ఆటో, క్యాబ్​ డ్రైవర్లు, ఫుడ్​ డెలివరీ బాయ్స్​కు.. 5 లక్షల ప్రమాద బీమా

ఆటో, క్యాబ్​ డ్రైవర్లు, ఫుడ్​ డెలివరీ బాయ్స్​కు.. 5 లక్షల ప్రమాద బీమా
  •     క్యాబ్​ డ్రైవర్లకు ఓలా, ఉబర్​ తరహాలో టీ హబ్​ నుంచి యాప్​
  •     ఆందోళన చెందొద్దు.. అండగా ఉంటామని హామీ
  •     గిగ్​ వర్కర్లతో సమావేశమై సమస్యలు తెలుసుకున్న సీఎం
  •     4 నెలల కింద కుక్క తరమడంతో బిల్డింగ్ ​పైనుంచి పడి చనిపోయిన డెలివరీ బాయ్​ కుటుంబానికి రూ.2 లక్షల పరిహారం

హైదరాబాద్, వెలుగు: ఆటో డ్రైవర్లు, క్యాబ్​ డ్రైవర్లు, ఫుడ్​ డెలివరీ బాయ్స్​ వంటి గిగ్​వర్కర్లకు రూ. 5 లక్షల ప్రమాద బీమాను అందించడంతో పాటు రాజీవ్​ ఆరోగ్య శ్రీ కింద రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని సీఎం రేవంత్​రెడ్డి ప్రకటించారు. క్యాబ్​ డ్రైవర్లకు ఓలా, ఉబర్​ తరహాలో టీహబ్​ ద్వారా సర్కార్​ యాప్​ను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. నాలుగు నెలల కింద ఫుడ్​ డెలివరీ చేసేటప్పుడు కుక్క తరమడంతో మూడో అంతస్తు నుంచి పడి చనిపోయిన ఫుడ్​ డెలివరీ బాయ్​ వివరాలను తెలుసుకున్న సీఎం రేవంత్​ రెడ్డి.. అతడి కుటుంబానికి రూ.2 లక్షల పరిహారం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. 

రాజస్థాన్​లో గిగ్​ వర్కర్ల శ్రేయస్సు కోసం చట్టం చేశారని, దాన్ని స్టడీ చేసి అలాంటి చట్టాన్ని వచ్చే బడ్జెట్​ సమావేశాల్లో ప్రవేశపెడతామని ఆయన హామీ ఇచ్చారు. అసంఘటిత కార్మికుల ఉపాధి, సామాజిక భద్రతకు చర్యలు తీసుకుంటామన్న రాహుల్​ గాంధీ హామీని నిలబెడతామన్నారు. అందుకు విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని, గిగ్​ వర్కర్లకు సామాజిక భద్రతను కల్పిస్తామని హామీ ఇచ్చారు. శనివారం హైదరాబాద్​లోని నాంపల్లి ఎగ్జిబిషన్​ గ్రౌండ్స్​లో ఆలిండియా ప్రొఫెషనల్​ కాంగ్రెస్​ (ఏఐపీసీ) చైర్మన్​ ప్రవీణ్​ చక్రవర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన గిగ్​వర్కర్ల  సమావేశంలో సీఎం రేవంత్​రెడ్డి పాల్గొన్నారు.  గిగ్​ వర్కర్లు సీఎం వద్ద తమ గోడును వెళ్లబోసుకున్నారు. అండగా ఉంటామని, సమస్యలను పరిష్కరిస్తామని  వారికి సీఎం రేవంత్​ హామీ ఇచ్చారు. 

ఆటో యూనియన్లకు నెట్​వర్క్​ ఏర్పాటు: పొన్నం ప్రభాకర్​

గిగ్​ వర్కర్స్​కు ఒక కనెక్టివిటీ ఉండి ఇన్సూరెన్స్​ అందేందుకు వీలుగా ఓ యాప్​ సర్వీసెస్​ను అందుబాటులోకి తీసుకొస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​ అన్నారు. త్వరలోనే అన్ని ఆటో యూనియన్​ ప్రతినిధులను పిలిచి వారి సమస్యలను తెలుసుకుని ఓ నెట్​వర్క్​ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, వాళ్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సమస్యలను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. శనివారం గిగ్​ వర్కర్లతో సమావేశం అనంతరం ఏఐపీసీ చైర్మన్​ ప్రవీణ్​ చక్రవర్తితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రతి కార్మికుడి సంరక్షణ తమ ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు. ఇతర పార్టీల నేతలు ఆటో యూనియన్​ వాళ్లను రెచ్చగొట్టి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఆటో డ్రైవర్లకు నష్టం జరగకుండా కచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. గత నెల 27న హైదరాబాద్​లో గిగ్​ వర్కర్లను రాహుల్​ గాంధీ కలిశారని, ప్రభుత్వం ఏర్పాటయ్యాక గిగ్​ వర్కర్ల సమస్యలు తెలుసుకుంటానని మాటిచ్చారని ప్రవీణ్​ చక్రవర్తి గుర్తు చేశారు. అందులో భాగంగానే సీఎం, మంత్రులు కలిసి గిగ్​ వర్కర్లతో సమావేశమయ్యారని ఆయన చెప్పారు. రాష్ట్రంలో దాదాపు 4.5 లక్షల మంది గిగ్​ వర్కర్లున్నారని, వారి సమస్యలను సీఎం రేవంత్​ రెడ్డి సావధానంగా విన్నారని గిగ్​ యూనియన్​ ప్రెసిడెంట్​ సలావుద్దీన్​ తెలిపారు. అందరి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని అన్నారు.

సంస్థలూ కొంచెం ఆలోచించాలి

గిగ్​ వర్కర్లపై సంస్థలు కూడా కొంచెం ఆలోచన చేయాలని, కేవలం లాభాపేక్షే కాకుండా కార్మికులు, ఉద్యోగుల సంక్షేమంపైనా దృష్టి పెట్టాలని సీఎం రేవంత్​ రెడ్డి సూచించారు. గివ్​ అండ్​ టేక్​ పాలసీని పాటించని ఎంతపెద్ద సంస్థలపైనైనా చర్యలకు వెనుకాడబోమని ఆయన హెచ్చరించారు. ‘‘ఫుడ్​ డెలివరీ బాయ్​ను 4 నెలల కింద కుక్క తరిమితే అపార్ట్​మెంట్​ మూడో అంతస్తు నుంచి పడి చనిపోయాడు. అప్పటి ప్రభుత్వం ఏదైనా సాయం చేస్తుందని వేచి చూశా. కానీ, ఆ ప్రభుత్వం ఏమీ చేయలేదు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. అందుకే ఆ కుటుంబం వివరాలు సేకరించి సీఎం సహాయనిధి నుంచి ఆ కుటుంబానికి రూ. 2 లక్షలు అందించాలని అధికారులకు ఆదేశాలు ఇస్తున్న” అని సీఎం రేవంత్​ తెలిపారు. 

గ్రామసభల్లో వివరాలివ్వండి

ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రజా పాలన గ్రామసభలను నిర్వహిస్తున్నామని, సమస్యలేమైనా ఉంటే  అక్కడ దరఖాస్తులు, వివరాలు అందించాలని గిగ్​ వర్కర్లకు సీఎం రేవంత్​ రెడ్డి సూచించారు. డిజిటల్​, మాన్యువల్​ సహా ఎలాగైనా దరఖాస్తులను ఇవ్వొచ్చని చెప్పారు. ప్రతి నాలుగు నెలలకోసారి గ్రామ సభలు నిర్వహిస్తామన్నారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను అన్నింటినీ పరిష్కరిస్తామని చెప్పారు. కాగా, ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్​ బాబు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​, ఏఐసీసీ సెక్రటరీలు రోహిత్​ చౌదరి, మన్సూర్​ అలీ ఖాన్​, పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్​ మాధు యాష్కీ, పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ మహేశ్​ కుమార్​ గౌడ్​ తదితర నేతలు పాల్గొన్నారు.