- లార్జ్ క్యాప్ షేర్లలో కొనుగోళ్లు పెరగడమే కారణం
- రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీ, బ్యాంక్ షేర్లు జూమ్
- 2.3 శాతం పడిన క్రూడాయిల్..
- 12 పైసలు లాభపడ్డ రూపాయి
ముంబై: బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు సెన్సెక్స్, నిఫ్టీ గురువారం భారీగా పెరిగాయి. రిలయన్స్, ఐటీ, బ్యాంకింగ్, షేర్లు ర్యాలీ చేయడంతో దూసుకుపోయాయి. సెన్సెక్స్ 1,534 పాయింట్లు ఎగబాకి 74,316 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 375 పాయింట్లు (1.66 శాతం) లాభపడి 22,997 వద్ద ముగిసింది. టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్, హెచ్‌సీఎల్ టెక్, ఎయిర్టెల్ షేర్లు 5 శాతం వరకు లాభపడ్డాయి. ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ.4.50 లక్షల కోట్లు పెరిగింది. అయితే స్మాల్‌క్యాప్ సూచీలు 1.65 శాతం పడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) రూ.5,300 కోట్ల విలువైన షేర్లను అమ్మారు.
పెరగడానికి ప్రధాన కారణాలు
గ్లోబల్ మార్కెట్లు పడినా..
గ్లోబల్ మార్కెట్లు గురువారం భారీగా నష్టపోయాయి. అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు ఆందోళనలతో ఆసియా మార్కెట్లలో ఏఐ షేర్లు పతనమయ్యాయి. సౌత్ కొరియా కొస్పీ 8 శాతం, జపాన్ నికాయ్ 5 శాతం, చైనా షాంఘై 1.60 శాతం పడ్డాయి. అయినప్పటికీ ఐటీ కంపెనీల సెప్టెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ బాగుండడంతో హెచ్‌సీఎల్, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి టెక్ కంపెనీల షేర్లు గురువారం దూసుకుపోయాయి. నిఫ్టీ, సెన్సెక్స్ పెరగడానికి సాయపడ్డాయి. వీటికితోడు జియో ఐపీఓ వల్ల రిలయన్స్, ఎయిర్టెల్ షేర్లు పెరిగాయి.
అమెరికా చర్యలతో ఆయిల్ ధరలు డౌన్
అమెరికా చర్యలతో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 2.3శాతం తగ్గి 103.50 డాలర్ల వద్ద, డబ్ల్యూటీఐ క్రూడ్ 94.07 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. కాగా, పశ్చిమాసియా సంక్షోభం, హార్మూజ్ జలసంధి పరిసరాల్లో నౌకలపై దాడుల కారణంగా సముద్ర రవాణా ఖర్చులు రికార్డు స్థాయికి పెరిగాయి. దీనిని పరిష్కరించడానికి అమెరికా ప్రభుత్వం కీలక ప్రతిపాదన చేసింది.
గతంలో ఆంక్షల జాబితాలో ఉంచిన షాడో ఫ్లీట్ నౌకలు చట్టబద్ధంగా చమురును రవాణా చేయడానికి అనుమతించాలని చూస్తోంది. దీంతో గ్లోబల్ మార్కెట్లో చమురును మోసుకెళ్లే నౌకల కొరత తీరి, సముద్ర రవాణా, బీమా చార్జీలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఆయిల్ ధరలు తగ్గితే భారత్‌కు మేలు.
రూపాయి బలోపేతం
అంతర్జాతీయంగా డాలర్ బలహీనపడటం, క్రూడ్ ధరలు తగ్గడం, ఆర్బీఐ జోక్యంతో రూపాయి వరుసగా నాలుగో రోజూ పుంజుకుంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి గురువారం 12 పైసలు బలపడి 95.05 వద్ద ముగిసింది. ఈ వారంలోనే దాదాపు 2 శాతం కోలుకోవడం ఇన్వెస్టర్లకు కలిసొచ్చింది. మరోవైపు ఇండియా– అమెరికా మధ్య ట్రేడ్ డీల్ మొదటి దశ త్వరలో పూర్తవుతుందని కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ ప్రకటించారు. మార్కెట్ పెరగడానికి ఇది కూడా ఒక కారణం. మరోవైపు పెద్ద ట్రేడర్లు తమ షార్ట్ పొజిషన్ల నుంచి ఎగ్జిట్ అవ్వడంతో సెన్సెక్స్ పెరిగిందని అంచనా.
పెద్ద షేర్లు జిగేల్.. చిన్న షేర్లు డమాల్
స్టాక్ మార్కెట్లో గురువారం పెద్ద షేర్ల హవా కనిపించినా, చిన్న షేర్లు మాత్రం భారీగా పతనమయ్యాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 250 ఇండెక్స్ ఏకంగా 1.65 శాతం, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 500 ఇండెక్స్ 1.28 శాతం నష్టపోయాయి. ఇదే టైమ్‌లో నిఫ్టీ 375 పాయింట్లు పెరగగా ఇందులో సగానికి పైగా లాభం కేవలం మూడు ప్రధాన షేర్ల వల్లే వచ్చింది.
ఇండెక్స్ హెవీ వెయిట్ షేర్లు అయిన ఐసీఐసీఐ బ్యాంక్ (+3.8శాతం), రిలయన్స్ (+3.4శాతం), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (+2.3శాతం) ర్యాలీ చేయడంతో నిఫ్టీ దాదాపు 193 పాయింట్లు దూసుకెళ్లింది. అమెరికా ద్రవ్యోల్బణం పెరగడం, వడ్డీ రేట్ల అనిశ్చితి, గ్లోబల్ టెక్ మార్కెట్లలో అమ్మకాలు జరుగుతుండడంతో పెద్ద ఇన్వెస్టర్లు రిస్క్ తగ్గించుకునే పనిలో పడ్డారు.
చిన్న కంపెనీల కంటే, స్థిరమైన బ్యాలెన్స్ షీట్ ఉండే బ్లూచిప్ కంపెనీలకే ప్రాధాన్యం ఇచ్చారు. మరోవైపు వాల్యుయేషన్ ఎక్కువగా ఉండడంతో చిన్న షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ కూడా జరుగుతోందని ట్రేడర్లు వివరించారు.
