- కాలువ ద్వారా పాలేరులోకి మున్నేరు వరద తరలింపు
- రూ.162.54 కోట్లతో 9.6 కి.మీ. కాల్వ నిర్మాణం
- ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు ప్రయోజనం
- ఇవాళ శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి
ఖమ్మం, వెలుగు: మున్నేరు వరద నీటిని ఒడిసి పట్టి రైతులకు మళ్లించేలా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మున్నేరు-, పాలేరు గ్రావిటీ కెనాల్ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు శంకుస్థాపన చేయనున్నారు. ప్రతియేటా వృథాగా సముద్రంలోకి వెళ్తున్న 50 టీఎంసీల నీటిని సద్వినియోగం చేస్తూ, సుమారు 1.38 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. రూ. 162.57 కోట్ల అంచనాతో 9.6కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఈ కాలువ ద్వారా మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం దుబ్బగూడెం చెక్ డ్యామ్ నుంచి వరద నీటిని పాలేరు రిజర్వాయర్‌కు మళ్లిస్తారు.
దీనివల్ల ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లోని రైతులకు సాగునీటి భద్రత లభించడంతో పాటు నాగార్జున సాగర్ ఆయకట్టుకు ప్రత్యామ్నాయ నీటి వనరు అందుబాటులోకి వస్తుంది. మున్నేరు, -పాలేరు లింక్ పథకంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ స్టేజ్-2 ను బలోపేతం చేయడంతో పాటు పాలేరు రిజర్వాయర్ ద్వారా భక్త రామదాసు ఎత్తిపోతల పధకం కింద ఉన్న డీబీఎం 60 ద్వారా ఖరీఫ్ సాగుకు 70,308 ఎకరాల ఆయకట్టుకు అదనపు నీటి లభ్యత చేకూరనుంది. అదే విదంగా సూర్యాపేట జిల్లాలోని మోతె ఎత్తిపోతల పథకం ద్వారా డీబీఎం -71 కింద ఉన్న 46,712 ఎకరాల భూమికి నిరంతరం సాగునీటిని అందించవచ్చు.
సీతారామ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న లింక్ కాలువలకు అనుసంధానించడం వల్ల విద్యుత్ ఖర్చులు లేకుండా గ్రావిటీ ద్వారానే నీరు చేరుతుందని, తద్వారా ఏటా రూ. 120 కోట్ల విద్యుత్ బిల్లులు ఆదా అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే అదనపు ఆయకట్టుకు నీరందడమే కాకుండా, పాలేరు హైడల్ పవర్ ప్లాంట్ ద్వారా 2 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి కూడా అవకాశం కలగనుంది.
