సెక్రటేరియెట్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటయ్: సీఎం రేవంత్

సెక్రటేరియెట్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటయ్: సీఎం రేవంత్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రజలకు ఏ సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలని.. సెక్రటేరియెట్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “నిస్సహాయులకు సాయం చేయడం మా ప్రభుత్వ ధ్యేయం. అర్హత కలిగిన వారికి అవకాశాలు కల్పించడం మా ప్రభుత్వ లక్ష్యం. ఈ వేదికగా నేను మీకు మాట ఇస్తున్న.. తెలంగాణలో ఏర్పడ్డ ఇందిరమ్మ రాజ్యం.. పేదల అభివృద్ధికి పాటు పడుతుంది. సంక్షేమ పథకాలను ప్రతీ పేదకు చేరేలా చూస్తం. మేం పాలకులం కాదు.. సేవకులం. 

ఏసు క్రీస్తు మాకు ఆదర్శం. బాధ్యతను మరవకుండా పనిచేస్తూ ముందుకెళతాం. ఏ సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకురండి సెక్రటేరియెట్​తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి.. తప్పకుండా సమస్యలను పరిష్కరిస్తామని” అని అన్నారు.‘‘ప్రపంచానికి డిసెంబర్ మిరాకిల్ నెల. చెప్పినట్టుగానే డిసెంబర్‌‌లో తెలంగాణ‌‌లో కూడా మిరాకిల్ జరిగింది.. క్రైస్తవులు, మైనార్టీలు కొత్త ప్రభుత్వం రావాలని కోరుకున్నరు.. ఆ విధంగానే నూతన ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన్రు” అని రేవంత్​రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వ్యక్తులు, సంస్థలను ముఖ్యమంత్రి అవార్డులతో సత్కరించారు. 

రేపు కలెక్టర్లతో సీఎం కాన్ఫరెన్స్

సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 24న(ఆదివారం) కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. సీఎం అయ్యాక రేవంత్ కలెక్టర్లతో భేటీ కావడం ఇదే తొలిసారి. దీంతో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజావాణి కార్యక్రమ నిర్వహణపై ఇందులో ప్రధానంగా చర్చించనున్నట్టు ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ప్రతి గ్రామంలో వాడవాడలా ఈ నెల 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు నిర్వహించే ప్రజా పాలన కార్యక్రమం కార్యాచరణ రూపొందించనున్నారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు, స్థానికంగా అందిన ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అలాగే భూరికార్డులతో ముడిపడిన సమస్యలతో పాటు కౌలు రైతుల గుర్తింపు వంటి అంశాలపై చర్చిస్తారని తెలుస్తున్నది. కొత్త రేషన్ కార్డుల జారీ, మహాలక్ష్మి వంటి పథకాల అమలు కూడా చర్చకు వచ్చే చాన్స్ ఉంది. బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఏడో ఫ్లోర్​లో జరిగే ఈ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, అన్ని జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ, ఇతర అధికారులు పాల్గొననున్నారు.