- హాజరుకానున్న మీనాక్షి నటరాజన్, భట్టి, మహేశ్ గౌడ్
- రాష్ట్రంలో తాజా పరిణామాలపై చర్చించే అవకాశం
న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రంలో డిస్ట్రిక్ కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుల ఎంపికపై అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఈ నెలాఖరుకల్లా డీసీసీలను ప్రకటించాలని యోచిస్తున్నది. ఇప్పటికే ఏఐసీసీ పంపిన 22 మంది అబ్జర్వర్లు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి నేతల అభిప్రాయాలను సేకరించారు. అయితే, పార్టీ బలోపేతం దిశగా ఇప్పటికే పీసీసీ కమిటీలను వేసిన అధిష్టానం.. డీసీసీల ఎంపికలో మాత్రం దేశ వ్యాప్తంగా కొత్త విధానాన్ని అమలు చేస్తున్నది.
పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంతో పాటు చట్ట సభలకు వెళ్లే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల ఎంపికలోనూ డీసీసీ పాత్ర కీలకం చేయాలని నిర్ణయించింది. దీంతో డీసీసీల ఎంపికను పగడ్బందీగా చేపట్టాలని డిసైడైంది. మొత్తం 35 డీసీసీలకు, 4 కార్పొరేషన్లకు అధ్యక్షులను ఎంపిక చేయాల్సి ఉంది. పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ తెలంగాణలో డీసీసీల ఎంపికను హైకమాండ్ కీలకంగానే భావిస్తున్నది.
పార్టీ ఆదేశాలతో పాటు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతలను వీరికే అప్పగించనుంది. ఈ నేపథ్యంలో కేవలం పీసీసీ, రాష్ట్రంలోని ముఖ్య నేతలు పంపే పేర్లను ఫైనల్ చేయకుండా.. సీఎం, డిప్యూటీ సీఎం, పార్టీ ఇన్చార్జ్, పీసీసీ, కీలక మంత్రుల అభిప్రాయం తీసుకోవాలని యోచిస్తున్నది.
ఇందులో భాగంగా డీసీసీ ఎంపికపై రాష్ట్ర ముఖ్య నేతల అభిప్రాయ సేకరణ కోసం ఢిల్లీలోని పార్టీ హెడ్ ఆఫీస్ ఇందిరా భవన్లో శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కీలక భేటీ ఏర్పాటు చేసింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరిగే ఈ భేటీలో పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో పాటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్, ఇతర ముఖ్య నేతలు హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఈ భేటీలో డీసీసీ అధ్యక్షుల నియామకంపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తున్నది. ఇక తెలంగాణ డీసీసీ నియామకాలపై ఏఐసీసీ అబ్జర్వర్లు నివేదికను అధినాయకత్వానికి అందజేయనున్నట్లు సమాచారం. మరోవైపు డీసీసీ అధ్యక్ష పదవుల కోసం పెద్ద సంఖ్యలో ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు.
పార్టీ ముఖ్య నేతలతోనూ సీఎం భేటీ
ఇందిరా భవన్ లో జరిగే డీసీసీ నియామక మీటింగ్ లో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి శనివారం ఉదయం ఢిల్లీకి వెళ్తున్నారు. అలాగే పార్టీ ముఖ్య నేతలతోనూ భేటీ కానున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, మంత్రుల మధ్య విభేదాలు, పార్టీ అంతర్గత అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. వీటితోపాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, లోకల్ బాడీ ఎన్నికలు, హైకోర్టు స్టే, ఇతర అంశాలను వివరించనున్నారు.
కాగా.. ఈ భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి తిరిగి హైదరాబాద్ రానున్నట్లు సీఎంఓ వర్గాలు తెలిపాయి. మరోవైపు అధిష్టానం నిర్వహిస్తున్న ఈ భేటీలో పాల్గొనేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ శుక్రవారం రాత్రికే ఢిల్లీ చేరుకున్నారు. ఈ భేటీలో పాల్గొనేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం ఢిల్లీకి రానున్నారని తెలిసింది.
పలు వివాహ వేడుకలకు హాజరైన సీఎం
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన పలు వివాహ వేడుకలకు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. రాజేంద్రనగర్‌లోని శాంతా బయోటెక్ చైర్మన్ వరప్రసాద్ రెడ్డి మనుమరాలు శృతి వివాహానికి హాజరై శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం, హిమాయత్ సాగర్‌లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కేకే మహేందర్ రెడ్డి కుమారుడు విపుల్ రెడ్డి వివాహ వేడుకకు, ఆ తర్వాత హైటెక్స్‌లో ఎమ్మెల్సీ సీహెచ్.అంజిరెడ్డి కుమారుడు అనిశ్ రెడ్డి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
