95 వేల235 ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్

95 వేల235 ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్
  • రూరల్ లో 57,141 ఇండ్లు, అర్బన్ లో 38,094 ఇండ్లు
  • జీవో రిలీజ్ చేసిన ఆర్ అండ్ బీ ప్రిన్సిపల్ సెక్రటరీ
  • ఈ నెల 11న బూర్గంపాడులో స్కీమ్ లాంచ్ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి


హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా 95,235 ఇందిరమ్మ ఇండ్లను శాంక్షన్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 57,141 ఇండ్లు, అర్బన్ ఏరియాల్లో 38,094 ఇండ్లకు అనుమతిస్తున్నట్టు ఆర్ అండ్ బీ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు మంగళవారం ప్రకటించారు. ఈ మేరకు జీవో నంబర్ 6ను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. ఒక్కో సెగ్మెంట్​కు ఫస్ట్ ఫేజ్​లో భాగంగా 800 ఇండ్లను ప్రభుత్వం శాంక్షన్ చేసింది. ఈ స్కీమ్​ను ఈ నెల 11న భద్రాచలం నియోజకవర్గంలోని బూర్గంపాడులో నిర్వహించే బహిరంగ సభలో సీఎం రేవంత్ లాంచ్ చేయనున్నారు. 

కాగా, ఈ ఇండ్ల నిర్మాణానికి హడ్కో (హౌసింగ్ అర్బన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్) నుంచి రూ.3 వేల కోట్లు అప్పు తీసుకునేందుకు హౌసింగ్ బోర్డుకు ప్రభుత్వం అనుమతి ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో ప్రిన్సిపల్ సెక్రటరీ పేర్కొన్నారు. వీకర్ సెక్షన్ హౌసింగ్ ప్రోగ్రామ్​లో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన హడ్కో.. అన్ని రాష్ట్రాల్లో ఇండ్ల నిర్మాణానికి లోన్ ఇస్తుంటుంది. గతంలో ఇందిరమ్మ ఇండ్లకు, డబుల్ బెడ్ రూమ్ స్కీమ్​కు రుణం ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపడుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు కేటాయిస్తామని ఇటీవల పెట్టిన బడ్జెట్​లో ప్రభుత్వం ప్రకటించింది. ప్రజావాణిలో ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్ల కోసం సుమారు 85 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. త్వరలో గైడ్ లైన్స్ ఫైనల్ చేసి మరో జీవో రిలీజ్ చేస్తామని అధికారులు చెప్తున్నారు.