33 జిల్లాలో ఎప్పటికప్పుడు పరిస్థితులు పర్యవేక్షిస్తున్నం: ప్రధాని వర్చువల్ సమావేశంలో సీఎం రేవంత్

33 జిల్లాలో ఎప్పటికప్పుడు పరిస్థితులు పర్యవేక్షిస్తున్నం: ప్రధాని వర్చువల్ సమావేశంలో సీఎం రేవంత్

హైదరాబాద్: పెట్రోల్, డీజిల్‌, గ్యాస్ స‌ర‌ఫ‌రాకు సంబంధించి రాష్ట్రంలో ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి ఆధ్వర్యంలో ఒక ఉన్నతస్థాయి క‌మిటీని నియ‌మించి, ప‌రిస్థితులను ఎప్పటిక‌ప్పుడు ప‌ర్యవేక్షిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి ప్రధాని మోడీకి తెలిపారు. ప‌శ్చిమాసియాలో ఉద్రిక్తత‌ ప‌రిస్థితుల నేప‌థ్యంలో అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాన‌మంత్రి శుక్రవారం (మార్చి 27) నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని రాష్ట్రంలోని పరిస్థితులను వివరించారు.

ఈ సంద‌ర్భంగా ముఖ్యమంత్రి ప‌లు అంశాల‌ను ప్రధాన‌మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. హైద‌రాబాద్‌లోని క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ నుంచి సీఎస్ ఆధ్వర్యంలోని క‌మిటీ, నిరంతరం ప‌రిస్థితుల‌ను స‌మీక్షిస్తున్నట్టు తెలిపారు.

33 జిల్లాల్లోనూ గ్యాస్ స‌ర‌ఫ‌రా, పెట్రోల్‌, డీజిల్ విక్రయాలు, బ్లాక్ మార్కెట్ నిరోధానికి క‌మిటీలు ఏర్పాటు చేసి నోడ‌ల్ అధికారుల‌ను నియ‌మించిన‌ట్లు వివరించారు. ప్రాధాన్యతా క్రమంలో ఆసుప‌త్రులు, పాఠ‌శాల‌లు, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాల‌కు క‌మ‌ర్షియ‌ల్ గ్యాస్ సిలిండ‌ర్లను పంపిణీ జరుగుతున్నట్టు చెప్పారు.

ప్రతి బంక్‌లో ఉన్న స్టాక్, ఎంత వినియోగించారన్న వివరాలను అధికారులు ఎప్పటిక‌ప్పుడు ప‌ర్యవేక్షణ చేస్తున్నార‌ని తెలిపారు. తెలంగాణలో సాధార‌ణ రోజుల్లో రోజుకు 36,189 కిలో లీట‌ర్ల పెట్రోల్‌, డీజిల్ వినియోగం జ‌రుగుతుంద‌ని, ప్రస్తుతం 1,88,210 కిలోలీట‌ర్ల నిల్వలు ఉన్నట్లు ప్రధానమంత్రి దృష్టికి తెచ్చారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్ కొర‌త‌పై సోష‌ల్ మీడియాలో అపోహ‌లు, భ‌యాందోళ‌న‌లు క‌లిగేలా పోస్టులు పెడుతున్న వారిపై చ‌ట్టప‌ర‌మైన చ‌ర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

తెలంగాణ‌లో శిలాజ ఇంధ‌నాలపై (బొగ్గు, చ‌మురు, గ్యాస్‌) ఆధార‌ప‌డ‌డం త‌గ్గించి ఎల‌క్ట్రిక్ వాహ‌నాల (EV) వినియోగాన్ని ప్రోత్సహించడం, పున‌రుత్పాదక విద్యుత్ ఉత్పత్తి పెంచడం వంటి వివరాలు, అందుకు తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రి వివరించారు. తెలంగాణ‌లో ఈవీ వాహనాలపై వంద శాతం రోడ్డు ప‌న్ను, రిజిస్ట్రేష‌న్ ఫీజు మిన‌హాయించామ‌న్నారు. ఈవీల త‌యారీ, బ్యాట‌రీ ఎకోసిస్టమమ్‌ను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నమని చెప్పారు.

హైద‌రాబాద్ న‌గ‌రంలో 1.20 ల‌క్షకుపైగా ఉన్న పెట్రోల్‌, డీజిల్ ఆటోల‌ను రిట్రోఫిట్టింగ్ ద్వారా ఈవీలుగా మార్చే ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీలో ఇక ముందు అన్ని ఈవీ బ‌స్సుల‌నే వినియోగించనున్నట్లు తెలిపారు. స‌మావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ‌కృష్ణారావు, సీఎం ప్రిన్సిప‌ల్ సెక్రట‌రీ శేషాద్రి పాల్గొన్నారు.