ప్రజా తెలంగాణ కోసం పోరుబాట... పార్టీలు వేరైనా.. అందరి లక్ష్యం ఒక్కటే.. 

ప్రజా తెలంగాణ కోసం పోరుబాట... పార్టీలు వేరైనా.. అందరి లక్ష్యం ఒక్కటే.. 

సబ్బండ వర్ణాల సద్దిమూట తెలంగాణ.. ముక్కోటి గొంతుకల ఆకాంక్ష స్వరాష్ట్రం. సొంత రాష్ట్రం ఏర్పడితే మన బతుకులు బాగుపడుతాయనుకొని ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగిసిన వాళ్లు కనుమరుగయ్యారు. లాఠీలు, తూటాలకు వెరవక ముందుండి పోరాడిన వారు అడ్రస్ లేకుండా పోయారు. భావితరాల బాగుకోసమని ఆత్మార్పణ చేసుకున్న వారి కుటుంబాలకు కన్నీటి వ్యథే మిగిలింది. నీళ్లు, నిధులు, నియామకాల ట్యాగ్ లైన్​తో వచ్చిన ఉద్యమం తెలంగాణను తెచ్చింది. కానీ పోరులో ముందుండి నిలిచిన వారు కొవ్వొత్తిలా కరిగిపోయారు. కొందరికే పదవులు వచ్చాయి.. ఆస్తులు, అంతస్తులు వచ్చాయి. లక్షల కోట్లకు ఎదిగారు..! బతుకులు ఆగమైన వారిని చూసి తెలంగాణ తల్లి తల్లడిల్లుతోంది. ‘నయా’ వంచనను అనుదినం గుర్తుకు చేసుకుంటున్నది.

ప్రజా తెలంగాణ కోసం పోరుబాట

కరీంనగర్ జిల్లాకు చెందిన ఆకుల భూమయ్య 1969తోపాటు మలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ పాల్గొన్నారు. తెలంగాణ ప్రజాఫ్రంట్ ఏర్పాటు చేసి ఉద్యమ శక్తులను ఏకం చేసిన ఆయన స్వరాష్ట్ర ఆకాంక్ష నెరవేరకముందే కన్నుమూశారు.  వీరితోపాటు ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు, ప్రొఫెసర్ సింహాద్రి, ప్రొఫెసర్ ఇనుకొండ తిరుమలి, ప్రొఫెసర్ వెంకటనారాయణ, విమలక్క, రత్నమాల, పీవోడబ్ల్యూ సంధ్య, గొర్రెపాటి మాధవరావు, గోవర్ధన్‌లాంటి మేధావులు, కళాకారులు సామాజిక, ప్రజా ఉద్యమాలను నడిపించారు. 

డీఎస్పీ నళిని, ఇటిక్యాల పురుషోత్తం, వెలిచాల జగపతి రావు, దేశిని చిన్నమల్లయ్య, కటకం మృత్యుంజయం, కొరివి వేణుగోపాల్,వెంకట మల్లయ్య, మెదక్ జిల్లాకు చెందిన బాణాపురం మధుసూదన్‌రెడ్డి, సిద్దిపేటకు చెందిన నిమ్మ నర్సింహారెడ్డి, ఉపాధ్యాయుల ఉద్యమానికి నాయకత్వం వహించిన శిమ్ముల భూపతిరెడ్డి ఇలా చాలా మంది స్వరాష్ట్ర ఉద్యమంలో క్రియాశీలక భూమిక పోషించారు. 

పార్టీలు వేరయినా.. ఆకాంక్ష ఒక్కటే

పలు రాజకీయ పార్టీల్లో ఉండి ఉద్యమంలో కీలకంగా పనిచేసిన నేతలు చాలామంది ఉన్నారు. వారిలో నాటి టీఆర్ఎస్ నేతలు ఈటల రాజేందర్ మంత్రి అయ్యారు. ప్రొఫెసర్ సీతారామ్‌నాయక్ ఎంపీ అయ్యారు. దాసోజు శ్రవణ్  ఎమ్మెల్సీ అయ్యారు. ఉద్యోగ సంఘాల నేతలు స్వామిగౌడ్ ఎమ్మెల్సీ, శాసన మండలి చైర్మన్ అయితే.. శ్రీనివాస్ గౌడ్ మంత్రి అయ్యారు. 

►ALSO READ | అందరి త్యాగాలు.. కొందరి భోగాలు.. త్యాగాల తెలంగాణలో భోగాలు వీళ్లకేనా?

సి.విఠల్, దేవీప్రసాద్‌లాంటి నేతలకు నామినేటెడ్ పోస్టులు దక్కాయి. ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, అల్లం నారాయణ, మల్లేపల్లి లక్ష్మయ్య, పిట్టల రవీందర్ లాంటి వారికి పదవులు దక్కాయి. కళాకారుల్లో గోరెటి వెంకన్న, దేశపతి శ్రీనివాస్ ఎమ్మెల్సీలు అయితే రసమయి బాలకిషన్ ఎమ్మెల్యే అయ్యారు. సాయిచంద్‌కు కార్పొరేషన్ పదవి వచ్చింది.