- పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం: సీఎం రేవంత్‌రెడ్డి
- రాష్ట్ర, జిల్లాల్లోనూ కమిటీల ఏర్పాటు.. నోడల్ ఆఫీసర్ల నియామకం
- అపోహలు సృష్టించే వారిపై చర్యలు తీసుకుంటున్నం
- ఈవీలపై రోడ్డు ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయించాం
- 1.20 లక్షల ఆటోలను రిట్రోఫిట్టింగ్ ద్వారా ఈవీలుగా మార్చుతున్నం
- పీఎం వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరాకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇంధన సరఫరాపై సమీక్షకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమించి, పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం సాయంత్రం నిర్వహించిన వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. జూబ్లీహిల్స్‌లోని నివాసం నుంచి సీఎం ఈ సమావేశానికి హాజరై పలు కీలక అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లోనూ గ్యాస్ సరఫరా, పెట్రోల్, డీజిల్ విక్రయాలను పర్యవేక్షించేందుకు, బ్లాక్ మార్కెట్‌ను నిరోధించేందుకు ప్రత్యేక కమిటీలు వేసి, నోడల్ అధికారులను నియమించామన్నారు. ఆసుపత్రులు, పాఠశాలలు, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను ప్రాధాన్య క్రమంలో పంపుతున్నట్లు వివరించారు. ప్రతి బంక్‌లో ఎంత స్టాక్ ఉంది, ఎంత వినియోగం జరుగుతోందనే అంశంపై అధికారులు నిరంతరం నిఘా ఉంచారన్నారు. తెలంగాణలో సాధారణ రోజుల్లో రోజుకు 36,189 కిలో లీటర్ల పెట్రోల్, డీజిల్ వినియోగం జరుగుతుండగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 1,88,210 కిలో లీటర్ల నిల్వలు సిద్ధంగా ఉన్నాయని సీఎం వివరించారు. ఇంధన కొరతపై సోషల్ మీడియాలో అపోహలు సృష్టిస్తూ, ప్రజలను భయాందోళనలకు గురి చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
గ్రీన్ ఎనర్జీ వైపు అడుగులు..
ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వినియోగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని సీఎం తెలిపారు. ఇందులో భాగంగా ఈవీలపై వంద శాతం రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయించామన్నారు. బ్యాటరీ ఎకోసిస్టమ్ తయారీని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌లో ఉన్న 1.20 లక్షలకు పైగా పెట్రోల్, డీజిల్ ఆటోలను రిట్రోఫిట్టింగ్ ద్వారా ఈవీలుగా మార్చే ప్రక్రియ ప్రారంభిస్తున్నామన్నారు. ఆర్టీసీలో ఇకపై కేవలం ఈవీ బస్సులనే వినియోగించనున్నట్లు ప్రధానికి వివరించారు. ఈ సమావేశంలో సీఎస్ రామకృష్ణారావు పాల్గొన్నారు.
