తెలంగాణలో ఐదు రోజుల పాటు వర్షాలు.. హైదరాబాద్ సహా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

తెలంగాణలో ఐదు రోజుల పాటు వర్షాలు.. హైదరాబాద్ సహా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
  •     తమిళనాడు వద్ద ఉపరితల ఆవర్తనం.. ఒడిశా తీరందాకా ద్రోణి
  •     రాష్ట్రంలో 5 రోజులపాటు ఉరుములు, మెరుపులతో 
  • మోస్తరు వర్షాలకు చాన్స్​    హైదరాబాద్‌‌‌‌ సహా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ 
  •     ఎల్లుండి 3 జిల్లాల్లో భారీ వానలు


హైదరాబాద్, వెలుగు: దేశం నుంచి నైరుతి రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమించాయి. ఇదే సమయంలో ఈశాన్య రుతుపవనాలు దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించాయి. వీటి ప్రభావంతోపాటు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ద్రోణి కారణంగా రాష్ట్రంలో 4 నుంచి 5 రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

పలు జిల్లాలకు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు దేశం మొత్తం నుంచి వెళ్లిపోయాయని స్పష్టం చేసింది. ఈ సమయంలో తమిళనాడు, పుదుచ్చేరి, తీర ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, దక్షిణ కర్ణాటక, కేరళ ప్రాంతాల్లో ఈశాన్య రుతుపవనాల వర్షాలు మొదలయ్యాయి.

ప్రస్తుతం వాతావరణ దిగువ పొరల్లో దక్షిణ తీర తమిళనాడు, దాని పరిసర ప్రాంతాలపై ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి దాదాపు 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఈ ఉపరితల ఆవర్తనం నుంచి నైరుతి, పశ్చిమ- మధ్య బంగాళాఖాతం మీదుగా ఒడిశా తీరం వరకు ఒక ఉపరితల ద్రోణి ఏర్పడింది. వీటి ప్రభావంతో బంగాళాఖాతం నుంచి బలమైన తూర్పు, ఈశాన్య గాలులు వీస్తుండటంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.

నేడు ఈ జిల్లాల్లో వర్షాలు..

ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో శుక్రవారం ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, మహబూబ్‌‌‌‌‌‌నగర్, నాగర్‌‌‌‌కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం వర్ష ప్రభావం మరింత పెరుగుతుందని, ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌‌‌‌గిరి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, జనగామ తదితర జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

కాగా, ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు మరింత ఊపందుకోనున్నాయి. ముఖ్యంగా వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే చాన్స్​ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. మిగిలిన ఉత్తర, దక్షిణ తెలంగాణలోని జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్ తదితర జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. ఉరుములు, పిడుగుపాటు ముప్పు ఉన్నందున రైతులు, వ్యవసాయ కూలీలు చెట్ల కింద ఉండవద్దని సూచించింది. కాగా, హైదరాబాద్‌‌‌‌లో ఉదయం పొగమంచు.. సాయంత్రం జల్లులు కురుస్తాయని వెల్లడించింది.