ఉత్తర తెలంగాణ కోనసీమగా హుస్నాబాద్ : మంత్రి పొన్నం ప్రభాకర్

ఉత్తర తెలంగాణ కోనసీమగా హుస్నాబాద్ :  మంత్రి పొన్నం ప్రభాకర్
  •     డిసెంబర్ 3న సీఎం పర్యటన

హుస్నాబాద్, వెలుగు : ఉత్తర తెలంగాణ కోనసీమగా హుస్నాబాద్ ను అభివృద్ధి చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. డిసెంబర్ 3న హుస్నాబాద్​లో నిర్వహించే సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను పురస్కరించుకొని ఆదివారం అమరుల స్తూపం వద్ద కలెక్టర్ హైమావతితో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజాపాలన ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హుస్నాబాద్​లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించడానికి సీఎం రానున్నట్లు తెలిపారు. 

ఇంజనీరింగ్ కాలేజీ భవన నిర్మాణం - రూ.35 కోట్లు, అడ్వాన్స్​డ్​ టెక్నాలజీ సెంటర్ - రూ.45.15 కోట్లు, కొత్తపల్లి-సుందరగిరి ఫోర్​లైన్ రహదారి - రూ.77 కోట్లు, హుస్నాబాద్-అక్కన్నపేట ఫోర్​లైన్ రోడ్ - రూ.58.91 కోట్లు, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ - రూ.200 కోట్లు, అక్కన్నపేటలో బీటీఆర్ రోడ్ - రూ. 16.60 కోట్లు, మండల, మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో 6 బస్సులు- రూ.1.98 కోట్లు, ప్లాస్టిక్ వేర్ మేనేజ్​మెంట్ సదుపాయం -రూ.67 లక్షలు, మున్సిపాలిటీ అభివృద్ధి - రూ.20 కోట్లు, ఆర్టీఏ యూనిట్ ఆఫీస్ - రూ.8.60 కోట్లు, ఇందిరా మహిళా శక్తి బజార్ - రూ.6 కోట్లు, అర్బన్ ఫారెస్ట్ అభివృద్ధి -రూ.10 కోట్లు, హుస్నాబాద్- హైదరాబాద్ సూపర్ ఎక్స్​ప్రెస్ బస్సు - రూ.33 లక్షలతో సీఎం రేవంత్ శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. 

వంగరలో నవోదయ విద్యాలయం, ఎల్కతుర్తిలో ఐఐటీ బాసర క్యాంపస్ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. సీఎం పర్యటన నేపథ్యంలో హుస్నాబాద్ టౌన్, రూరల్, చిగురుమామిడి, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాల నాయకులతో మంత్రి సమావేశం నిర్వహించారు. సభ విజయవంతం చేసేందుకు ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి ప్రజలను భారీ సంఖ్యలో సమీకరించాలని సూచించారు. సమీక్షలో ఆర్డీవో రామ్మూర్తి, రాష్ట్ర హౌజ్​ఫెడ్​మాజీ చైర్మన్ శ్రీరామ్ చక్రవర్తి, జిల్లా లైబ్రరీ చైర్మన్ లింగమూర్తి, ఏఎంసీ చైర్మన్ తిరుపతిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ శివయ్య, చందు, రవి, పద్మ, సరోజన, రాజు, సది పాల్గొన్నారు.