బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటున్నట్లు సిద్ధరామయ్య ప్రకటించారు. ఈ మేరకు తన నిర్ణయాన్ని మంత్రులకు తెలిపారు. కేబినెట్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. బ్రేక్ ఫాస్ట్ మీటింగ్లో డీకే శివకుమార్తో భేటీ అనంతరం సిద్దరామయ్య తన నిర్ణయాన్ని మంత్రులకు తెలియజేయడం గమనార్హం.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సమావేశంలో సీఎం సిద్దరామయ్య తన నిర్ణయాన్ని మంత్రులకు తెలియజేశారు. కర్నాటక కొత్త ముఖ్యమంత్రిగా పీసీసీ చీఫ్, ప్రస్తుత డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నియామకానికి ఇప్పటికే లైన్ క్లియర్ అయిన సంగతి తెలిసిందే.
కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాల మేరకు సీఎం పదవి నుంచి దిగిపోయి, రాజ్యసభకు వెళ్లడానికి సిద్ధరామయ్య అంగీకరించినట్లుగా సమాచారం. ముందుగా కర్నాటక తదుపరి సీఎంగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే పేరును హైకమాండ్ పరిశీలించినప్పటికీ.. వయోభారం, ఆరోగ్య కారణాల రీత్యా సీఎం పదవి చేపట్టేందుకు ఆయన అంగీకరించలేదని తెలిసింది. దీంతో డీకే శివకుమార్‌ను కొత్త సీఎంగా నియమించాలని కాంగ్రెస్ హైకమాండ్ మంగళవారం రాత్రి ఆలస్యంగా నిర్ణయించిందని పార్టీ వర్గాలు తెలిపాయి.
కర్నాటకలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధూ, డీకే సారథ్యంలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. సీఎం పదవి కోసం ఇరువురు నేతలు పోటీ పడగా, చెరో రెండున్నరేళ్లు సీఎం పదవి చేపట్టేలా హైకమాండ్ సర్దిచెప్పింది. ఈ నేపథ్యంలో ఏడాదికిపైగా సీఎం పదవి కోసం డీకే వర్గం నుంచి ఒత్తిడి పెరుగుతోంది.
అలాగే హైకమాండ్ వాగ్దానం ప్రకారం, డీకేకు నాయకత్వాన్ని అప్పగించాలని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకగాంధీ గట్టిగా మద్దతు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలో మళ్లీ 2028లో అసెంబ్లీ ఎన్నికలు రానున్నందున.. ఆలోగా పార్టీని మళ్లీ పూర్తిస్థాయిలో సిద్ధం చేసి, ఎన్నికల్లో గెలిచేలా చూసే బాధ్యతను కూడా డీకేపైనే పెట్టినట్టుగా సమాచారం.
