సిద్దిపేట జిల్లా నర్మెట్టకు సీఎం రేవంత్.. సభలో రైతు భరోసా నిధుల విడుదల

సిద్దిపేట జిల్లా నర్మెట్టకు సీఎం రేవంత్.. సభలో రైతు భరోసా నిధుల విడుదల
  • రూ.300 కోట్ల ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఓపెనింగ్
  • మూడు ఆస్పత్రులు, జిల్లా జైలు కూడా ప్రారంభించనున్న సీఎం
  • సీఎం టూర్, రైతు సభకు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

సిద్దిపేట, వెలుగు: మూడు వందల కోట్ల రూపాయలతో సిద్దిపేట జిల్లా నర్మెట్టలో నిర్మించిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు ఫ్యాక్టరీని ప్రారంభించి రైతన్నలకు అంకితం చేశారు. అక్కడే రూ.80 కోట్లతో నిర్మించే రిఫైనరీ యూనిట్ కు శంకుస్థాపన చేయనున్నారు. తర్వాత జిల్లా జైలు, ఆయూష్ ఆస్పిటల్, సెంట్రల్ డ్రగ్ స్టోర్, రెండు పీహెచ్ సీ లకు సంబంధించిన ప్రారంభోత్సవ శిలాఫలకాలను అక్కడే సీఎం ఆవిష్కరించనున్నారు. 

అనంతరం నర్మెట్టలో ఏర్పాటు చేసిన రైతు సభలో రూ.3,600 కోట్ల రైతు భరోసా నిధులను విడుదల చేసి ప్రసంగించనున్నారు. అంతకు ముందు వ్యవసాయరంగంలోని కీలక అంశాలపై ప్రత్యక్షంగా రైతులతో ముఖాముఖి మాట్లాడనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. మంత్రులు తుమ్మల నాగేశ్వర్​రావు, పొన్నం ప్రభాకర్, కలెక్టర్ హైమవతి శనివారం క్షేత్ర స్థాయిలో ఏర్పాట్లను పరిశీలించారు. ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం తరువాత నిర్వహించే సభకు 30 వేల మంది రైతులు హాజరయ్యే అవకాశం ఉంది. సభాస్థలానికి పాస్​లు ఉన్నవారిని మాత్రమే అనుమతించనున్నట్టు సమాచారం.

మరో నాలుగు భవనాల ప్రారంభం

నర్మెట్ట వేదికగా సిద్దిపేట నియోజకవర్గంలో పూర్తి చేసిన మరో నాలుగు అభివృద్ధి పనులను కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. నంగునూరులో రూ.60 కోట్లతో నిర్మించిన సెంట్రల్ డ్రగ్ స్టోర్, రూ.25 కోట్లతో నిర్మించిన ఆయూష్ ఆస్పత్రి, గట్ల మల్యాలలో  రూ.1.40 కోట్లతో నిర్మించిన పీహెచ్సీ, సిద్దిపేట పట్టణంలో నిర్మించిన అర్బన్ పీహెచ్సీ, సిద్దిపేట పట్టణ శివారులో రూ.78 కోట్లతో 30 ఎకరాల స్థలంలో నిర్మించిన  జిల్లా జైలును సీఎం అక్కడే శిలాఫలకాలను ఆవిష్కరించి ప్రారంభింస్తారు.

హరీశ్ హాజరవుతారా? 

సీఎం రేవంత్ రెడ్డి మొదటి సారి అధికారిక హోదాలో సిద్దిపేట నియోజకవర్గానికి వస్తున్నారు. అయితే నియోజకవర్గానికి చెందిన రూ.1000 కోట్ల పనులు నిలిపి వేశారని హరీశ్​రావు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయిల్ పామ్​ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి ఆయన హాజరవుతారా లేదా అనే అంశంపై చర్చ జరుగుతున్నది. మరోవైపు సీఎం సిద్దిపేట పర్యటన సందర్భంగా రుణమాఫీ జరగని రైతులతో కలసి నిరసన తెలుపుతానని హరీశ్ ప్రకటించడంతో ఆదివారం ఏం జరగనుందనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో స్థానిక బీఆర్ఎస్ శ్రేణుల కదలికలపై పోలీసులు నిఘాపెట్టారు. అందుకే ఎటువంటి గందరగోళం తలెత్తకుండా ఉండేందుకు సభకు పాస్ లను జారీ చేయాలని పోలీసులు నిర్ణయించినట్టు తెలుస్తున్నది.