
- రాజ్యాంగం సవాళ్లు: దృక్పథం, మార్గాలు’ థీమ్‌తో సదస్సు
- సదస్సులో ప్రసంగించనున్న ముఖ్యమంత్రి
- ముఖ్య అతిథులుగా పార్టీ చీఫ్ ఖర్గే, రాహుల్, ప్రియాంక
న్యూఢిల్లీ, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం రాత్రి ఢిల్లీకి వెళ్లారు. ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) లీగల్ సెల్ మెగా ఈవెంట్‌ను శనివారం నిర్వహిస్తున్నది. ఏఐసీసీ లా, హ్యూమన్ రైట్స్ అండ్ ఆర్‌టీఐ విభాగం- ఆధ్వర్యంలో ‘రాజ్యాంగ సవాళ్లు: దృక్పథం, మార్గాలు’ అనే థీమ్‌తో ఈ సదస్సును జరపనుంది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ఉదయం 9 గంటలకు ప్రారంభంకానున్న ఈ సదస్సులో.. భారత రాజ్యాంగంలో నీతి, డైనమిక్స్‌పై సుదీర్ఘంగా చర్చించనున్నారు.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు ఇందులో పాల్గొననున్నారు. 1,200 మంది న్యాయ నిపుణులు, కాంగ్రెస్ నేతలు, నాయకులు, కార్యకర్తలు, మేధావులు, విద్యార్థులు చర్చలో భాగస్వాములు కానున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సదస్సు కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రాజ్యసభ ఎంపీ, ఏఐసీసీ లీగల్ సెల్ చైర్మన్ డాక్టర్ అభిషేక్ మను సింఘ్వి వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. రాత్రి ఎనిమిదిన్నరకు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో దిగిన సీఎం.. నేరుగా తుగ్లక్ రోడ్ లోని సీఎం నివాసానికి చేరుకున్నారు. ఆయన వెంట పలువురు మంత్రులు, పార్టీ నేతలు ఉన్నారు. ఈ సదస్సులో ఉదయం 11:45 గంటలకు సీఎం రేవంత్ రాజ్యాంగం సవాళ్ల పై 10 నిమిషాల పాటు ప్రసంగించనున్నారు.