
- ఎన్నికలు పెట్టాల్సిందేనని హైకోర్టు చెప్తే..
- బీసీల రిజర్వేషన్లకు ప్రత్యేక జీవో
- మంత్రులతో చర్చించిన సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి శనివారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అందుబాటులో ఉన్న మంత్రులతో భేటీ అయ్యారు. ఇందులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, వివేక్ వెంకటస్వామి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. స్థానిక ఎన్నికలపై హైకోర్టు విధించిన గడువు ఈ నెలఖారుతో ముగియనుంది. ఇంకా పది రోజులే టైమ్ ఉండటం, రిజర్వేషన్లపై క్లారిటీ రాకపోవడంతో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై సమావేశంలో కీలకంగా చర్చించినట్లు తెలిసింది.
రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే తన ప్రక్రియను పూర్తి చేసింది. ప్రభుత్వమే రిజర్వేషన్ల గెజిట్‌ను అందించాల్సి ఉంది. ప్రస్తుతం స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతానికి సంబంధించిన రిజర్వేషన్ల బిల్లు, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు రెండూ పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పటికే సుప్రీంకోర్టులో రాష్ట్రపతి, గవర్నర్ దగ్గర పెండింగ్‌లో ఉన్న బిల్లులపై కేసు నడుస్తున్నది. వచ్చే నెలలో దీనిపై సుప్రీం తీర్పు వెలువరించే అవకాశం ఉంది. దీంతో స్థానిక ఎన్నికల నిర్వహణకు హైకోర్టును కొంత గడువు కోరాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం.
అందుకు హైకోర్టు అనుమతిస్తే.. సుప్రీంకోర్టు తీర్పు వరకు వెయిట్ చేసి దానికి తగ్గట్టు ముందుకు వెళ్లనున్నారు. ఒకవేళ హైకోర్టు స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సిందేనని చెప్తే.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ప్రత్యేక జీవో జారీ చేసి ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలిసింది. దానిపైనా కూడా ఎవరైనా కోర్టుకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేస్తే.. పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలపై ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం.
ఫార్ములా ఈ రేస్, కాళేశ్వరం కేసులపైనా చర్చ!
ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ రిపోర్ట్, కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ ఎంక్వైరీకి అనుమతించినా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడంపైనా సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఫార్ములా ఈ రేస్‌లో మాజీ మంత్రి కేటీఆర్, స్పెషల్ సీఎస్ ఆర్వింద్కుమార్పై చర్యలు తీసుకోవాలని ఏసీబీ రిపోర్ట్‌లో పేర్కొన్నట్లు సమాచారం.
ఇప్పటికే ఈ రిపోర్ట్ విజిలెన్స్ కమిషన్‌కు వెళ్లింది. అక్కడి నుంచి మళ్లీ ప్రభుత్వానికి కమిషన్ సిఫార్సు చేయనుంది. దీంతో తదుపరి చర్యలపై చర్చించినట్లు సమాచారం. కాళేశ్వరంపై సీబీఐ స్పందించకపోతే ఏం చేయాలనే దానిపైనా కూడా సమావేశంలో చర్చించినట్లు తెలిసింది.