
- కమిషన్ సిఫార్సుల మేరకు బాధ్యులపై చర్యలు
- ఉభయసభల్లో చర్చించాకే భవిష్యత్ కార్యాచరణ
- కేబినెట్ భేటీలో నిర్ణయం
- వాదన వినిపించుకోవడానికి ప్రతిపక్ష నేతలకూ అవకాశమిస్తం: సీఎం రేవంత్
- నాటి ప్రభుత్వ పెద్దలు, ఐఏఎస్‌లు, ఇంజినీర్లు, ఏజెన్సీల పాత్రను కమిషన్ నిగ్గు తేల్చింది
- అంచనాలు మార్చి అవినీతికి పాల్పడ్డట్లు బయటపెట్టింది
- రాజకీయ కక్ష సాధింపుల కోసం సర్కార్ నిర్ణయాలు తీసుకోదు
- చట్ట పరిధిలో ఒక పద్ధతి ప్రకారం ముందుకెళ్తామని వెల్లడి
- కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన 665 పేజీల నివేదికకు కేబినెట్ ఆమోదం
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. కమిషన్ సిఫార్సుల మేరకు బాధ్యులపై చర్యలు ఉంటాయని, ఉభయసభల్లో చర్చించాక భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని తెలిపింది. కమిషన్ రిపోర్ట్‌పై చర్చించేందుకు సెక్రటేరియెట్‌లో సోమవారం మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్సమావేశమైంది. రిపోర్ట్‌పై అధ్యయన కమిటీ రూపొందించిన ఎగ్జిక్యూటివ్ సమ్మరీని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రులకు వివరించారు. 665 పేజీల కమిషన్ రిపోర్ట్‌కు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అనంతరం మంత్రులతో కలిసి సీఎం రేవంత్ మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం కమిషన్ నివేదికను మంత్రివర్గం ఆమోదించినందున త్వరలో శాసనసభ, శాసన మండలిలో ప్రవేశపెట్టి అన్ని రాజకీయపక్షాల అభిప్రాయాలు తీసుకుంటామని వెల్లడించారు. ‘‘పేరు, ఊరు, అంచనాలు మార్చి, అవినీతికి పాల్పడి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కుప్పకూలిపోయింది. కమిషన్ తన నివేదికలో అన్ని విషయాలను స్పష్టంగా పేర్కొంది. నాటి ప్రజాప్రతినిధులు, ఐఏఎస్ అధికారులు, ఇంజినీర్లు, ప్రాజెక్టు ఏజెన్సీ పాత్రను బయటపెట్టింది” అని సీఎం వివరించారు.
నివేదిక సారాంశాన్ని, సూచనల్ని తప్పకుండా ప్రభుత్వం పాటిస్తుందని తెలిపారు. కమిషన్ సిఫార్సుల మేరకు బాధ్యులపై చర్యలు ఉంటాయని, రాజకీయ కక్ష సాధింపుల కోసం ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోదని స్పష్టం చేశారు. చట్ట పరిధిలో ఒక పద్ధతి ప్రకారం ముందుకెళ్తామని, ఉభయసభల్లో తమ వాదన వినిపించేందుకు ప్రతిపక్ష నేతలకు అవకాశమిస్తామన్నారు. ‘‘ఈ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న నాటి సీఎం కేసీఆర్, నాటి సాగునీటి పారుదల శాఖ మంత్రులు, నాటి ఇతర మంత్రులందరికీ తమ అభిప్రాయాలు చెప్పే అవకాశం కల్పిస్తం. అసెంబ్లీలో చర్చల సారాంశం ప్రకారం భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. ఈ విషయంలో ఎలాంటి ఊహాగానాలకు తావు ఇవ్వకూడదనే నివేదిక అందిన నాలుగు రోజుల్లోనే మంత్రివర్గ సమావేశం నిర్వహించి, మీడియాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలు అందించాం” అని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలు, వ్యక్తిగత ద్వేషంతో ఈ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోదని, పారదర్శకంగా వ్యవహరించాలనే ఉద్దేశంతోనే ఈ వివరాలన్నీ బయట పెట్టామన్నారు.
గూడుపుఠాణిపై కవిత ఎందుకు ఫిర్యాదు చేయలే
‘‘మేఘా కృష్ణారెడ్డిని కాళేశ్వరం కమిషన్ ఎందుకు విచారణకు పిలవలేదని కవిత అంటున్నారు కదా?’’ అని మీడియా ప్రస్తావించగా.. ‘‘అది వాళ్ల నాన్నను అడగాలి. ఎందుకంటే ఎవరికి ఏమి ముట్టజెప్పారనేది వాళ్ల ఫాదర్ కి తెలుసు కదా! లేకపోతే కవితనే ఘోష్ కమిషన్ దగ్గరికి వెళ్లి కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో ఎవరెవవరు తమ తండ్రితో కుమ్మక్కయ్యారో నివేదిక ఇవ్వాల్సింది. అలాగే తమ బావ హరీశ్‌రావు ఎవరి నుంచి కమీషన్లు పొందారో చెప్పాల్సింది. వీళ్లందరూ తోడు దొంగలు.. గూడుపుఠాణి చేశారు? అని కమిషన్‌కు ఒక కంప్లైంట్ ఇచ్చిఉంటే కచ్చితంగా పిలిచి ఉండేవాళ్లు.. ఇప్పుడు కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత ఆమె ఎవరిని అడుగుతారు.. ఒకవేళ జస్టిస్ ఘోష్‌ను ప్రశ్నించాలంటే వారు కోల్‌కతాకు వెళ్లి ప్రశ్నలు వేయొచ్చు” అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
చేసిందంతా నాటి సీఎం, నాటి ఇరిగేషన్ మంత్రే : డిప్యూటీ సీఎం భట్టి
కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై స్వతంత్ర కమిషన్‌ను వేసి.. మాజీ సీఎం, నీటిపారుదల శాఖ మాజీ మంత్రి, ఆర్థిక శాఖ మాజీ మంత్రి వాదనలను వినిపించుకున్న తర్వాతే ఈ నివేదికను కమిషన్ ఇచ్చిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. తాము చెప్పేవి రాజకీయపరమైన అంశాలు కావని, ఘోష్ కమిషన్ నివేదికలోని అంశాలనే యథాతథంగా మీడియాకు వెల్లడిస్తున్నామని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రణాళిక, నిర్మాణం, నిర్వహణలో అప్పటి సీఎం ప్రమేయమే ఉందన్నారు. ‘‘మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల నిర్మాణం అప్పటి సీఎం, నాటి నీటిపారుదల శాఖ మంత్రి ఏకైక నిర్ణయం తప్ప.. అది ప్రభుత్వానికి సంబంధించిన అధికారిక నిర్ణయం కాదని కమిషన్ స్పష్టం చేసింది.
నాటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కేబినెట్ సబ్ కమిటీలో జరిగిన నిర్ణయం కేబినెట్‌లో ఆమోదం పొందిందని చెప్పడం సరైంది కాదని కమిషన్ తేల్చి చెప్పింది. కేబినెట్‌లో ఆమోదం జరగలేదని, ఆయన కమిషన్‌కు తప్పుడు నివేదిక ఇచ్చారని కమిషన్ స్పష్టం చేసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులకు సంబంధించిన కీలక నిర్ణయాలు తెలియవని నాటి ఆర్థిక మంత్రి చెప్పడం కూడా సరైనది కాదని కమిషన్ అభిప్రాయపడింది” అని భట్టి వివరించారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి ప్రాంతాలు మార్చడంలో బ్యాక్‌వాటర్ స్టడీస్, జియోఫిజికల్ ఇన్వెస్టిగేషన్స్ వంటి అధ్యయనాలు జరగలేదని కమిషన్ నివేదికలో పేర్కొందన్నారు. క్షేత్రస్థాయి అధ్యయనాలు లేకుండానే ఆలస్యంగా డిజైన్లు తయారు చేశారని తెలిపిందన్నారు. ‘‘తుమ్మిడిహెట్టిలో నీటి లభ్యత లేదని చెప్పడం సరైంది కాదని, రిటైర్డ్ ఎక్స్‌పర్ట్ ఇంజినీర్స్ కమిటీ సూచనల మేరకు బ్యారేజీ నిర్మాణ స్థలం మార్చామని చెప్పిన విధానం కరెక్ట్ కాదని నివేదికలో ఉంది” అని డిప్యూటీ సీఎం భట్టి వివరించారు.