చెరువులు కబ్జా చేసినోళ్లు ఎంతటివారైనా వదలం : రేవంత్ రెడ్డి

చెరువులు కబ్జా చేసినోళ్లు ఎంతటివారైనా వదలం : రేవంత్ రెడ్డి
  •     ఉప్పల్​ నల్లచెరువు సీవేజ్​ ట్రీట్​మెంట్​ప్లాంట్​ ప్రారంభం 

ఉప్పల్, వెలుగు: చెరువులు, కాలువలు కబ్జా చేసినోళ్లు ఎంతటి వారైనా వదలబోమని సీఎం రేవంత్​రెడ్డి హెచ్చరించారు. శనివారం హైదరాబాద్​లోని ఉప్పల్ నల్లచెరువు సీవేజ్ ట్రీట్​మెంట్​ ప్లాంటు ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. ఈ ప్రాంత సమస్యలన్నింటిపై తనకు సంపూర్ణ అవగాహన ఉన్నదని, ఎంపీగా తనను గెలిపించి పార్లమెంటుకు పంపించారని, ఇప్పుడు ముఖ్యమంత్రి కావడానికి సహకరించింది మేడ్చల్ ప్రజలేనని గుర్తుచేసుకున్నారు. 

మేడ్చల్ జిల్లాలో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.  హైదరాబాద్​ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ముందడుగు పడింది కాంగ్రెస్ హయాంలోనే కానీ.. గత పదేండ్లుగా బీఆర్ఎస్ పాలనలో వెనుకబడింది తప్ప ముందుకు పోయింది ఏమీ లేదు అని అన్నారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు.. ఆ తర్వాత అభివృద్ధిపైనే తన దృష్టి ఉంటుందని, ప్రజల అవసరాలు తీర్చడమే తప్ప రాజకీయాలు అవసరం లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. వచ్చే 25 ఏండ్లలో హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధిలో మరింత ముందుకు తీసుకెళ్తానని తెలిపారు. 

దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో తెలంగాణను ముందు వరుసలో నిలుపుతామని చెప్పారు.  ప్రజల అవసరాలకు ఉపయోగపడే చెరువులు, కుంటల కబ్జాలపై సమగ్ర విచారణ జరిపి, నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రజా ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రేశ్ ​యాదవ్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి,  ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్​చార్జి మందమల్ల పరమేశ్వర్ రెడ్డి, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.