తెలంగాణ మోడల్‌‌‌‌లో కులగణన చేయండి : సీఎం రేవంత్‌‌‌‌

తెలంగాణ మోడల్‌‌‌‌లో  కులగణన చేయండి : సీఎం రేవంత్‌‌‌‌
  • మేం పూర్తి సహకారం అందిస్తాం
  • రాష్ట్రాల యూనిట్‌‌‌‌గానే సర్వే చేపట్టాలి 
  • రాష్ట్రాలను సంప్రదించి గైడ్‌‌‌‌లైన్స్ రూపొందించాలి
  • ఏడాదిలోగా పూర్తి చేయాలని కేంద్రానికి సూచన

హైదరాబాద్, వెలుగు: కులగణన విషయంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేశవ్యాప్తంగా చేపట్టనున్న కులగణనలో తెలంగాణ మోడల్‌‌‌‌నే అనుసరించాలని కేంద్రాన్ని కోరారు. ఇందుకు తాము పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. హైదరాబాద్‌‌‌‌ జూబ్లీహిల్స్‌‌‌‌లోని తన నివాసంలో గురువారం మీడియాతో సీఎం రేవంత్​రెడ్డి మాట్లాడారు. కులగణన విషయంలో తమ అనుభవాలను కేంద్రంతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. 

‘‘కులగణన విషయంలో రాజకీయ వివాదాలకు తావులేదు. బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలన్నదే మా లక్ష్యం. ఈ లక్ష్యంతోనే మేము కేంద్రంతో కలిసి పని చేస్తాం. మా అనుభవాలను కేంద్రంతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే మా అధికారుల బృందాన్ని ఢిల్లీకి పంపించి పవర్‌‌‌‌ పాయింట్ ప్రజంటేషన్ ఇప్పిస్తాం. మేం రాజకీయ వివాదాలకు దూరంగా ఉంటాం. బడుగు బలహీనవర్గాల కోసం ఒక అడుగు వెనక్కి వేయడానికైనా మేం సిద్ధం” అని చెప్పారు.  

కేంద్రానికి సూచనలు.. 

జనగణనతో పాటే కులగణన చేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అయితే, ఈ ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేసేందుకు కొన్ని సూచనలు చేస్తున్నామని, వాటిని కేంద్రం పాటించాలని కోరారు. ‘‘కులగణన కోసం కేంద్ర కేబినెట్‌‌‌‌ మంత్రులతో కమిటీ ఏర్పాటు చేయాలి. అధికారులు, నిపుణులతో కూడిన కమిటీని నియమించి, రాష్ట్రాల వారీగా సమస్యలపై అధ్యయనం చేయాలి.

 రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలి. ఏడాదిలోగా కులగణనను పూర్తి చేయాలి. ఇందులో సేకరించిన డేటాను ఎలా ఉపయోగిస్తారో స్పష్టంగా చెప్పాలి. ప్రతి రాష్ట్రంలో కులాల వర్గీకరణ వేర్వేరుగా ఉంటుంది. ఉదాహరణకు తెలంగాణలో బోయ కమ్యూనిటీ ఓబీసీగా ఉంటే, కర్నాటకలో ట్రైబల్‌‌‌‌గా ఉంది. ఈ తేడాలను అర్థం చేసుకుని, రాష్ట్రాలను యూనిట్‌‌‌‌గా తీసుకుని కులగణన చేపట్టాలి” అని కేంద్రానికి సూచించారు.
 
కులగణనతోస్థానిక ఎన్నికలకు సంబంధం లేదు.. 

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే కుల గణను విజయవంతంగా పూర్తి చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. విద్య, ఉద్యోగాల్లో, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు తెచ్చామని, దాన్ని కేంద్రానికి పంపించామన్నారు. కులగణన డేటాను జస్టిస్ సుదర్శన్ రెడ్డి, ప్రొఫెసర్లు కంచ ఐలయ్య, శాంతాసిన్హా వంటి నిపుణుల కమిటీకి అందజేసినట్టు వెల్లడించారు. ఈ డేటా ఆధారంగా బలహీన వర్గాలకు విద్య, ఉద్యోగ, సంక్షేమ పథకాల్లో న్యాయం చేయడానికి నిపుణుల సూచనలు తీసుకుంటామన్నారు. కేంద్రం చేపట్టే కులగణనతో స్థానిక ఎన్నికలకు సంబంధం లేదన్నారు.

కాంగ్రెస్ పోరాటంతోనే కులగణన.. 

కాంగ్రెస్ పోరాటం చేయడంతోనే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగణన చేపడుతున్నదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘కులగణన కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్‌‌‌‌లో ధర్నా చేశాం. 16 రాజకీయ పార్టీల మద్దతుతో కేంద్రంపై ఒత్తిడి తెచ్చాం. మా ఒత్తిడి వల్లే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది” అని అన్నారు. రాహుల్ గాంధీ ఆలోచనలు, సూచనలతో తెలంగాణలో కులగణన విజయవంతమైందని చెప్పారు. ప్రధాని మోదీ కూడా రాహుల్ సూచనలను పాటిస్తే, దేశానికి మేలు చేకూరుతుందన్నారు.