గుజరాత్ వర్సెస్ దేశం.. తెలంగాణ అభివృద్ధికి మోదీ సహకరించట్లె: సీఎం రేవంత్

గుజరాత్ వర్సెస్ దేశం.. తెలంగాణ అభివృద్ధికి మోదీ సహకరించట్లె: సీఎం రేవంత్
  • నిధులన్నీ స్వరాష్ట్రానికి తరలించుకుంటున్రు 
  • బీజేపీ పాలిత రాష్ట్రాలకూ ప్రధాని అన్యాయం
  • ఉత్తరాదికి శ్రీ రాముడు దేవుడు.. అందుకే జై శ్రీరాం 
  • మేం ద్రావిడులం మాకు శివుడే దేవుడు 
  • బీజేపీ వేదికలపై హరహర మహాదేవ అనరు
  • ‘అస్సాం’ ప‌‌‌‌త్రిక ప్రతిదిన్‌‌‌‌ కాంక్లేవ్లో సీఎం రేవంత్

న్యూఢిల్లీ, వెలుగు: ప్రధాని మోదీ తెలంగాణ అభివృద్ధికి సహకరించట్లేదని, నిధులన్నీ గుజరాత్ కు తరలిస్తున్నరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. దివంగత మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన సహకారంతోనే గుజరాత్ అభివృద్ధి చెందిందని సీఎం గుర్తు చేశారు. 

సోమవారం ఢిల్లీలో అస్సాం దిన‌‌‌‌ప‌‌‌‌త్రిక ప్రతిదిన్‌‌‌‌  కాంక్లేవ్‌‌‌‌–2026 లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసోమియా ప్రతిదిన్, ప్రతిదిన్ టైమ్స్ చానల్ బిజినెస్ డెవలప్మెంట్ డైరెక్టర్ రిషి బారువా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు(ట్రిపుల్ ఆర్), జాతీయ రహదారులు తదితర అనేక విజ్ఞప్తులు ప్రధాని మోదీ దగ్గర పెండింగ్ లోనే ఉన్నాయని చెప్పారు. ప్రధానంగా 360 కిలో మీటర్ల ట్రిపుల్ ఆర్ ప్రాజెక్ట్ పూర్తిగా మంజూరు అయి, టెండర్లు పిలిచిన తర్వాత కూడా ఆ ఫైల్ దాదాపు రెండేండ్లుగా పీఎంవోలోనే పడి ఉందన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ విషయంలో చేతులెత్తేశారని చెప్పారు. తెలంగాణకు వచ్చిన సెమీకండక్టర్ పరిశ్రమను చివరి రోజు ప్రధాని గుజరాత్​కు తరలించుకుపోయారని ఆరోపించారు.

నార్త్ వర్సెస్ సౌత్ కాదు... గుజరాత్ వర్సెస్ కంట్రీ !
గుజరాత్​కు మోదీ అంబాసిడర్​గా మారి బెదిరించి, భయపెట్టి ప్రాజెక్ట్ లను తన సొంత రాష్ట్రానికి తీసుకెళ్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.  గుజరాత్​కు మోదీ చేస్తోన్న బ్రాండింగ్, మద్దతు, ఫండింగ్, ప్రమోట్... తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసికి ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. 

మోదీ చూపిస్తున్న పక్షపాతం... నార్త్ వర్సెస్ సౌత్ కాదని... గుజరాత్ వర్సెస్ మిగిలిన అన్ని రాష్ట్రాలని అన్నారు. మధ్య ప్రదేశ్, మహారాష్ట్రలోనూ బీజేపీ ప్రభుత్వమే ఉందని, కానీ.. మోదీ కేవలం గుజరాత్​కు మాత్రమే రిప్రజెంట్ చేస్తున్నారని విమర్శించారు. లోక్ సభ ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మోదీ అన్నింటినీ గుజరాత్​కు తరలించుకుపోతున్నారని ఆరోపించారు. గుజరాత్​కు కేంద్రం అందిస్తున్న సహకారాన్ని ఇతర రాష్ట్రాలతో పోల్చి చూడాలన్నారు.  

"మేం (దక్షిణాది) ద్రావిడులం, వాళ్లు (ఉత్తరాది) ఆర్యులు. మేం శివ భక్తులం, వాళ్లు రామ భక్తులు" అని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలు వేదికలపై జై శ్రీరాం అంటారు కానీ హరహర మహాదేవ్ అనరని, శివుడు పేదల దేవుడని, శ్రీరాముడు సంపన్నుల దేవుడని, బీజేపీ సంపన్నుల పార్టీ అని అన్నారు. 

ఆంధ్రలో 175, తెలంగాణలో 119 సీట్లున్నాయని, ఆంధ్రా వాళ్లు పెత్తనంపై పోరాడి తెలంగాణ సాధించుకున్నామని గుర్తుచేశారు. అల్పసంఖ్యాకులను అణిచివేస్తే విప్లవం వస్తుందని, పిల్లిని గదిలో పెట్టి కొడితే ఏమవుతుందో అందరికీ  తెలుసని అన్నారు. మనసులు గెలుచుకుని మూడు, నాలుగు సార్లు గెలవండి కానీ ఇబ్బంది పెట్టవద్దని సూచించారు. 2004లో 'ఇండియా షైనింగ్' అన్నప్పుడు కాంగ్రెస్ ఉంటుందా లేదా అనే చర్చ సాగిందని, కానీ ప్రజలు తెలివైనవారని రేవంత్ అన్నారు.

ఫాంహౌస్​లోనే అంబాసిడర్ కారు
‘1956లో దేశంలో ఐటీఐలు ప్రారంభించారు. వాటిలో డీజిల్ మెకానిక్ వంటి  కోర్సులు ఉంది. 70 ఏళ్ల త‌‌‌‌ర్వాత ఆ కోర్సే ఉంది. ఇప్పుడు అంబాసిడ‌‌‌‌ర్ కారు లేదు. డీజిల్ మెకానిక్ లేడు. కేసీఆర్ ఎర్ర‌‌‌‌వ‌‌‌‌ల్లి ఫాంహౌస్‌‌‌‌లో ఒక్క అంబాసిడ‌‌‌‌ర్ కారు ఉంది. వాళ్ల పార్టీ గుర్తు. మ‌‌‌‌రో కారే లేదు. నేను ఆ కోర్సులు తీసివేశా. టాటా కంపెనీతో ఒప్పందం చేసుకున్నాం. 86 శాతం టాటా కంపెనీ నిధులు ఇస్తోంది. మేం 14 శాతం భ‌‌‌‌రిస్తున్నాం. 

ప్రతి నియోజ‌‌‌‌క‌‌‌‌వ‌‌‌‌ర్గంలో ఏటీసీలు ఏర్పాటు చేశాం. సిల‌‌‌‌బ‌‌‌‌స్ వాళ్లే త‌‌‌‌యారు చేస్తున్నారు. వాళ్లే ఉద్యోగాలు ఇస్తున్నారు. ఏఐతో వైట్ కాల‌‌‌‌ర్ జాబ్‌‌‌‌ల‌‌‌‌కు కాలం చెల్లింది. ఇప్పుడు బ్లూ కాల‌‌‌‌ర్ జాబ్‌‌‌‌ల కాలం. అవి జ‌‌‌‌ర్మనీ, జ‌‌‌‌పాన్, కొరియా దేశాలు ఇస్తున్నాయి. అక్క‌‌‌‌డ ఉద్యోగాలు చేసేందుకు వీలుగా జ‌‌‌‌ర్మన్‌‌‌‌, జ‌‌‌‌పాన్‌‌‌‌, కొరియా భాష‌‌‌‌లు నేర్పిస్తున్నాం. ఆయా దేశాలతో ఒప్పందాలు చేసుకుంటున్నాం.’ అని సీఎం తెలిపారు.

హరహర మహాదేవ అనరేం
మేం (దక్షిణాది) ద్రావిడులం, వాళ్లు (ఉత్తరాది) ఆర్యులు. మేం శివ భక్తులం, వాళ్లు రామ భక్తులు. బీజేపీ నేతలు వేదికలపై జై శ్రీరాం అంటారు కానీ హరహర మహాదేవ్ అనరు. శివుడు పేదల దేవుడు.. శ్రీరాముడు సంపన్నుల దేవుడు.. బీజేపీ సంపన్నుల పార్టీ.
 
ఓట్లెందుకు తగ్గుతున్నయ్
2014లో మోదీ ప్రధాని అయినప్పుడు 81 కోట్లు, 2019లో 91 కోట్లు, 2024లో 97 కోట్ల ఓట్లు ఉండగా, 2029 ఎన్నికలకు సంబంధించి 13 కోట్ల ఓట్లు తొలగించారని రేవంత్ చెప్పారు. జనాభా, ఆయుర్దాయం పెరుగుతున్నప్పుడు ఓట్లు పెరగాలి కానీ కోట్ల ఓట్లు ఎందుకు తొలగిస్తున్నారని ప్రశ్నించారు. తనను వ్యతిరేకించిన వారి ఓట్లను మోదీ తొలగిస్తున్నారని, వాట్సాప్, సోషల్ మీడియాలో వ్యతిరేకంగా పోస్టులు పెట్టేవారి మతం, కులం అంటూ ఓట్లు తీసేస్తారని ఆరోపించారు.

ఏఐ టెక్నాలజీ వాడి ఓట్లు తీసివేస్తున్నారని, ముగ్గురు ఎన్నికల కమిషనర్లలో ఇద్దరికి తెలియకుండా సీఈసీ జ్ఞానేష్ కుమార్ నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. బూత్ లెవల్ అధికారి నుంచి కలెక్టర్ వరకు అధికారాలన్నీ ఎన్నికల కమిషన్ గుప్పిట్లో పెట్టుకున్నారని పేర్కొన్నారు. ఇది కాంగ్రెస్ సమస్య కాదని, దేశ ప్రజాస్వామిక సమస్య అని చెప్పారు.

"గాంధీ పరివార్ వర్సెస్ సంఘ్ పరివార్" అనే ప్రశ్నకు స్పందిస్తూ, ఉత్తర కొరియాలో కిమ్ పార్టీయే ఉంటుందని, జ్ఞానేష్ కుమార్‌‌‌‌ను పది రోజులు అక్కడికి పంపితే శిక్షణ తీసుకొచ్చి మోదీకి వందకు వంద శాతం ఓట్లు వేయిస్తారని వ్యాఖ్యానించారు.