మూత్రం బాధితుడి కాళ్లు కడిగిన ముఖ్యమంత్రి

మూత్రం బాధితుడి కాళ్లు కడిగిన ముఖ్యమంత్రి

ఓ మనిషి ముఖంపై మూత్రం పోసిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం అయ్యింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో.. ఓ ఆదివాసీ గిరిజనుడిపై.. బీజేపీకి చెందిన ప్రవేశ్​ శుక్లా.. మూత్రం పోయటమే కాకుండా.. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనిపై మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా.. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఆదివాసీలు, గిరిజనులపై సమాజంలోని చిన్నచూపునకు ఈ ఘటన నిదర్శనం అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​గాంధీ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ.. బీజేపీ నేతల విద్వేష సంస్కృతికి అద్దం పడుతోందని విమర్శించారు. బీజేపీ పాలనలో దేశంలో ఆదివాసీ, గిరిజనులకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు.  

ఈ క్రమంలోనే ఆందోళనలు, విమర్శలను చల్లార్చేందుకు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్వయంగా రంగంలోకి దిగారు. బాధితుడు అయిన దశరత్ రావత్​ ను స్వయంగా తన ఇంటికి ఆహ్వానించారు. నట్టింట్లో.. పెద్ద కుర్చీ వేసి కూర్చోబెట్టారు. సీఎం చౌహాన్ కింద కూర్చుని.. బాధితుడి కాళ్లు కడిగారు. నీళ్లు నెత్తిన చల్లుకున్నారు. 

బాధితుడిని శాలువాతో సత్కరించారు. స్వీట్లు అతనితో స్వయంగా తినిపించారు. పక్కనే కూర్చుని మాట్లాడారు. జరిగిన ఘటనకు నేను క్షమాపణలు చెబుతున్నాను.. నన్ను క్షమించండి అంటూ చేతులు జోడించి వేడుకున్నారు సీఎం. 

వీడియో చూసి చాలా బాధపడ్డాను.. మీకు క్షమాపణలు చెబుతున్నాను.. పెద్ద మనస్సుతో మన్నించండి అంటూ సీఎం చౌహాన్.. బాధితుడు రావత్ ను స్వయంగా కోరారు. నిందితుడిని ఇప్పటికే అరెస్ట్ చేశామని.. కఠిన చర్యలు తీసుకుంటామని.. నిందితుడి ఇంటిని కూల్చేసినట్లు గుర్తు చేశారు. తీవ్ర నేరం కింద అతనికి కఠిన శిక్ష పడే విధంగా కేసు విచారణ జరుగుతుందని హామీ ఇచ్చారు.