ఇవాళ(జూన్ 6) కోహెడ ఫ్రూట్ మార్కెట్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన

ఇవాళ(జూన్ 6)  కోహెడ  ఫ్రూట్ మార్కెట్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన

హైదరాబాద్/ఎల్బీనగర్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి సంకల్పం, కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యంతో దేశంలోనే అతిపెద్ద అంతర్జాతీయ స్థాయి సమీకృత మార్కెట్ కోహెడలో రూపుదిద్దుకుంటున్నదని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌‌‌‌‌‌‌‌మెట్ మండలం కోహెడలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న అంతర్జాతీయ సమీకృత మార్కెట్‌‌‌‌కు శనివారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేసి, అక్కడే జరగనున్న బహిరంగసభకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రూ.3,367.35 కోట్ల వ్యయంతో 239 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న కోహెడ మార్కెట్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. డిసెంబర్, జనవరిలోగా తొలిఫేజ్‌‌‌‌లో ప్రాథమిక పనులు పూర్తిచేస్తామని ఆయన తెలిపారు. మూడేళ్లలోగా మార్కెట్ మొత్తం అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. 

ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలోని దాదాపు 1.65 లక్షల మంది పండ్ల రైతులకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరనుందని మంత్రి అన్నారు. ప్రస్తుతం 5.30 లక్షల  టన్నులుగా ఉన్న మార్కెట్ సామర్థ్యం 15.53 లక్షల టన్నులకు పెరగనుందని పేర్కొన్నారు. ఫ్రూట్‌‌‌‌ బిజినెస్‌‌‌‌ సైజ్​ రూ.1,277 కోట్ల నుంచి రూ.7,765 కోట్లకు చేరుకునే అవకాశముందన్నారు. ప్రస్తుతం 341 మంది వ్యాపారులు కార్యకలాపాలు నిర్వహిస్తుండగా, భవిష్యత్తులో వారి సంఖ్య 967కు పెరిగే అవకాశం ఉందన్నారు. మార్కెట్ యార్డులో పండ్లతో పాటు పూలు, డ్రై ఫ్రూట్స్, డెయిరీ ఉత్పత్తులు, ఫ్రోజన్ ఫుడ్స్, చేపలు, మాంస ఉత్పత్తుల కోసం ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నిల్వ, గ్రేడింగ్, ప్యాకేజింగ్, లాజిస్టిక్స్, రవాణా, మార్కెటింగ్ సేవలు ఒకేచోట అందుబాటులో ఉండేలా సమగ్ర వ్యవస్థను అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం రూ.2,284  కోట్లు పెట్టుబడి పెట్టనుండగా, ప్రైవేట్ రంగం ద్వారా రూ.1,083  కోట్ల పెట్టుబడులు సమీకరించనున్నట్లు తెలిపా రు. కోహెడ అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ ద్వారా ప్రత్యక్షంగా 14 వేల మందికి, పరోక్షంగా 20 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి తుమ్మల తెలిపారు.