- యాసంగిలో ఆరుతడి పంటలు వేయాలి
- రిజర్వాయర్లు ఖాళీ అవుతున్నయ్..
- చుక్క నీరు కూడా వేస్ట్ చేయొద్దు
- కేవలం 209 టీఎంసీలే అందుబాటులో ఉన్నయ్
- కరెంట్ కూడా పొదుపుగా వాడుకోవాలి
- వానాకాలంలో 10 లక్షల ఎకరాల్లో పంట నష్టం
- దసరా తర్వాత ఆల్‌పార్టీ మీటింగ్..
- సాయం కోసం కేంద్ర మంత్రులను కలుస్తాం
హైదరాబాద్, వెలుగు:ఎల్ నినో కారణంగా రాష్ట్రంలో కరువు ఏర్పడిందని, రిజర్వాయర్లు, భూగర్భజలాలు అడుగంటినందున రైతులు పెద్ద మనసు చేసుకుని ఈ యాసంగిలో వరి సాగును వాయిదా వేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తాగు, సాగునీరు, విద్యుత్ పొదుపుగా వాడుకోవాలని సూచించారు. సచివాలయంలో గురువారం అందుబాటులో ఉన్న మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్రంలో కరువు పరిస్థితులపై సీఎం సమీక్ష నిర్వహించారు.
అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయని, ప్రస్తుతం అన్ని రిజర్వాయర్లలో కలిపి కేవలం 209 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉందని సీఎం తెలిపారు. గతేడాది ఇదే సమయానికి ప్రాజెక్టుల్లో 462 టీఎంసీల మేర నీరు ఉండగా, ఈసారి 23 శాతం లోటు వర్షపాతం వల్ల కృష్ణా బేసిన్లో ఏకంగా 72 శాతం, గోదావరి బేసిన్లో 40 శాతం మేర నిల్వలు తగ్గాయని వివరించారు. ప్రస్తుతం చేతికొచ్చిన వరి పంటలను కాపాడేందుకు అధికారులు యుద్ధప్రాతిపదికన చివరి తడి వరకు నీరందిస్తున్నారని, ఒక్క ఎకరం కూడా ఎండనివ్వబోమని హామీ ఇచ్చారు.
కానీ రాబోయే 8 నుంచి 10 నెలల పాటు (వచ్చే జులై వరకు) తాగునీటి అవసరాలు అత్యంత కీలకమని సీఎం రేవంత్ తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, 24 వేల పల్లెలు, గూడేలు, తండాలకు నీటి కొరత రానీయకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు.
కూలీల కోసం ఉపాధి పనులు పెంచినం
ఈసారి సాగు తగ్గే అవకాశం ఉండడంతో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలు, పేదలు పనుల్లేక పస్తులుండకుండా, వలసలు పోకుండా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పర్యవేక్షణలో ఉపాధి హామీ పనులను భారీగా పెంచామని సీఎం చెప్పారు. గతేడాది ఇదే సమయానికి రోజుకు 25 వేల మంది కూలీలు హాజరుకాగా, ప్రస్తుతం ఆ సంఖ్య ఏకంగా 2.5 లక్షలకు చేరిందని వివరించారు. ఈ కూలీలతో గ్రామాల్లోని డిస్ట్రిబ్యూటరీలు, చెరువులు, కుంటల్లో పేరుకుపోయిన పూడిక, కాల్వలకు అడ్డుగా ఉన్న చెట్లను తొలగించాలని ఆదేశించామన్నారు. మూగజీవాలను కాపాడుకునేందుకు పశుగ్రాసం, తాగునీటి తొట్లను ఏర్పాటు చేయాలని.. ఎండదెబ్బ తగలకుండా వైద్యారోగ్య శాఖను అప్రమత్తం చేశామన్నారు. కళాజాతా బృందాల ద్వారా రచ్చబండ కార్యక్రమాలు చేపట్టి నీటి పొదుపుపై చైతన్యం తెస్తామని, సినిమా ప్రముఖులు నిన్న విజయ్ దేవరకొండ చేసిన విజ్ఞప్తి తరహాలో మేధావులు, అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు కూడా ఈ విపత్తు నివారణ ప్రచారంలో భాగస్వాములు కావాలని సీఎం పిలుపునిచ్చారు.
నీటిని వృథా చేయొద్దు
హైదరాబాద్ సిటీ దాహార్తి తీర్చే నాగార్జునసాగర్, సింగూరు, శ్రీపాద ఎల్లంపల్లి, గండిపేట , హిమాయత్ సాగర్ జలాశయాల్లో నిల్వలు అడుగంటుతున్నందున ప్రజలంతా పొదుపు చర్యలు పాటించాలని, చుక్క నీటిని కూడా దుబారా చేయవద్దని సీఎం విజ్ఞప్తి చేశారు. బండ్లు, కార్లు కడగడానికి, లాన్లకు, చెట్లకు నీళ్లు పట్టడానికి తాగునీటిని వాడడం పూర్తిగా మానుకోవాలన్నారు. ఈ సంక్షోభాన్ని పర్యవేక్షించేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చైర్మన్‌గా కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశామని.. సచివాలయంలో 24 గంటలూ పనిచేసే ప్రత్యేక వార్ రూమ్, టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చామని ప్రకటించారు.
ప్రభుత్వ సలహాదారు, స్పెషల్ సీఎస్ కే.రామకృష్ణారావును ప్రత్యేక నోడల్ ఆఫీసర్‌గా నియమిస్తున్నామని, మీడియాకు ఎలాంటి సమాచారం కావాలన్నా ఆయన ద్వారానే ధ్రువీకరించుకోవాలని, తప్పుడు ప్రచారాలు చేయవద్దని సూచించారు. దసరా పండుగ ముగిసిన వెంటనే బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం తదితర పార్టీలతో పాటు ప్రజా, కార్మిక సంఘాలతో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని.. అనంతరం నవంబర్ మొదటి వారంలో అఖిలపక్ష బృందంతో ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను కలిసి ఎన్డీఆర్ఎఫ్ విపత్తు నిధులు 60:40 నిష్పత్తి, ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి ఉన్న రాష్ట్రాల నుంచి సెంట్రల్ పూల్ కు తీసుకుని నుంచి రాయితీపై విద్యుత్ కోరతామని తెలిపారు.
విద్యుత్ డిమాండ్ 20వేల మెగావాట్లకు..
వర్షాభావం వల్ల భూగర్భ జలాలు అడుగంటి, మరో 15-–20 రోజుల్లో చేతికొచ్చే పంటలను కాపాడుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల వ్యవసాయ పంపుసెట్లు ఒకేసారి ఆన్ కావడంతో విద్యుత్ వినియోగం చరిత్రలోనే రికార్డు స్థాయికి చేరిందని సీఎం వివరించారు. అక్టోబర్ మాసంలో గతంలో ఎన్నడూ 15 వేల మెగావాట్లకు మించని డిమాండ్, ఈసారి ఏకంగా 20,003 మెగావాట్లకు చేరి ఆల్‌టైమ్ రికార్డు సృష్టించినా.. విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క, అధికారులు, సిబ్బంది ఎక్కడా ఒక్క నిమిషం కూడా కోత లేకుండా నిరంతరాయంగా సరఫరా చేశారని కొనియాడారు.
రాష్ట్రం ఏర్పడిన 2014–15 నాటికి విద్యుత్ వినియోగం కేవలం 6,500 నుంచి 7,000 మెగావాట్లు మాత్రమే ఉండగా, గత మూడేళ్లలో 14 వేల మెగావాట్లకు చేరితే.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన స్వల్ప కాలంలోనే మరో 6,000 నుంచి 7,000 మెగావాట్ల డిమాండ్ అదనంగా పెరిగిందన్నారు. పొరుగున ఉన్న ఏపీలో యూనిట్ విద్యుత్‌కు రూ.14 నుంచి రూ.15 పెట్టి కొంటామన్నా దొరకక ఇబ్బందులు పడుతుంటే, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ సైతం విద్యుత్ సంక్షోభంలో ఉన్నాయని గుర్తుచేశారు. ప్రభుత్వం వర్షాకాలం ఆరంభంలోనే హెచ్చరించడంతో రైతులు 13 లక్షల ఎకరాల్లో ఆరుతడి పంటలు వేశారని, అయినప్పటికీ రాష్ట్రంలో ప్రధానంగా 56 లక్షల ఎకరాల్లో అధిక నీరు అవసరమయ్యే వరి సాగు చేయడంతోనే విద్యుత్, సాగునీటి డిమాండ్ అనూహ్యంగా పెరిగిందని పేర్కొన్నారు.
కరువునూ రాజకీయం చేస్తరా?
ప్రకృతి తెచ్చిన పెను విపత్తును రాజకీయం చేస్తూ బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ తెచ్చిన కరువుగా చిత్రీకరించడం వాళ్ల పైశాచిక ఆనందానికి పరాకాష్ట అని మండిపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ మార్పులు, ‘సూపర్ ఎల్‌నినో’ ప్రభావం వల్ల ముంచుకొచ్చిన ప్రకృతి విపత్తు రాష్ట్రాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టిందని, ఇలాంటి పరిస్థితుల్లో రైతాంగాన్ని, పేద ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకునేందుకు ప్రభుత్వం సర్వసన్నద్ధమైందని సీఎం వివరించారు.
1950 తర్వాత గడిచిన 75 ఏళ్లలో ఎల్‌నినో వల్ల గతంలోనూ కరవులు వచ్చినా, ఈసారి వచ్చిన ‘సూపర్ ఎల్‌నినో’ ప్రపంచంలోని 100 దేశాలను వణికిస్తోందని ఐక్యరాజ్య సమితి హెచ్చరించిందన్నారు. 2019-–20లో వచ్చిన కరోనా మహమ్మారి మాదిరిగానే ఈ పర్యావరణ విపత్తు కూడా మానవాళితో పాటు పశుసంపద, మూగజీవాలు, చెట్లు, కొమ్మలు, పక్షులు, జలచరాల వరకు సమస్త జీవరాశి మనుగడపై విరుచుకుపడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సాధారణంగా మార్చి, ఏప్రిల్ ఎండాకాలంలో ఉండాల్సిన 38 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు అక్టోబర్‌లోనే నమోదవుతున్నాయని.. ఇది ప్రకృతి విపత్తే తప్ప పాలకుల వైఫల్యం కాదని, రాజకీయాలకు అతీతంగా అందరూ ఐక్యంగా నిలబడాలని సీఎం రేవంత్పిలుపునిచ్చారు.
