తెలంగాణ పబ్లిక్ స్కూల్ దేశానికే రోల్ మోడల్..నియోజకవర్గానికి ఒకటి ఏర్పాటు చేస్తం: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ పబ్లిక్ స్కూల్ దేశానికే రోల్ మోడల్..నియోజకవర్గానికి ఒకటి ఏర్పాటు చేస్తం: సీఎం రేవంత్ రెడ్డి
  •  
  • నియోజకవర్గానికి ఒకటి ఏర్పాటు చేస్తం: సీఎం రేవంత్​రెడ్డి
  •     27 లక్షల మంది స్టూడెంట్లకు అంకితం
  •     కులాల మధ్య గోడలు కూల్చేలా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 
  •     ప్రభుత్వ బడుల్లో చదవడం నామోషీ అనే ఆలోచన పోవాలి
  •     విద్యారంగానికి బడ్జెట్‌‌‌‌లో 8.5% నిధులు.. ఇది ఖర్చు కాదు.. భవిష్యత్తుకు పెట్టుబడి
  •     రూ.687 కోట్ల స్కూల్‌‌‌‌ కిట్స్‌‌‌‌ టెండర్లలో 3 వేల కోట్ల అవినీతి ఎలా సాధ్యం?
  •     ఆ తాటిచెట్టులా పెరిగిన మేధావులకు మతిభ్రమించింది
  •     ఈసారి ప్రతిపక్ష హోదా కూడా ఉండదని కామెంట్‌‌‌‌
  •     ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్‌‌‌‌ను ప్రారంభించిన సీఎం 

హైదరాబాద్, వెలుగు: రంగుల గోడల్లో కాదు.. క్లాస్​ రూముల్లోనే రాష్ట్ర భవిష్యత్తు రూపుదిద్దుకుంటుందని సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి పేర్కొన్నారు. విధ్వంసమైన విద్యావ్యవస్థను వికాసం వైపు నడిపించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. విద్యపై ప్రభుత్వం పెట్టేది ఖర్చు కాదని, రేపటి తరం కోసం చేస్తున్న పెట్టుబడి అని వెల్లడించారు. గవర్నమెంట్ బడులకు వెళ్తే తమ పిల్లలకు చదువు రాదనో, ఉద్యోగావకాశాలు రావనే అనుమానాలు పేద ప్రజల్లో ఉన్నాయని, ఆ అపనమ్మకాన్ని పోగొట్టి, వారిలో ఆత్మవిశ్వాసం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో  తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీపీఎస్‌‌‌‌)ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం  జరిగిన సభలో ఆయన మాట్లాడారు. 24 వేల సర్కారు బడుల్లో చదివే 27 లక్షల మంది విద్యార్థులకు ఈ టీపీఎస్‌‌‌‌ ప్రారంభోత్సవాన్ని అంకితం చేస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలో కేజీ నుంచి పీజీ వరకు మంచి విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. సర్కారు బడుల్లో చదివే విద్యార్థులు..రేపటి భవిష్యత్తుకు నాయకత్వం వహిస్తారనే విశ్వాసం తనకు ఉందన్నారు. 


రాష్ట్రంలోని సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు ఆరుట్ల తెలంగాణ పబ్లిక్‌ స్కూల్ ఒక స్ఫూర్తి అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ సర్కారు స్కూల్‌లో ఇప్పటికే 1,814 మంది విద్యార్థులు చేరారని,  ఒకప్పుడు ప్రభుత్వ బడుల్లో పిల్లలు చేరేందుకు ఇబ్బంది పడేవాళ్లని, కానీ ఆరుట్ల స్కూల్‌లో సీట్లు లేవు అని బోర్డు పెట్టే పరిస్థితి వచ్చిందన్నారు. ఇది ఇక్కడి టీచర్లు, మేనేజ్‌మెంట్ కమిటీ కృషి అని ప్రశంసించారు. ఇది తమ ప్రభుత్వంపై ప్రజలకున్న నమ్మకానికి నిదర్శనమని తెలిపారు.  రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అని విడివిడిగా హాస్టళ్లు పెట్టి మనం కులాల మధ్య గోడలు కడుతున్నామని, అందుకే అందరూ కలిసి చదువుకునేలా 25 ఎకరాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామని చెప్పారు. తద్వారా చిన్నప్పటి నుంచే పిల్లల్లో సమానత్వం పెరుగుతుందని తెలిపారు. పిల్లల్లో స్కిల్స్ పెంచేందుకు ఏర్పాటు చేసిన స్కిల్స్ యూనివర్సిటీని డిసెంబర్ 9న  ప్రారంభిస్తామని వెల్లడించారు. తెలంగాణ యువత ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఉద్యోగం సంపాదించేలా తయారు చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో దాదాపు రూ.27 వేల కోట్లు విద్యాశాఖపైనే ప్రభుత్వం ఖర్చు చేస్తోందని, అంటే విద్యారంగానికి బడ్జెట్‌లో 8.5శాతం నిధులు కేటాయించామని చెప్పారు.  

సర్కారు బడిలో చదివి ఈ స్థాయికి వచ్చా.. 

తన చిన్ననాటి కష్టాలను గుర్తు చేసుకుంటూ విద్యార్థుల్లో సీఎం రేవంత్‌రెడ్డి భరోసా నింపారు. ‘‘నేనూ మీలాగే సర్కారు బడిలోనే చదివిన. మా ఊరు కొండారెడ్డిపల్లిలో ఐదో తరగతి వరకే ఉండేది. ఆరో తరగతి చదువు కోసం రోజుకు 6 కిలోమీటర్లు తాండ్ర గ్రామానికి నడిచి వెళ్లేవాడిని. అప్పట్లో సౌకర్యాలు లేవు. వానాకాలం వస్తే వంకలు దాటి వెళ్లాల్సి వచ్చేది. కానీ చదవాలనే పట్టుదల నన్ను ముఖ్యమంత్రిని చేసింది” అని చెప్పారు. తనతో పాటు కేశవరావు, ఆకునూరి మురళి, మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి,  జైపాల్‌రెడ్డి సహా ప్రధానిగా పనిచేసిన పీవీ నర్సింహారావు కూడా సర్కారు బడుల్లో చదువుకున్న వారేనని పేర్కొన్నారు. కాబట్టి సర్కారు బడుల్లో చదివితే చిన్నతనం కాదనీ, ఇక్కడి నుంచి ఐఏఎస్, ఐపీఎస్​లే కాదు.. ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అవ్వొచ్చని ఈ ఉదాహరణలు మన కండ్ల ముందే ఉన్నాయన్నారు. 

రాజకీయం చేస్తే ప్రతిపక్ష హోదా కూడా ఉండదు.. 

పిల్లలకు ఇచ్చే కిట్లలో క్వాలిటీ ఉండాలని తామే షూస్, బట్టలు ఇస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఒకప్పుడు బట్టలు ఇస్తే మూడు రోజులకే బటన్లు ఊడిపోయేవని, అందుకే ఈ సారి 9 వస్తువులతో కూడిన నాణ్యమైన కిట్ ఇస్తున్నామని పేర్కొన్నారు. దీనిపై కూడా కొందరు రాజకీయ విమర్శలు చేస్తున్నారన్నారు. అయితే, తాము పిలిచింది రూ.687 కోట్ల టెండర్లు అయితే.. తాము మేధావులమని చెప్పుకునే కొందరు రూ. 3 వేల కోట్ల అవినీతి అంటున్నారని విమర్శించారు. రూ.687 కోట్ల టెండర్లలో 3 వేల కోట్ల అవినీతి ఎలా జరుగుతుందో ఆ మేధావులకే తెలియాలని ఎద్దేవా చేశారు. తాటిచెట్లలా పెరిగిన ఆ మేధావులకు  మతిభ్రమించి మాట్లాడుతున్నారో, లేక కళ్లు మూసుకుపోయాయో అర్థం కావడం లేదన్నారు. విమర్శలు చేసే వాళ్లు ఒక్కసారి ఆరుట్ల స్కూల్‌కు వచ్చి చూడాలన్నారు.  ఇలాంటి వాళ్లకు భవిష్యత్తులో ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా మిగల్చరని విమర్శించారు. ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీని రప్పించి సర్కారు గురుకులాల పిల్లలతో ఆడించినా రాజకీయం చేశారని విమర్శించారు. 2034 ఒలింపిక్స్‌లో తెలంగాణ బిడ్డలు గోల్డ్ మెడల్స్ తేవడమే మన టార్గెట్ అని ప్రకటించారు. తెలంగాణ పిల్లలే గోల్డ్ మెడల్స్ సాధించేలా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. 

గంజాయిపై యుద్ధం..

రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ మహమ్మారిని అంతం చేసేం దుకు విద్యార్థులు సహకరించాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. తమ చుట్టుపక్కల ఎవరైనా గంజాయి అమ్ముతున్నా, వాడుతున్నా తక్షణమే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థులే ఈ సమాజానికి ఇన్‌ఫార్మర్లుగా మారాలని, గంజాయి లేని తెలంగాణను నిర్మించడంలో మీ పాత్ర కీలకమని స్పష్టం చేశారు.  

విద్యా, వైద్యమే మా ప్రాధాన్యత : మంత్రి శ్రీధర్‌‌బాబు

 సర్కార్ విద్యను బలోపేతం చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి శ్రీధర్‌‌బాబు చెప్పారు. కార్పొరేట్ స్థాయిలో ఉన్న అన్ని సౌకర్యాలను టీపీఎస్‌ల ద్వారా పేద విద్యార్థులకు అందిస్తున్నామన్నారు. విద్యా, వైద్య రంగాలకు తమ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తోందని, పిల్లలకు నాణ్యమైన విద్య అందిన‌ప్పుడే నిజ‌మైన అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. 

టీపీఎస్‌లు కొత్త చరిత్ర సృష్టిస్తాయి: ఆకునూరి

తెలంగాణ విద్యా చరిత్రలో ఈరోజు ప్రత్యేకంగా లిఖించదగ్గ రోజని తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవతో పేదలకు అత్యున్నత స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు  టీపీఎస్‌లు ఏర్పాటయ్యాయని తెలిపారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లోని కార్పొరేట్ పాఠ‌శాల‌ల‌కు దీటుగా టీపీఎస్‌లు ఉంటాయ‌న్నారు.  భవిష్యత్తులో ప్రతి మండలానికి ఒక టీపీఎస్ ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ నిర్ణయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, రఘువీర్‌‌రెడ్డి, మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌‌రెడ్డి, ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, విద్యాశాఖ సెక్రెటరీ యోగితా రాణా, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్, ఇంటర్ విద్యా కమిషనర్ అభిలాష అభినవ్, కమిషన్ సభ్యులు పీఎల్ విశ్వేశ్వర్‌‌రావు, చారకొండ వెంకటేశ్, జ్యోష్నా శివరెడ్డి, ఆరుట్ల సర్పంచ్ శోభ తదితరులు పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు  లక్ష రూపాయల చొప్పున ప్రోత్సాహక చెక్కులను సీఎం రేవంత్‌రెడ్డి అందజేశారు.

హెలిప్యాడ్ నుంచి స్కూల్ బస్సులో..

హెలికాప్టర్ దిగిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి టీపీఎస్​ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన కొత్త  బస్సులో ప్రయాణించారు. మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి హెలీప్యాడ్ నుంచి స్కూల్ వరకు బస్సులోనే వెళ్లారు. అక్కడ పైలాన్‌ను ఆవిష్కరించి, తనకు స్వాగతం పలికిన పిల్లలను ఆప్యాయంగా పలకరించారు. అనంతరం వంట గదిని పరిశీలించారు. ‘నేను మీలా పూరీ చేయగలనా?’  అంటూ వంట చేసే మహిళలతో సరదాగా సంభాషించారు. స్వయంగా పూరీ ఒత్తి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత పిల్లలతో కలిసి డైనింగ్ హాల్‌లో కూర్చొని టిఫిన్ చేశారు. స్కూల్‌లోని ఇన్నోవేషన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ ల్యాబ్స్, లైబ్రరీలను సందర్శించారు. ప్రీ -ప్రైమరీ క్లాస్ రూముల్లో పిల్లల లెర్నింగ్ యాక్టివిటీని చూసి మురిసిపోయారు. స్కూల్ ఆవరణలో జామ మొక్కను నాటారు. అనంతరం గ్రౌండ్‌కు వెళ్లి విద్యార్థులతో ఫుట్ బాల్ ఆడారు.

విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకే విద్యా కమిషన్‌‌‌‌ ఏర్పాటు చేశాం. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యపై తల్లిదండ్రుల్లో అపోహలు ఉన్నాయి. అందరి అపోహలు తొలగించేందుకే టీపీఎస్‌‌‌‌ నిర్మాణం చేపట్టాం. విద్య మాత్రమే మన జీవితాలను సమూలంగా మార్చగలదు. సమాజంలో అసమానతలు పోవాలంటే అందరికీ నాణ్యమైన విద్య అవసరం. ప్రభుత్వ బడుల్లో చదవడం నామోషీ అనే ఆలోచన పోవాలి. - సీఎం రేవంత్​రెడ్డి