- వేగంగా క్షీణిస్తున్న పక్షుల జాబితాలో చోటు
- వాతావరణ మార్పులు, పెస్టిసైడ్స్ ఎఫెక్ట్ వల్లే
- కీటకాలను తింటూ పంటలను కాపాడే రైతునేస్తం
- ఒడిశా, కర్నాటకలోనూ రాష్ట్ర పక్షిగా గుర్తింపు
- దసరా రోజున పాలపిట్టను చూడడం సెంటిమెంట్
మంచిర్యాల, వెలుగు: మన రాష్ట్ర పక్షి పాలపిట్ట రోజురోజుకు కనుమరుగవుతున్నది. వాటి సంఖ్య ప్రమాదకరంగా క్షీణిస్తున్నట్టు పక్షులపై ఇటీవల జరిగిన ఒక స్టడీలో వెల్లడైంది. దీంతో అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సంఘం పాలపిట్టను ‘మనుగడ ప్రమాదంలో పడిన పక్షి జాతుల’ విభాగంలో చేర్చింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో పాలపిట్టలు అంతరించిపోవడం ఖాయమని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం పాలపిట్టకు రాష్ట్ర పక్షి హోదా కల్పించగా.. ఒడిశా, కర్నాటక కూడా రాష్ట్ర పక్షిగా గుర్తించాయి.
పెస్టిసైడ్స్తో ముప్పు..
క్రిమికీటకాలు, చిన్న సరీసృపాలు, ఉభయచరాలను పాలపిట్టలు ఆహారంగా తీసుకుంటాయి. తద్వారా వ్యవసాయ రంగంలో చీడపీడల నుంచి పంటలను కాపాడుతూ రైతులకు ఎంతో మేలు చేస్తున్నాయి. వ్యవసాయానికి హాని చేసే ఎన్నో కీటకాలను తినే పాలపిట్టలను రైతునేస్తంగా అభివర్ణిస్తారు. అయితే సహజ ఆవరణ వ్యవస్థలు నాశనం కావడంతో పాలపిట్టల మనుగడకు ముప్పు వాటిల్లింది. మంచిర్యాల జిల్లా జన్నారం ఎఫ్డీవో రామ్మోహన్ కథనం ప్రకారం.. వాతావరణంలో వచ్చిన మార్పులతో పాటు వ్యవసాయరంగంలో అడ్డూఅదుపు లేకుండా పెస్టిసైడ్స్ వాడడంతో పాలపిట్టల ఉనికి ప్రమాదంలో పడ్డది.
పాలపిట్ట ప్రధాన ఆహారమైన కీటకాలు, పురుగులు తగ్గిపోయి వాటి పాపులేషన్ వేగంగా క్షీణిస్తోంది. గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ, పాక్షిక పట్టణ ప్రాంతాల్లో పాలపిట్టల సంఖ్య బాగా తగ్గిందని నిపుణులు చెబుతున్నారు. ఒకప్పుడు ఎక్కడపడితే అక్కడ కనిపించే పాలపిట్టలు నేడు అరుదుగా కనిపిస్తున్నాయి.
పురాణాల్లో పాలపిట్టకు ప్రాధాన్యత...
తెలంగాణలో దసరా పండుగ రోజున పాలపిట్ట దర్శనం చేసుకోవడం అది అనాదిగా వస్తున్న సెంటిమెంట్. పలు రాష్ట్రాల్లోనూ అత్యంత విశేషంగా, శుభసూచకంగా భావించే పాలపిట్టకు పురాణాల్లోనూ ఎంతో ప్రాధాన్యత ఉన్నది. త్రేతాయుగంలో రావణాసురుడితో యుద్ధానికి వెళ్లే సమయంలో శ్రీరాముడికి పాలపిట్ట కనిపించిందని, ఆ యుద్ధంలో ఆయన విజయం సాధించాడని పురాణాల కథనం. అలాగే ద్వాపరయుగంలో పాండవుల అజ్ఞాతవాసం ముగిసిన తర్వాత జమ్మిచెట్టుపై ఉన్న తమ ఆయుధాలను తీసుకొని వెళ్తున్నప్పుడు వారికి పాలపిట్ట ఎదురైందని, ఆ తర్వాత కౌరవులపై విజయం సాధించారని విశ్వసిస్తారు.
పాలపిట్టను కాపాడుకుందాం
దసరా సెంటిమెంట్ను ఆసరాగా చేసుకొని కొంతమంది పాలపిట్టలను పట్టుకొని ప్రదర్శిస్తుంటారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం పాలపిట్టలను పట్టుకోవడం, బంధించడం, ప్రదర్శించడం నేరం. దీనికి గరిష్ఠంగా మూడు సంవత్సరాల వరకు జైలుశిక్ష లేదా రూ.లక్ష జరిమానా విధించవచ్చు. గడ్డి మైదానాలు, పెస్టిసైడ్స్ వాడకాన్ని తగ్గించి పాలపిట్టలను కాపాడుకుందాం
- రామ్మోహన్, డీఎఫ్వో, జన్నారం
