
- ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుంది: సీఎం రేవంత్
- సీఎంను కలిసిన బీసీ కమిషన్ చైర్మన్, మెంబర్స్
హైదరాబాద్, వెలుగు: కులగణన కార్యాచరణను ప్రారంభించాలని బీసీ కమిషన్ చైర్మన్, మెంబర్లకు సీఎం రేవంత్రెడ్డి సూచించారు. ప్రభుత్వం అన్నివిధాలా సహకరిస్తుందని, రెండు రోజుల్లో టర్మ్ఆఫ్రెఫరెన్స్(టీవోఆర్) ఇస్తామని తెలిపారు. సెక్రటేరియెట్లో సీఎం రేవంత్ రెడ్డిని బుధవారం బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్తోపాటు మెంబర్లు బాలలక్ష్మి, తిరుమల గిరి సురేందర్, రాపోలు జయప్రకాశ్, కమిషన్ అసిస్టెంట్ సెక్రెటరీ సతీశ్కలిశారు.
రాష్ట్రంలో బీసీ కులగణనకు అనుసరించాల్సిన విధి విధానాలపై ముఖ్యమంత్రితో కమిషన్ చైర్మన్, సభ్యులు చర్చించారు. కులగణన ప్రక్రియ చేపట్టేందుకు అవసరమైన చర్యలపై సమగ్ర అధ్యయనం చేయాలని సీఎం రేవంత్సూచించారు. అవసరమైతే ఇతర రాష్ట్రాలకు వెళ్లి అక్కడి విధానాలను పరిశీలించాలని తెలిపారు. కాగా, కమిషన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి సీఎంను మర్యాద కలిసినట్టు చైర్మన్ నిరంజన్ తెలిపారు. కులగణన ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సహాయ, సహకారాలు అందిస్తామని సీఎం హామీ ఇచ్చారని చెప్పారు.