హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనూ గడిచిన పదేళ్లలో మహబూబ్ నగర్ జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కృష్ణా జలాల అంశంపై శనివారం (జనవరి 3) సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ.. కృష్ణా నదీ ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియాల్సి ఉందన్నారు. ఇరిగేషన్ విషయంలో వాస్తవాలను సభ ద్వారా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా విషయాలు, వాస్తవాలను సభకు వివరించారన్నారు. ఇరిగేషన్ విషయంలో సభ్యులంతా తమ ఆలోచనలు, అభిప్రాయాలను చెప్పారన్నారు.
ఎంతో అనుభవం ఉన్న మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి సలహాలు, సూచనలు ఇస్తారనుకున్నామన్నారు. కేసీఆర్ కృష్ణా, గోదావరి జలాల అంశం లేవనెత్తితే రాష్ట్రానికి ఉపయోగపడే సలహాలు ఇస్తారేమోనని ఆశించి అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేశామన్నారు.
‘సభలో కేసీఆర్ విలువైన సలహాలు, సూచనలు చేస్తే స్వీకరించాలనుకున్నాం. అలాగే మేం పాలమూరుకు అన్యాయం చేస్తున్నామని కేసీఆర్ అన్నారు. ప్రభుత్వం తోలు తీస్తాం.. బట్టలిప్పుతామన్నారు. దీంతో సభలోనే ముఖాముఖి చర్చ ద్వారా ద్రోహులు ఎవరో తేల్చుదామనుకున్నాం. కానీ బీఆర్ఎస్ సభను బహిష్కరించింది’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ సభను బాయ్ కాట్ చేయడంతో ప్రజలకు ఏం ఉపయోగమని ప్రశ్నించారు. ప్రజా సమస్యలు లేవనెత్తేందుకు వేదికైనా అసెంబ్లీలో ప్రతిపక్ష నేతలు మాట్లాడకుంటే అంతిమంగా ప్రజలకే అన్యాయం జరుగుతోందన్నారు. రెండేళ్లుగా ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం విచారకరమన్నారు.
ప్రభుత్వం తోలు తీస్తామన్న కేసీఆర్.. సభకు రాకుండా ఎక్కడికి పోయారని నిలదీశారు. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు రావాలని మేం పదే పదే విజ్ఞప్తి చేశామని గుర్తు చేశారు. కేసీఆర్ సభకు రాకపోవడానికి కారణాలేమి లేవని.. ఈసారి సభలో కూడా ఆయనపై అనుచిత వ్యాఖ్యలు కూడా ఎవరు చేయలేదన్నారు. ఎలాంటి కారణం లేకుండా సభను బాయ్ కాట్ చేయడంతో చట్టసభల పట్ల బీఆర్ఎస్కు ఉన్న చిన్నచూపు మరోసారి బయటపడిందని విమర్శించారు.
