- ప్రజలందరూ సహకరించాలి: సీఎం రేవంత్
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: గ్రామాలను అభివృద్ధి చేసే వాళ్లను, మంచివాళ్లనే సర్పంచులుగా ఎన్నుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ‘‘కాంగ్రెస్‌తో రాష్ట్రంలో మంచి పాలన అందుతున్నది. అందువల్లే ఫ్రీ కరెంట్, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు వస్తున్నాయి. మీరు సహకరిస్తే తెలంగాణను దేశంలో నంబర్ వన్ గా నిలబెడ్తాం” అని ప్రజలకు తెలిపారు.
భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌ను మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్‌లో మాట్లాడారు. ‘‘మంచి ప్రభుత్వం ఉన్నా మంచోళ్లు సర్పంచులుగా లేకపోతే గ్రామాలు అభివృద్ధి చెందలేవు. మంత్రులతో కలిసి పనిచేయగలిగినవారినే సర్పంచ్‌లుగా ఎన్నుకోవాలి” అని సూచించారు. రెండేండ్లలో చేసిన పనులను చెప్పుకునేందుకే ప్రజా పాలన సంబురాలు చేసుకుంటున్నామని తెలిపారు. ఈ సంబురాల్లో భాగంగానే ఎర్త్ యూనిర్సిటీని ప్రారంభించుకున్నామన్నారు.
పదేండ్లలో సాగునీటి ప్రాజెక్టులు నిర్లక్ష్యం
గత పదేండ్లలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ‘‘సాగునీటి ప్రాజెక్టులు గత పాలకులకు కమీషన్లు కురిపించాయే తప్ప నీళ్లు పారలేదు. కృష్ణా, గోదావరి జలాలతో ఖమ్మం జిల్లా లోని బీళ్లను తడిపి సిరులు పండించాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి నిధులు మంజూరు చేసే బాధ్యత నాది” అని తెలిపారు.
పాలనలో ఆయువు పట్టులాంటి మూడు శాఖలకు ఖమ్మం జిల్లా నుంచే మంత్రులు ఉన్నారని చెప్పారు. ఇరిగేషన్, ఎడ్యుకేషన్ రంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తూ తెలంగాణ ఖ్యాతి ప్రపంచ స్థాయిలో నిలిచిపోయేలా చేస్తున్నదని తెలిపారు. డాక్టర్‌మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ వర్సిటీతో దేశంతో పాటు ప్రపంచం అబ్బుర పడుతుందని పేర్కొన్నారు.
ప్రపంచంతో పోటీ పడాలంటే గొప్ప యూనివర్సిటీలు రావాల్సిన అవసరం ఉందన్నారు. విద్య మాత్రమే తెలంగాణను ఉన్నత స్థానంలో నిలబెడ్తుందని, అందుకే ఆ వైపుగా ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. సింగరేణి లాంటి సంస్థలను మరింతగా అభివృద్ధి చెందాలంటే ఎర్త్ యూనివర్సిటీ లాంటివి అవసరమన్నారు. మెడికల్ కాలేజీలు, యంగ్ ఇండియా స్కూల్స్‌ను ప్రారంభిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
పాల్వంచ నుంచే తెలంగాణ ఉద్యమం
పాల్వంచ నుంచే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పాల్వంచలోని కేటీపీఎస్ ఈ ప్రాంత వాసులకు కాకుండా ఇతర ప్రాంతాలకు చెందినవారికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడంతో తెలంగాణ ఉద్యమం 1969లో ఇక్కడే మొదలైందని చెప్పారు. తెలంగాణ ఆకాంక్షను నేర వేర్చి రాష్ట్రాన్ని ఇచ్చిన మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ను రాష్ట్రంలోని గత పాలకులు మర్చిపోయారని, ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్ అని తెలిపారు.
తెలంగాణను ఇచ్చిన ఆయన పేరును పాల్వంచలోని ఎర్త్ యూనివర్సిటీకి పెట్టామన్నారు. హెలికాప్టర్లో సాంకేతిక కారణాలతో ఇక్కడకు రావడం ఆలస్యమైందని, మరోసారి వస్తానని, మరింత ముచ్చటిస్తానని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా తన గుండెల్లో ఉత్సాహాన్ని నింపిందని, ఈ ఉత్సాహాన్ని ఊపిరిగా తీసుకుంటానన్నారు.
ఇందిరమ్మ ఇండ్లతో పాటు పలు సంక్షేమ పథకాలను ఈ జిల్లా నుంచే ప్రారంభించామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు వాకిటి శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీలు పోరిక బలరాం నాయక్, రామసహాయం రఘురాం రెడ్డి, ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, కోరం కనకయ్య, రాందాస్ నాయక్, పాయం వెంకటేశ్వర్లు, మట్టా రాగమయి, తెల్లం వెంకట్రావ్ పాల్గొన్నారు.
