ్డుపడ్తరా?
  • రాజకీయ స్వార్థం కోసం పేద ప్రజల భవిష్యత్తును బలి చేయొద్దు
  • మంచిరేవులలో ‘మచిలేశ్వర’ శోభ..  దక్షిణ కాశీగా వెలుగుతది
  • మచిలేశ్వర, ఓంకారేశ్వర ఆలయాల పునరుద్ధరణకు భూమి పూజ

హైదరాబాద్, వెలుగు: అభివృద్ధిని అడ్డుకుంటే ఈ ప్రభుత్వం శివతాండవం చేస్తుందని, ఆరునూరైనా మూసీ పునరుజ్జీవ  ప్రాజెక్టును ఆపే ప్రసక్తే లేదని సీఎం రేవంత్‌‌రెడ్డి తేల్చి చెప్పారు. మూసీ ప్రాజెక్టుపై మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి  కొడుకు వేసిన ఎన్జీటీ కేసును వెంటనే వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయ స్వార్థం కోసం భావి తరాల భవిష్యత్తును పణంగా పెట్టవద్దని, ఒకవేళ అడ్డుపడితే ప్రజలే  సామాజికంగా బహిష్కరిస్తారని హెచ్చరించారు. దాదాపు రూ.700 కోట్ల వ్యయంతో 8 ఎకరాల్లో అద్భుతమైన ఆలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని వెల్లడించారు. ఈ ప్రాజెక్టును అత్యంత పవిత్రంగా భావిస్తున్నామని, అడ్డంకులు సృష్టిస్తే భగవంతుడే చూసుకుంటాడని అన్నారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా మంచిరేవుల గ్రామ పరిధిలో మచిలేశ్వర స్వామి, ఓంకారేశ్వర స్వామి ఆలయాల పునరుద్ధరణకు సీఎం రేవంత్ రెడ్డి శనివారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.  ఈ ఆలయాల నిర్మాణం ద్వారా ఈ ప్రాంతం ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మారుతుందని చెప్పారు.  ఇది కేవలం భవన నిర్మాణం మాత్రమే కాదని, వేల ఏండ్ల నాటి మన సంస్కృతిని కాపాడుకునే ప్రయత్నమని తెలిపారు. 


ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా తమ లక్ష్యం నుంచి వెనక్కి తగ్గేదే లేదన్నారు. ఒకవేళ ప్రాజెక్టు ఆగిపోతే హైదరాబాద్ నగరం భవిష్యత్తులో ఢిల్లీ కంటే ఘోరంగా మారుతుందని తెలిపారు.  ఢిల్లీలో కాలుష్యం వల్ల స్కూళ్లు, ఆఫీసులకు సెలవులు ఇస్తున్నారని, అలాంటి దుస్థితి మనకు రాకూడదని చెప్పారు. అభివృద్ధిని అడ్డుకునే వారు ప్రజల శత్రువులని, వారి కుతంత్రాలను ప్రజలే తిప్పికొడతారని అన్నారు.  ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ప్రజల మద్దతుతో ప్రాజెక్టును పూర్తి చేసి చూపిస్తామని సీఎం పేర్కొన్నారు.  అభివృద్ధిని అడ్డుకునే వారికి ఈ నేల మీద తిరిగే హక్కు లేదన్నారు.  యుద్ధ ప్రాతిపదికన మూసీ ప్రక్షాళన పనులు పూర్తి చేయాలని, ఎక్కడా జాప్యం జరగకూడదని  వేదిక నుంచే అధికారులను సీఎం రేవంత్‌ ఆదేశించారు. మచిలేశ్వర, ఓంకారేశ్వర ఆలయాల నిర్మాణం కూడా నిర్ణీత గడువులోగా పూర్తి కావాలని సూచించారు. ఇందుకు అవసరమైన అన్ని నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేస్తుందని తెలిపారు. స్థానిక ప్రజలు కూడా ఈ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. అడ్డంకులు సృష్టించే వారిని పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుపోవాలన్నారు. 

రాజకీయాల కోసం ప్రాజెక్టుకు అడ్డుపడొద్దు..

ఈ ప్రాంత ప్రజల ఓట్లతో 45 ఏండ్లుగాపదవులు అనుభవించి, ఇయ్యాల అభివృద్ధిని అడ్డుకోవడం ఏ సంస్కృతి అని సబితా ఇంద్రారెడ్డిని, ఆమె కుటుంబాన్ని ఉద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. సబిత కుమారుడు ఎన్జీటీలో కేసు వేయడం ద్వారా ప్రజల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు.  రాజకీయాల కోసం పేద ప్రజల ఆరోగ్యాన్ని, భవిష్యత్తును బలి చేయవద్దని హితవు పలికారు. కేసును వెంటనే వెనక్కి తీసుకుని అభివృద్ధికి సహకరించాలని, లేదంటే ప్రజల ఆగ్రహానికి గురవుతారని హెచ్చరించారు. పదవులు ఉన్నప్పుడు వారు ఏమీ చేయలేదని, ఇప్పుడు చేస్తున్న పనులను కూడా అడ్డుకోవడం దారుణమన్నారు. స్వార్థం కోసం వేసిన ఈ కేసులు కోర్టుల్లో నిలవవని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు. ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించి ప్రాజెక్టుకు అడ్డుపడటం మానుకోవాలని సీఎం సూచించారు. ప్రజల దీవెనలు ఉన్నంత కాలం ఎలాంటి అడ్డంకులు వచ్చినా తమ ప్రభుత్వం భయపడదని స్పష్టం చేశారు. మూసీ నదిలో ఏడాదంతా స్వచ్ఛమైన నీరు ప్రవహించేలా తాము ప్రణాళికలు సిద్ధం చేశామని సీఎం రేవంత్‌ వెల్లడించారు. గోదావరి నుంచి 20 టీఎంసీల నీటిని తరలించే పనులను 8 నెలల క్రితమే ప్రభుత్వం ప్రారంభించిందని చెప్పారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ద్వారా ఈ నీటిని వదిలి.. మూసీ నదిని గంగానదిలా మారుస్తామని హామీ ఇచ్చారు.  

రామప్ప నమూనాలో ఆలయాల నిర్మాణం

మంచిరేవులలో నిర్మిస్తున్న ఆలయాలను అద్భుతమైన శిల్పకళతో, రామప్ప ఆలయ నమూనాలో రూపొందిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. దీని కోసం ఇప్పటికే నిపుణులైన శిల్పులతో చర్చలు జరిపామని, వారు అద్భుతమైన డిజైన్లను సిద్ధం చేశారని చెప్పారు. రామప్ప ఆలయానికి ఉన్న విశిష్టత, గుర్తింపు ఈ ఆలయాలకు కూడా లభిస్తుందన్నారు. దక్షిణ కాశీగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దడం ద్వారా ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తామని సీఎం వెల్లడించారు.  ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా ధ్యాన కేంద్రంగా కూడా ఈ ప్రాంతాన్ని డెవలప్‌ చేస్తామన్నారు. తాము చేస్తున్న ఈ పనులు కేవలం ఓట్ల కోసమో లేక నోట్ల కోసమో కాదని  స్పష్టం చేశారు. చరిత్రలో తమ ప్రభుత్వం నిలిచిపోవాలని, ప్రజలకు మేలు జరగాలన్న తపనతోనే ముందుకు సాగుతున్నామన్నారు.   గతంలో ఎంతో మంది సీఎంలు ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రణాళికలు వేసినా అవి కార్యరూపం దాల్చలేదన్నారు.  తమ ప్రభుత్వం ఈ గొప్ప పనిని చేపట్టడం దైవ నిర్ణయమని, శివుడి ఆజ్ఞ లేనిదే ఏదీ జరగదని ఆయన వ్యాఖ్యానించారు.  

నదిని కాపాడుకోవడం చాలా ముఖ్యం

 మూసీ నది కాలుష్యం కావడానికి ప్రకృతి కారణం కాదని, ఇది ముమ్మాటికీ మానవ తప్పిదమేనని సీఎం రేవంత్‌ తెలిపారు.  గత పాలకులు, ప్రజలు చేసిన పొరపాట్ల వల్ల నదిలో పారిశ్రామిక వ్యర్థాలు, మురుగునీరు చేరి విషతుల్యం అయ్యాయని అన్నారు. హైదరాబాద్‌లోని దాదాపు 785 చదరపు కిలోమీటర్ల పరిధిలోని మురుగునీరంతా నేరుగా మూసీలోనే కలుస్తున్నదని చెప్పారు. దీనివల్ల నది ఉనికి ప్రశ్నార్థకం కావడమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలు నివాసయోగ్యం కాకుండా పోతున్నాయన్నారు.  నిత్యావసర వస్తువుల కంటే కూడా ఈ నదిని కాపాడుకోవడం ఇయ్యాల ఎంతో అత్యవసరమని సీఎం స్పష్టం చేశారు.  ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకే మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని చెప్పారు. మానవ తప్పిదం వల్ల కలిగిన ఈ నష్టాన్ని పూడ్చేందుకు ప్రభుత్వం ఎంత ఖర్చయినా వెనకాడదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.  మూసీ నది ప్రవహించే ప్రతి చోటా సర్వమతాల ప్రార్థనా మందిరాలను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాజ్యసభ ఎంపీ వేం నరేందర్‌‌రెడ్డి పాల్గొన్నారు.