ఏ శాఖ ఎవరికిద్దాం? .. ఢిల్లీలో ఖర్గే, రాహుల్​తో చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి

ఏ శాఖ ఎవరికిద్దాం? .. ఢిల్లీలో ఖర్గే, రాహుల్​తో చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి
  • ఇరిగేషన్, విద్యుత్, రెవెన్యూ శాఖలపై స్పెషల్ ఫోకస్ 
  • ఎంపీ పదవికి రాజీనామా చేసిన రేవంత్​
  • కొడంగల్​, మల్కాజ్​గిరి తన ఊపిరి అంటూ ట్వీట్​

హైదరాబాద్/న్యూఢిల్లీ, వెలుగు: మంత్రులకు శాఖల కేటాయింపుపై సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. ఎవరికి ఏ శాఖ కేటాయించాలనే దానిపై ఢిల్లీలో హైకమాండ్ తో చర్చలు జరిపారు. శుక్రవారం ఉదయం జ్యోతిరావ్ ఫూలే ప్రజాభవన్​లో ప్రజాదర్బార్​లో పాల్గొన్న రేవంత్.. ఆ తర్వాత సెక్రటేరియెట్​లో విద్యుత్​శాఖపై రివ్యూ చేశారు. అనంతరం మధ్యాహ్నం 3:30 గంటలకు ఢిల్లీ వెళ్లారు.

అక్కడ తన ఎంపీ పదవికి రాజీనామా చేసి.. ఏఐసీసీ పెద్దలతో సమావేశమయ్యారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ, పార్టీ జనరల్​సెక్రటరీ కేసీ వేణుగోపాల్​తో భేటీ అయి మంత్రులకు శాఖల కేటాయింపుపై చర్చలు జరిపారు. కాగా, మంత్రులకు వీలైనంత త్వరగా శాఖలు కేటాయించాలని రేవంత్ భావిస్తున్నారు. ఇప్పటికే ప్రజాదర్బార్ మొదలవడం, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ సమస్యలు చెప్పుకోవడంతో వాటిని పరిష్కరించాల్సి ఉండడం, మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు చేయాల్సి ఉండడంతో... మంత్రులకు శాఖలు కేటాయిస్తేనే పాలన ముందుకుసాగుతుందని ఆయన భావిస్తున్నట్టు తెలిసింది. 

ఆ మూడు శాఖలు కీలకం..  

బీఆర్ఎస్​ పాలనలో ఇరిగేషన్, విద్యుత్, రెవెన్యూ శాఖల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న కాంగ్రెస్​ ప్రభుత్వం... ఆ శాఖలపై ఫోకస్ పెట్టింది. 

కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ రూ.లక్ష కోట్లు దోచుకున్నారని, తాము అధికారంలోకి వచ్చినంక కాళేశ్వరంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపిస్తామని మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ శాఖను ఎవరికి అప్పగిస్తారనేది కీలకంగా మారింది. మరోవైపు సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రేవంత్ మొదటి రివ్యూ విద్యుత్ శాఖపైనే చేశారు.

కరెంట్ కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని, రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం వచ్చేలా కేసీఆర్ కుట్ర చేసి వెళ్లారంటూ ఆయన ఆరోపించారు. డిస్కంలను రూ.82 వేల కోట్ల అప్పుల్లోకి నెట్టారని మండిపడ్డారు. ఇప్పటికే ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు రాజీనామా చేయగా, ఆ రాజీనామాను ఆమోదించవద్దని.. ఆయననూ రివ్యూకు రావాలని ఆదేశించారు. అయితే శుక్రవారం జరిగిన రివ్యూకు ప్రభాకర్ రావు రాలేదు.

ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖ కేటాయింపుపై కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ శాఖలో జరిగిన అక్రమాలను తేల్చడంతో పాటు రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇవ్వాల్సి ఉండడంతో..  విద్యుత్ శాఖను రేవంత్ తన దగ్గరే ఉంచుకుంటారనే చర్చ జరుగుతున్నది.