పాలసీల రూపకల్పనపై సీఎం ఫోకస్​

పాలసీల రూపకల్పనపై సీఎం ఫోకస్​
  • కీలక శాఖలపై దృష్టి పెట్టిన రేవంత్ రెడ్డి
  • గత సర్కార్ హయాంలో అమలైన స్కీమ్స్, పెట్టిన ఖర్చు, వచ్చిన ఫలితంపై ఆరా
  • పలు పథకాలు ఫెయిల్ కావడానికి కారణాలేంటని ప్రశ్న 
  • అన్ని అంశాలతో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వాలని అధికారులకు ఆదేశం
  • జూన్ 6 తర్వాత డిపార్ట్​మెంట్ల వారీగా రివ్యూ 

హైదరాబాద్, వెలుగు : కీలక శాఖలపై పట్టు పెంచుకోవడం ద్వారా పాలనలో తనదైన మార్క్​చూపించేందుకు సీఎం రేవంత్ రెడ్డి రెడీ అయ్యారు. రాబోయే ఐదేండ్లలో ప్రజలకు ప్రభుత్వాన్ని మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ఎలాంటి పాలసీలు రూపొందించాలనే దానిపై కసరత్తు ప్రారంభించారు. గత పదేండ్లలో ఆయా శాఖల పరిధిలో తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు, అమలు చేసిన స్కీములు, పెట్టిన ఖర్చు, జరిగిన లబ్ధి, ఆయా స్కీముల ప్రస్తుత పరిస్థితిని క్షుణ్ణంగా స్టడీ చేయాలని నిర్ణయించారు.

గత బీఆర్ఎస్​సర్కార్ హయాంలో పలు డిపార్ట్​మెంట్లలో అమలు చేసిన స్కీములు ఆశించిన స్థాయిలో సక్సెస్​ కాలేదు. ఇందుకు కారణాలు, పాలసీపరమైన లోటుపాట్లు, స్కీముల్లో జరిగిన అక్రమాలు, నిధుల దుర్వినియోగంపై ఆరా తీస్తున్నారు. ఆయా శాఖల పరిధిలో పనికిరాని స్కీములను పక్కనపెట్టడంతో పాటు అనవసర ఖర్చును తగ్గించుకోవాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి శాఖకు సంబంధించిన పూర్తిస్థాయి సమాచారంతో  సిద్ధంగా ఉండాలని

పవర్​ పాయింట్​ ప్రజంటేషన్​కు ఏర్పాట్లు చేసుకోవాలని ఉన్నతాధికారులను సీఎం రేవంత్ ఇటీవల ఆదేశించారు. జూన్​6 తర్వాత డిపార్ట్​మెంట్ల వారీగా రివ్యూ నిర్వహించనున్నారు. దీంతో హెచ్​ఓడీలు పవర్​ పాయింట్ ​ప్రజంటేషన్​ కోసం గత పదేండ్ల సమాచారం, లెక్కలు తీస్తున్నారు. 

గత బీఆర్ఎస్ సర్కార్ గొప్పగా ప్రకటించిన దళితబంధు, బీసీ బంధు, దళితులకు మూడెకరాలు, డబుల్​బెడ్​రూమ్ ఇండ్లు, గొర్రెల పంపిణీ లాంటి స్కీములు ఆశించిన స్థాయిలో సక్సెస్​ కాలేదు. నిధుల కొరత, బీఆర్ఎస్ నేతల జోక్యం, క్షేత్రస్థాయిలో అవినీతి కారణంగా దళితబంధు లాంటి స్కీములు అనర్హులు, ఆ పార్టీ నేతలకే దక్కాయి. కాంట్రాక్టర్ల ముసుగులో బీఆర్ఎస్​ నేతలు కట్టిన డబుల్​ బెడ్రూం ఇండ్లలో నాణ్యత కరువైంది. డీడీలు కట్టిన గొల్లకుర్మలకు గొర్రెలు పంపిణీ చేయలేదు. ఇలా గత బీఆర్ఎస్ సర్కార్ అమలు చేసిన పలు స్కీములు లబ్ధిదారులకు సక్రమంగా అందలేదు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి, లబ్ధిదారుడికి మధ్య దళారుల బెడద లేకుండా ఎలాంటి విధానం అనుసరిస్తే బాగుంటుందో ఆలోచన చేయాలని వివిధ శాఖల హెచ్ వోడీలకు సీఎం రేవంత్​సూచించినట్టు తెలిసింది. ప్రతిపక్షంలో ఉండగా తన దృష్టికి వచ్చిన అనేక అంశాలను ఉన్నతాధికారులకు వివరించిన సీఎం.. వాటిపైనా క్లారిటీ అడిగినట్టు సర్కార్ వర్గాలు చెబుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు స్కీమ్ కింద గుట్టలు, హైవేలు, వెంచర్లకు వేల కోట్లు ధారబోసింది. దీంతో ఆ స్కీమ్ అసలు ఉద్దేశం నేరవేరలేదు.

పైగా రైతుబంధు అమల్లోకి తెచ్చాక విత్తనాలు, ఎరువులపై సబ్సిడీలు ఎత్తేసింది. వ్యవసాయ పరికరాలు, యంత్రాల పంపిణీ బంద్​పెట్టింది. ఈ తరుణంలో రైతుబంధులో దుర్వినియోగాన్ని తగ్గించడం ద్వారా మిగిలే సొమ్మును  విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనిముట్లు, యంత్రాల సబ్సిడీకి వినియోగిస్తే ఎలా ఉంటుందని సీఎం రేవంత్ ఆలోచిస్తున్నట్టు ఆ శాఖ ఉన్నతాధికారులు అంటున్నారు. ఇక పశుసంవర్ధక శాఖలో గొర్రెల పంపిణీ స్కీమ్ లో భారీగా అక్రమాలు జరిగాయి. డీడీలు కట్టిన గొల్లకుర్మలకు గొర్రెలు రాలేదు గానీ..

గొర్రెల రీసైక్లింగ్​ద్వారా దళారులు, అధికారులు కోట్లకు పడగెత్తారు. కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం గొర్రెల స్కీము ద్వారా రాష్ట్రంలో గొల్లకుర్మల సంపద పది రెట్లు పెరిగినట్టు ఇప్పటికీ చెబుతున్నారు. ఇందులో నిజమెంత? క్షేత్రస్థాయిలో గొర్రెల సంఖ్య పెరిగిందా? పెరిగితే మటన్​రేట్లు ఎందుకు దిగిరాలేదు? ఇప్పటికీ ఇతర రాష్ట్రాల నుంచి గొర్రెలను ఎందుకు దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది?

లాంటి ప్రశ్నలను సీఎం అడిగితే ఎలా సమాధానాలు చెప్పాలనే దానిపై ఆ శాఖ అధికారులు మల్లగుల్లాలు పడ్తున్నారు. ఇవేగాక ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన సంక్షేమశాఖలు ఎందుకు డీలా పడ్డాయనే దానిపైనా సీఎం ప్రత్యేకంగా ఆరా తీసినట్టు చర్చ జరుగుతున్నది.  

రివ్యూ తర్వాతే ఐదేండ్ల ప్లాన్.. 

వివిధ శాఖల పరిధిలో ఇన్ని రోజులు ఏం జరిగింది? అనే దానిపై సీఎం రేవంత్ ఆరా తీస్తున్నారు. ఫైనాన్స్, ఇరిగేషన్, రెవెన్యూ, కమర్షియల్​ ట్యాక్స్, ఎక్సైజ్, మైనింగ్, ఫారెస్ట్, హెల్త్​, ట్రాన్స్​పోర్ట్, ఎండోమెంట్, విద్యుత్, ఇండస్ట్రీస్, ఎడ్యుకేషన్, పంచాయతీరాజ్, రోడ్స్ అండ్​ బిల్డింగ్స్..​ ఇలా అన్ని శాఖల పరిధిలో గత పదేండ్లలో ఏం జరిగింది? ఇప్పుడు ఆయా శాఖల్లో అమలవుతున్న స్కీమ్స్, వాటిలో ఏవి కొనసాగించవచ్చు? ఏవి బంద్ ​పెట్టవచ్చు? బంద్ ​పెడ్తే ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి? లాంటి విషయాలపై ఆఫీసర్లతో క్షుణ్ణంగా చర్చించాక సీఎం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తున్నది. ప్రతి శాఖపై లోతుగా రివ్యూ చేసి, వచ్చే ఔట్​పుట్స్ ఆధారంగానే ఐదేండ్ల విజన్ రూపొందించుకోవాలని సీఎం భావిస్తున్నారు.

అక్రమాలకు తావివ్వకుండా నేరుగా లబ్ధిదారులకు పథకాలు, ప్రభుత్వ సేవలు అందాలని సీఎం లక్ష్యంగా పెట్టుకున్నారని సీఎంవో అధికారులు చెబుతున్నారు. ప్రతి శాఖలో ప్రతి చిన్న విషయాన్ని తెలుసుకోవడం ద్వారా గత సర్కార్ హయాంలో జరిగిన లోటుపాట్లు.. మళ్లీ ఇప్పుడు జరగకుండా జాగ్రత్త పడాలన్నది సీఎం ఉద్దేశంగా కనిపిస్తున్నది. అధికారంలోకి వచ్చి ఐదు నెలలు కూడా నిండకముందే పనిగట్టుకొని విమర్శలు, ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలకు మున్ముందు ఆ అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా అడుగులు వేయాలనేది రేవంత్​ ఆలోచన అని, అందుకే అన్ని శాఖలపై పట్టుపెంచుకోవాలని భావిస్తున్నారని చర్చ నడుస్తున్నది.