- ఆర్అండ్బీ శాఖ నుంచి మారుస్తూ సర్కారు కీలక నిర్ణయం
- ఫైళ్లన్నీ హెచ్‌జీసీఎల్ కార్యాలయానికి తరలింపు-
- మోదీ సర్కార్ ఎటూ తేల్చకపోవడమే కారణం
- కేంద్రం నిధులు ఇవ్వకున్నా ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకేనంటున్న ఆఫీసర్లు
- రూ.16 వేల కోట్ల అంచనా వ్యయంతో ఆర్ఆర్ఆర్ సౌత్ ప్రాజెక్ట్ డీపీఆర్ రూపకల్పన
హైదరాబాద్, వెలుగు: రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్) సౌత్ ప్రాజెక్ట్‌ను హెచ్ఎండీఏ పరిధిలోని ప్రభుత్వ అనుబంధ విభాగం హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్(హెచ్‌జీసీఎల్) కు మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. సర్కారు ఆదేశాలతో ఎర్రమంజిల్‌లోని ఆర్ అండ్ బీ శాఖ హెడ్ఆఫీస్లో ఉన్న అన్ని ఫైళ్లనూ హెచ్జీసీఎల్కుఆఫీస్కు తరలించారు. ట్రిపుల్ ఆర్ సౌత్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు రాకపోవడం, నిధుల సమస్యంతో పనులపై ఆర్అండ్బీ ముందడుగు వేసే పరిస్థితి లేకపోవడంతో రాష్ట్ర సర్కారు ఈ మార్పు చేసినట్లు తెలుస్తున్నది. ఇకపై కేంద్రంతో సంప్రదింపులు, డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్(డీపీఆర్) తయారీ, నిధుల కేటాయింపు తదితర అన్ని పనులనూ హెచ్జీసీఎల్చేపడ్తుంది. ఈ నిర్ణయం వల్ల ఓవైపు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతూనే మరోవైపు భూసేకరణ, ఇతరత్రా పనులు స్పీడప్అయ్యే అవకాశముంది.
రోడ్డు పొడవు201 కిలోమీటర్లు
విజయవాడ హైవేలోని చౌటుప్పల్ నుంచి ముంబై హైవేలోని సంగారెడ్డి వరకు అర్ధచంద్రాకారంలో రీజినల్ రింగ్ రోడ్డు సౌత్ భాగాన్ని నిర్మించనున్నారు. అలైన్మెంట్ సవరణతో దీని పొడవు 201 కిలోమీటర్లకు పెరిగింది. మాల్, ఆమన్‌గల్, షాద్‌నగర్, చేవెళ్ల, శంకర్పల్లి, వికారాబాద్ మీదుగా సాగే ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.16 వేల కోట్లు కాగా.. 2,010 హెక్టార్ల భూమి అవసరమవుతుంది. ఈ భూమి విలువ సుమారు రూ.6,500 కోట్లు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఒప్పందం ప్రకారం.. భూసేకరణ వ్యయంలో 50 శాతం నిధులను రాష్ట్రం, మిగతా 50 శాతం కేంద్రం భరిస్తాయి. రోడ్డు నిర్మాణ ఖర్చు పూర్తిగా కేంద్రమే భరించనుండగా.. టోల్ ఫీజు వసూలు చేసే పూర్తి హక్కులు మాత్రం ఎన్హెచ్ఏఐ పరిధిలోనే ఉంటాయి.
సౌత్పార్ట్పై ఆసక్తి చూపని కేంద్రం
త్రిబుల్ఆర్ ప్రాజెక్ట్‌ను రెండు భాగాలుగా చేశారు. వీటిలో నార్త్ పార్ట్‌ను కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది. రోడ్డు నిర్మాణ వ్యయం అంతా కూడా కేంద్రమే భరిస్తున్నది. అయితే సౌత్ ప్రాజెక్ట్‌కు సంబంధించి 2024 నుంచి రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నది. అధికారులు అనేక రకాల ఫైల్స్రెడీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇప్పటికే మంత్రి మండలి ఆమోదం పొందారు. అయితే నిధుల కేటాయింపు విషయంలో సౌత్ పార్ట్‌పై కేంద్రం పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను ఆర్ అండ్ బీ శాఖ నుంచి హెచ్‌జీసీఎల్‌కు మారుస్తూ నిర్ణయం తీసుకున్నది.
కేంద్రం నుంచి నిధులు రావడానికి ఆలస్యం అయినా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలని భావిస్తున్నట్లుగా ఇంజినీరింగ్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతున్నది. ప్రభుత్వ ఆదేశాలతో ఆర్ అండ్ బీ శాఖలో ఉన్న త్రిబుల్ ఆర్ సౌత్ ప్రాజెక్ట్ ఫైల్స్ అన్నింటిని హెచ్జీసీఎల్కుఆఫీస్కు పంపించినట్లుగా ఇన్ని రోజులు ఆ ప్రాజెక్ట్సీఈగా వ్యవహరించిన వసంత్‌నాయక్ ‘వీ6 వెలుగు’తో చెప్పారు.
ఫ్యూచర్ సిటీ.. ఫార్మా సిటీ అన్నీ సౌత్ లోనే!
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఫ్యూచర్ సిటీ, ఫార్మా సిటీ వంటి పారిశ్రామిక క్లస్టర్లు అన్నీ ట్రిపుల్ ఆర్ సౌత్ ప్రాజెక్ట్ పరిధిలోకి వస్తాయి. ఓఆర్ఆర్ నిర్మాణంలో అనుభవమున్న హెచ్‌జీసీఎల్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్ చేపడితే చౌటుప్పల్, ఇబ్రహీంపట్నం, కందుకూరు, ఆమన్‌గల్, చేవెళ్ల, శంకర్ పల్లి ప్రాంతాలు ఆర్థిక వృద్ధి కారిడార్లుగా మారుతాయని ప్రభుత్వం భావిస్తోంది. భూసేకరణ వేగవంతం చేయడానికి 5 ప్రత్యేక విభాగాలను కూడా మంజూరు చేసింది. ఈ మార్గం ద్వారా జాతీయ రహదారులు అనుసంధానమై, భారీ వాహనాలు నగరం లోపలికి రాకుండా బైపాస్ చేయడం ద్వారా ట్రాఫిక్ ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయని సర్కారు అంచనా వేస్తోంది.
