ఎక్కడ కూడా ప్రాణ, ఆస్తి నష్టం జరగొద్దు: అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

ఎక్కడ కూడా ప్రాణ, ఆస్తి నష్టం జరగొద్దు: అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

హైదరాబాద్: హైద‌రాబాద్‌తో పాటు రాష్ట్రంలో సోమవారం (ఆగస్ట్ 4) భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో దాదాపు గంటన్నర పాటు కుండపోత వాన పడింది. ఆకాశానికి చిల్లు పడిందా అన్న మాదిరిగా భారీ వర్షం కురిసింది. వరుణుడు ఉగ్రరూపం చూపించడంతో నగరంలోని రోడ్లన్నీ నదులను తలపించాయి. భారీగా వరద నీరు రోడ్లపైకి చేరడంతో సిటీలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. కిలో మీటర్ల మేర ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి.

 దీంతో వాహనదారులు, ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హైద‌రాబాద్‌తో పాటు రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, అన్ని శాఖ‌ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వర్షాల నేపథ్యంలో సోమవారం (ఆగస్ట్ 4) రాష్ట్ర సచివాల‌యంలో ఉన్నతాధికారుల‌తో సీఎం  ప్రత్యేకంగా మాట్లాడారు. భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని, లోతట్టు ప్రాంతాల్లో తగిన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

 జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వరద నీటి ఉద్ధృతి ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారుల‌కు సూచించారు. రానున్న రెండు మూడు రోజులు వ‌ర్షాలు ఉంటాయ‌నే స‌మాచారం ఉన్నందున కలెక్టర్లు జిల్లాల్లోని అన్ని విభాగాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. ఎక్కడ కూడా ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో మాట్లాడి ఎప్పడికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సూచించారు.