పొగ, దుర్వాసనతో ఉక్కిరిబిక్కిరి!వరంగల్, మంచిర్యాల, కరీంనగర్ డంపింగ్ యార్డులతో కాలనీవాసుల తిప్పలు

పొగ, దుర్వాసనతో ఉక్కిరిబిక్కిరి!వరంగల్, మంచిర్యాల, కరీంనగర్ డంపింగ్ యార్డులతో కాలనీవాసుల తిప్పలు

 

  •     ఇండ్లలో ఎయిర్ ప్యూరిఫయర్లు, ఆక్సిజన్ మాస్క్​లు, పిల్లలకు నెబ్యులైజర్లు వాడకం
  •     శ్వాసకోశ వ్యాధులతో ఆస్పత్రుల పాలవుతున్న జనం
  •     కరీంనగర్​లో మానేరు ఒడ్డున గుట్టలుగా పేరుకుపోయిన చెత్త
  •     యార్డులను నగరాలు, పట్టణాల నుంచి దూరంగా తరలించాలని ఏండ్లుగా ఆందోళనలు

 

కరీంనగర్/మంచిర్యాల/వరంగల్, వెలుగు:  వరంగల్, కరీంనగర్ నగరాలతో పాటు మంచిర్యాల పట్టణంలో డంపింగ్ యార్డుల కారణంగా సమీప కాలనీల ప్రజలకు ఊపిరాడడం లేదు. పేరుకుపోయిన చెత్తకుప్పల నుంచి  వస్తున్న దట్టమైన పొగ, దుర్వాసనతో స్థానికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కలుషిత గాలి నుంచి  ఉపశమనం, చిన్న పిల్లల రక్షణ కోసం కొందరు స్థానికులు ఆక్సిజన్ సిలిండర్లు, ఎయిర్ ప్యూరిఫయర్లు వినియోగిస్తున్నారు. ఏళ్ల తరబడి పేరుకుపోయిన చెత్తను 
తొలగించేందుకు బయో మైనింగ్ పేరిట రూ.కోట్లు ఖర్చు చేసినా.. ఒక్క ఖమ్మంలో మినహా ఎక్కడా సక్సెస్ కాలేదు. 

బయోమైనింగ్, సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ లో స్మార్ట్ సిటీలుగా గుర్తింపు పొందిన కరీంనగర్, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లు ఫెయిలయ్యాయి. మంచిర్యాలలోనూ అదే పరిస్థితి నెలకొంది. దీంతో డంపింగ్ యార్డులను తమ ప్రాంతం నుంచి త్వరగా తరలించాలని స్థానికులు తరచూ రోడ్డెక్కుతున్నారు. 

ప్రహసనంగా మారిన బయోమైనింగ్

కరీంనగర్ మానేరు ఒడ్డున డంపింగ్ యార్డు గుట్టలను తలపిస్తోంది. ఈ చెత్తను తొలగించేందుకు నాలుగేళ్ల క్రితం చేపట్టిన బయోమైనింగ్ ఇంకా సగం కూడా పూర్తి కాలేదు. గతంలో స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద రూ.16 కోట్లు కేటాయించి రూ.7 కోట్ల వరకు ఖర్చు చేయగా నిరుడు, ఈ ఏడాది స్వచ్ఛ భారత్ మిషన్ కింద మరో రూ.2 కోట్లు ఖర్చు చేశారు. మొత్తంగా బల్డియా రూ.9 కోట్లు ఖర్చు చేసినా చెత్త మాత్రం గుట్టలుగా పేరుకుపోయింది.

కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నిరుడు జనవరిలో కరీంనగర్ కు వచ్చిన సందర్భంలో డంపింగ్ యార్డును పూర్తిగా ఖాళీ చేసే బాధ్యత తమదని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే స్వచ్ఛ భారత్ మిషన్ కింద బయో మైనింగ్ కోసం మరో రూ.16 కోట్లు కేటాయించి ఇటీవల టెండర్లు పిలిచారు. మరోవైపు రాత్రిపూట చెత్తకు నిప్పంటుకుని పొగ అల్కాపురి కాలనీ, కోతిరాంపూర్ తో పాటు కమాన్ వరకు విస్తరిస్తోంది. తాజాగా 3 రోజుల క్రితం బైపాస్ రోడ్డులో మహిళలు, చిన్నారులు మాస్కులు పెట్టుకుని బతుకమ్మ ఆడి రాస్తారోకో చేశారు. ఈ ఆందోళనలు క్రమంగా పొలిటికల్ టర్న్ తీసుకుంటున్నాయి.

స్థానికులకు చెత్త కంపు

గ్రేటర్ వరంగల్‌‌లోని 66 డివిజన్లకు సంబంధించిన రోజువారీ చెత్తను 2007 నుంచి మడికొండ-రాంపూర్ డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. 32 ఎకరాల్లో డంప్ యార్డు ఉంది. రోజూ సుమారు 2.5 లక్షల నివాసాల నుంచి దాదాపు 450 టన్నుల చెత్త ఇక్కడకు చేరుతుండటంతో గుట్టలుగా పేరుకుపోయింది. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా 3 లక్షల టన్నుల చెత్తను శుద్ధి చేసేందుకు రూ.37 కోట్లతో బయోమైనింగ్ చేపట్టారు. ఈ పనులు నడుస్తుండగానే మరో 4 లక్షల టన్నుల చెత్త పోగయింది. 

ఎన్జీటీ ఆదేశాలు బేఖాతర్

మంచిర్యాల అండాలమ్మ కాలనీలోని రెండెకరాల విస్తీర్ణంలో 2000లో తాత్కాలిక డంపింగ్ యార్డు ఏర్పాటు చేశారు. మంచిర్యాలలో రోజుకు దాదాపు 50 టన్నుల చెత్త పోగవుతుంది. దానిని డంపింగ్ యార్డులో గుట్టలుగా పోస్తున్నారు. ఇలా పేరుకుపోతున్న చెత్త కుప్పలను కాల్చివేస్తుండంతో వ్యర్థాల నుంచి విషవాయువులు వెలువడుతున్నాయి. పగలు, రాత్రి పొగలు అండాలమ్మ కాలనీతో పాటు గ్రీన్ సిటీ, పవర్ సిటీ, రంగంపేట, లక్ష్మీనగర్, వికాస్​నగర్, పాత మంచిర్యాల ప్రాంతాలను కమ్మేస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

ఈ విషవాయువుల ప్రభావంతో పిల్లలు, వృద్దులు శ్వాసకోశ వ్యాధులకు బారిన  పడుతున్నారు. డాక్టర్ల సూచనతో నెబ్యులైజర్లు వాడుతున్నారు. అండాలమ్మ కాలనీ నుంచి డంపింగ్ యార్డును తరలించాలని కాలనీవాసులు ఏండ్లుగా ఆందోళనలు చేస్తున్నారు. 2023 సెప్టెంబర్​లో సామాజిక కార్యకర్త నయీమ్ పాషా ఈ సమస్యపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యున (ఎన్జీటీ)లో ఫిర్యాదు చేశాడు. దీంతో 2024 మార్చి 31న స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ హనుమంతరెడ్డి, బోర్డ్ ఆఫీసర్ లక్ష్మీప్రసాద్ డంపింగ్ యార్డును సందర్శించి , డంపింగ్ యార్డును అక్కడి నుంచి షిఫ్ట్ చేయాలని ఆదేశించారు. 3 నెలల్లో డంపింగ్ యార్డును శ్రీరాంపూర్ కు తరలిస్తామని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికి రెండున్నర సంవత్సరాలు కావస్తున్నా ఎలాంటి పురోగతి లేదు. హైదరాబాద్ కు చెందిన సాగర్ మోటార్స్ కు 2022 జూలైలో మంచిర్యాల, నస్పూర్ మున్సిపాలిటీల్లో బయోమైనింగ్ కాంట్రాక్ట్ అప్పగించారు. ఒక టన్ను బయోమైనింగ్ చేసినందుకు ఆ సంస్థకు రూ.550 చొప్పున చెల్లిస్తున్నారు. ఇప్పటివరకు మంచిర్యాలలో 62 వేల మెట్రిక్ టన్నులకు 66,392 మెట్రిక్ టన్నులు, నస్పూర్ లో 49 వేల మెట్రిక్ టన్నులకు 11 వేల మెట్రిక్ టన్నులు బయోమైనింగ్ పూర్తయింది. ఇందుకోసం సాగర్ మోటార్స్ కు ఇప్పటికే కోట్లాది రూపాయలు చెల్లించారు.

పొగ నుంచి రక్షణకు ఆక్సిజన్ మాస్క్

కరీంనగర్ డంపింగ్ యార్డుకు సమీపంలోని ఆల్కాపురి కాలనీలోని మాతృభూమి అపార్ట్ మెంట్ లో ఓ ఫ్లాట్ లో ఓ విద్యార్థిని ఆక్సిజన్ మాస్క్ ధరించి చదువుకుంటోంది. 'ఇలా ఉంటే మా ఆరోగ్యం ఏమైపోవాలి.. మా భవిష్యత్ ఏమైపోవాలి' అంటూ ఇటీవల ఆ చిన్నారి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ చిన్నారితోపాటు ఇటీవల కరీంనగర్ కు చెందిన ఆర్మీ జవాన్, సామాజిక కార్యకర్త కోట శ్యాం కుమార్ డంపింగ్ యార్డుపై చేసిన వీడియోలు కరీంనగర్ లో చర్చనీయాంశంగా మారాయి. 

నా భర్తకు గుండె ఆపరేషన్ అయ్యింది

మేము 12 ఏండ్లుగా అండాలమ్మ కాలనీలో ఉంటున్నాం. నా భర్త శ్రీనివాస్‌‌కు 3 నెలల కిందట సుస్తీ చేస్తే హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తీస్కపోయినం. డాక్టర్లు టెస్టులు చేసి పొగ పీల్చడం వల్ల గుండె దెబ్బతిందని చెప్పిన్రు. ఓపెన్ హార్ట్ సర్జరీ చేసిన్రు. ఆయన ఇంకా కోలుకోలే. ఇల్లు గడవడం కోసం నేను టైలరింగ్ పనికి పోతున్న. డంపింగ్ యార్డు పొగ, వాసనతో అందరికి రోగాలొస్తున్నయ్.
– భీమిని, జ్యోతి, అండాలమ్మ కాలనీ, మంచిర్యాల