ప్రభుత్వాలకు, పార్టీలకు మద్యం అతి ముఖ్యమైన ఆదాయ వనరు. వివిధ స్కీమ్ లను ప్రభుత్వాలు నడపాలన్నా.. పార్టీలను నడపాలన్నా లిక్కర్ కలెక్షన్లపై ఆధారపడుతున్న పరిస్థితి. దాదాపు అన్ని రాష్ట్రాలలో ఇదే సిచువేషన్. తమిళనాడులో లిక్కర్ వసూళ్ల ద్వారా పార్టీ ఫండ్ రూపంలో దారి మళ్లిన రూ.1600 కోట్ల గురించి తెలుసుకున్న సీఎం విజయ్.. ఈ వ్యవహారంపై సీరియస్ అయ్యారు. శుక్రవారం (జూన్ 05) జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో.. పార్టీ ఫండ్ పేరుతో జరిగే అక్రమ వసూళ్లపై కొరడా ఝుళిపించనున్నట్లు చెప్పారు.
తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పోరేషన్ (TASMAC) వెనుక జరిగిన అవినీతిపై ఆగ్రహించిన విజయ్.. అక్రమ వసూళ్లకు చెక్ పెట్టాల్సిందేనని అధికారులకు ఆదేశాలిచ్చారు. అయితే లిక్కర్ కలెక్షన్ల నుంచి నెలకు 102 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ రూపంలో జరుగుతున్న దారిమళ్లింపు విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. టాస్మాక్ ను డీఎంకే పార్టీ ఎలా దుర్వినియోగం చేసిందో నిగ్గుతేల్చనున్నట్లు చెప్పారు.
టాస్మాక్ వెనుక జరుగుతున్న అక్రమ వసూళ్ల దందాను వెంటనే అడ్డుకోవాల్సిందిగా సీఎం ఆదేశించారు. టాస్మాక్ ఆధ్వర్యంలో ఉన్న హోల్ సేల్, రిటైల్ షాపులలో ఈ దందా జరుగుతున్నట్లు గుర్తించారు. మొత్తం 4 వేల 48 ఔట్ లెట్లు టాస్మాక్ కింద ఉన్నాయి.
తొలిసారి మంత్రి పదవి చేపట్టిన ఎక్సైజ్ శాఖ మంత్రి కే.విగ్నేష్.. ఎక్సైజ్ శాఖలో పూర్తి సంస్కరణలు తీసుకురానున్నట్లు చెప్పారు. ప్రభుత్వానికి అవినీతి రూపంలో వచ్చే డబ్బు లేదా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే వచ్చే ఆదాయం అవసరం లేదని కేబినెట్ మీటింగ్ లో సీఎం విజయ్ చెప్పారు.
ఒక్కో కాటన్పై ఒక్కో రేటు.. అక్రమ వసూళ్లు
ఎక్సైజ్ శాఖ అధికారుల ప్రకారం.. టాస్మాక్ సప్లై చైన్ కింద గత 20 ఏళ్లుగా అనధికార వసూళ్ల రాజ్యం నడుస్తోంది. ముఖ్యంగా మద్యం కాటన్లపై ఒక్కో కాటన్ పై ఒక్కో రేటు వసూళ్లు చేసినట్లు తేల్చారు.
లిక్కర్ (మందు) కాటన్ పై 90 రూపాయలు వసూలు చేసేవారు. అదే విధంగా 12 బాటిళ్ల బీర్ కాటన్ పై 40 రూపాయలు, వైన్ కాటన్ పై 20 రూపాయలు వసూలు చేసేవారు. ఈ మొత్తాన్ని పాటీ ఫండ్ కింద మళ్లించేవారని తెలిపారు. వేర్ హౌజ్, ట్రాన్స్ పోర్ట్, ఔట్ లెట్స్ దగ్గర వసూళ్లు చేసినట్లు తెలిపారు.
టాస్మాక్ ద్వారా ప్రతి నెల 88 లక్షల వినియోగదారులు లిక్కర్ ను కొంటుంటారు. ఈ లెక్క ప్రకారం.. నెలకు 102 కోట్లర ఊపాయలు అనధికారికంగా మళ్లించేవారు.
ఈ విషయం తెలుసుకున్న సీఎం.. ప్రతి డిపార్ట్మెంటులో ఇలాంటి అక్రమ వసూళ్లు, దారి మళ్లింపులను గుర్తించాల్సిందిగా ఆదేశించారు. గత ప్రభుత్వాల హయాంలో జరిగిన అవకతవకలను గుర్తించేందుకు.. ముందుగా టాస్మాక్ శాఖపై ఫోకస్ పెట్టారు. సీఎం విజయ్ తదుపరి టార్గెట్.. మైనింగ్ శాఖగా చెబుతున్నారు.
సీఎం విజయ్ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రవ్యాప్తగా ఉన్న 717 లిక్కర్ షాపులను మూసివేయించిన విషయం తెలిసిందే. స్కూల్స్, కాలేజెస్ మొదలైన ప్రాంతాలలో ఉన్న వైన్స్ షాపులను మూసివేయించారు. దీంతో రాష్ట్రానికి 8 వేల కోట్ల ఆదాయం నష్టం జరగనున్నట్లు అధికారులు చెప్పారు. అయినప్పటికీ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని.. వైన్స్ షాపులను మూసివేయించిన విజయ్.. లేటెస్టుగా TASMAC సంస్థలో జరిగిన అవకతవకలపై చర్యలకు సిద్ధమయ్యారు.
