కరెంట్ బిల్లుల బకాయిలు : సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ అక్బరుద్దీన్

కరెంట్ బిల్లుల బకాయిలు : సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ అక్బరుద్దీన్

తెలంగాణ అసెంబ్లీలో కరెంట్ అప్పులపై చర్చ హాట్ గా సాగింది. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో కరెంట్ సరిగా లేదని.. ఒక్క వైర్ కూడా కొత్తగా వేయలేదని.. కరెంట్ విషయంలో ఓల్డ్ సిటీ నిర్లక్ష్యానికి గురైందంటూ ప్రశ్నించారు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్. విద్యుత్ అప్పులపై ఇచ్చిన శ్వేతపత్రం తప్పుల తడకగా ఉందని.. ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ఈ శ్వేతపత్రం తీసుకొచ్చిందంటూ ప్రశ్నించారాయన. అప్పులు చేయకుండా.. కరెంట్ చార్జీలు పెంచకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఉచితంగా కరెంట్ ఎలా ఇస్తుందని ప్రశ్నించారు అక్బరుద్దీన్. 

ఈ ప్రశ్నలపై సీఎం రేవంత్ రెడ్డి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. విద్యుత్ బిల్లుల బకాయిలో సిద్దిపేట నియోజకవర్గం ఫస్ట్ ప్లేస్ లో ఉందని.. రెండో స్థానంలో గజ్వేల్ ఉందని.. మూడో స్థానంలో హైదరాబాద్ సౌత్.. ఓల్డ్ సిటీ ఉందని.. విద్యుత్ బకాయిలు వందల కోట్లు పెండింగ్ ఉంటే.. ఎంఐఎం పార్టీ ఇన్నాళ్లు ఎందుకు ప్రశ్నించలేదన్నారు. మైనార్టీలు అంటే ఎంఐఎం పార్టీనే కాదని.. ముస్లింలకు అండగా నిలబడింది కాంగ్రెస్ పార్టీనే అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి.. కేసీఆర్ తో కలిసి.. జూబ్లీహిల్స్ లో అభ్యర్థిని నిలబెట్టింది ఎవరు అంటూ.. అక్బరుద్దీన్ ను ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. 

విద్యుత్ సంస్థలు నష్టాల్లో ఉండటానికి కరెంట్ బిల్లులు కట్టకపోవటం కూడా ఓ కారణం అన్న సీఎం రేవంత్ రెడ్డి.. మీ దోస్తులు కేసీఆర్, హరీశ్ రావును అడిగి కట్టించరాదా అంటూ చురకలు అంటించారు. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కదా అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి.