ఇవాళ్టి (జులై 14) నుంచి ..కొత్త రేషన్ కార్డుల పంపిణీ

ఇవాళ్టి (జులై 14) నుంచి ..కొత్త రేషన్ కార్డుల పంపిణీ
  • సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ 
  • లక్ష మందితో భారీ బహిరంగ సభ
  • ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు 
  • నల్గొండ ఉమ్మడి జిల్లా పోలీసులతో భారీ బందోబస్తు

సూర్యాపేట, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డుల పంపిణీ సోమవారం నుంచి షురూ కానున్నది. గత పదేండ్లుగా రేషన్ కార్డుల ప్రక్రియ నిలిచిపోగా.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసింది.   సోమవారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజక వర్గంలోని తిరుమలగిరి లో సీఎం రేవంత్‌‌రెడ్డి రేషన్​కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.  అదేసమయంలో రాష్ట్ర వ్యాప్తంగా  ఆయా జిల్లాలు, నియోజకవర్గాలు, మండలాలవారీగా కొత్త కార్డులను పంపిణీ చేయనున్నారు.  

కొత్తగా 5 లక్షల కార్డులు..

రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 13 వరకు వచ్చిన అప్లికేషన్స్ అన్నింటిని పరిశీలించి అప్రూవ్ చేయాలని మంత్రి ఉత్తమ్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. సుమారు 5 లక్షల మందికి కొత్త కార్డులు ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు. రాష్ట్రంలో 13 వేల కోట్లతో సుమారు 3.10 కోట్ల మందికి 6 కేజీల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు. గత ఖరీఫ్, రబీ సీజన్స్‌‌లో కలిపి 281 లక్షల టన్నుల వడ్లు పండించిన రాష్ట్రంగా తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. యాసంగిలోనే 75 లక్షల టన్నుల వడ్లు సేకరించారు.

లక్ష మందితో భారీ బహిరంగ సభ

సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రేషన్​కార్డుల పంపిణీ ప్రారంభం కానుండడంతో తిరుమలగిరిలో లక్ష మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు.  మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఇన్‌‌చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌‌తోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు సభకు హాజరుకానున్నారు.   దీంతో ఎమ్మెల్యే మందుల సామేల్ ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకొని, జనసమీకరణ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేల సమన్వయంతో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సీఎం పర్యటన సందర్భంగా 1200 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సూర్యాపేట, నల్గొండ, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌‌నగర్​, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాల సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. 

పదేండ్ల తర్వాత రేషన్​కార్డులకు మోక్షం

పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కొత్త రేషన్​ కార్డులు ఇవ్వలేదు. కొత్త అప్లికేషన్స్ కూడా స్వీకరించలేదు. రూపాయికి కిలో చొప్పున పంపిణీ చేసిన దొడ్డు బియ్యం అక్రమార్గంలో బ్లాక్  మార్కెట్​కు తరలిపోయింది. ఈ పేరుతో ఏటా రూ. పది వేల కోట్లు దుర్వినియోగం అయ్యాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆహార భద్రత చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నది.  దేశంలోనే తొలిసారిగా సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పదేండ్లనుంచి ఆగిపోయిన కొత్త రేషన్ కార్డుల పంపిణీ వేగవంతమైంది. ఇదొక నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తామని మంత్రి ఉత్తమ్  ఇప్పటికే ప్రకటించారు. ఎలాంటి అక్రమాలు, అవతవకలకు ఆస్కారం లేకుండా కార్డులు ఇవ్వడమేగాక, సన్న బియ్యం పంపిణీ పక్కాగా జరిగేలా కఠినమైన చర్యలు అమలు చేస్తున్నారు.